Breaking News

ఈశాన్య భారతంలో బంగారు తీగ

ఈశాన్య భారతంలో బంగారు తీగ
సాధారణంగా మొక్కలు తమ ఆకులలో ఉండే పత్రహరితం అనే ఆకుపచ్చ పదార్థం సాయంతో తమ వేళ్ళ ద్వారా నేలనుంచి గ్రహించిన నీటినీ, ఖనిజ లవణాలనూ, వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డైఆక్సైడ్ )ను ఉపయోగించి సూర్యకాంతిలో తమ శక్తి అవసరాలకు సరిపడా స్వయంగా పిండిపదార్థం తయారు చేసుకుంటాయి. ఆ ఆకుపచ్చటి పదార్థాన్ని ఆంగ్లంలో క్లోరోఫిల్ (Chlorophyll) అంటారు. సూర్యరశ్మిలో పిండి పదార్థం తయారు చేసుకునే ఆ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) అంటారు. పెరుగుదల
( growth), పునరుత్పత్తి (reproduction) వంటి ప్రక్రియలకు మొక్కలకు శక్తి అవసరం. అయితే తమ కాండం మరియు ఆకులలో తగినంత పత్రహరితంలేని మొక్కలు తమ శక్తి అవసరాలకోసం ఇతర మొక్కల మీద ఆధారపడక తప్పదు. వాటిని పరాన్నజీవులు (Parasites) అంటారు. అవి ఇతర మొక్కలనుంచి పాక్షికంగా, లేక పూర్తిగా తమ శక్తి అవసరాలు తీర్చుకుంటాయి. అవి నీటిని, ఖనిజలవణాలను, బలవర్ధక పదార్థాలను గ్రహిస్తాయి. ఇందుకోసం పరాన్నజీవి మొక్కలు తమకుండే హాస్టోరియా (Haustoria) అనే ప్రత్యేకమైన వేళ్ళను ఆతిథ్యమిచ్చిన మొక్క కాండం లేక వేళ్ళలోకి జొప్పించి వాటిని గ్రహిస్తాయి. ఇలాంటి పరాన్నజీవులు పుష్పించే మొక్కలలో దాదాపు నాలుగువేల అయిదు వందల జాతులున్నాయి. తమకు ఆతిథ్యమిచ్చే మొక్కలపై పాక్షికంగా ఆధారపడే పరాన్నజీవి మొక్కల్ని అర్ధ పరాన్నజీవులు (Hemiparasites) అనీ, పూర్తిగా ఆధారపడేవాటిని పూర్తి పరాన్నజీవులు (Holoparasites) అనీ అంటారు. వీటిలో ఆతిథ్యం ఇచ్చిన మొక్క కాండం మీద ఆధారపడి పెరిగేవాటిని కాండపు పరాన్నజీవులు (Stem Parasites) అంటే వేళ్ళను ఆధారంచేసుకుని పెరిగే వాటిని మూల పరాన్నజీవులు (Root Parasites) అంటారు.
పూర్తి పరాన్నజీవి మొక్కలలో పత్రహరితం దాదాపుగా ఉండదు. మన ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాలలో సర్వసాధారణంగా ఇతర మొక్కల కాండాలపై పెరుగుతూ మనకు కనుపించే బంగారు తీగ అనే ఓ పూర్తి పరాన్నజీవిని మేము అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలోని మాగాణి పొలాల పరిసరాలలో కూడా పలు తావులలో చూశాం. ముఖ్యంగా గువాహాటి – తేజ్ పూర్ ల మధ్య బంగారు పసుపు వన్నెలో మెరిసిపోతూ ఉన్న ఈ పరాన్నజీవి తీగలు ఇతర మొక్కలమీద పెరుగుతూ విస్తారంగా కనుపించాయి. వాటిని ఫోటోలు తీశాం.బ్రహ్మపుత్ర మైదానాలలోని భూమి తీరుతెన్నులు, వాతావరణం ఇంచుమించు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా, గోదావరి నదీ లోయలను తలపించేదిగానే ఉండడం మేము గమనించాం.
హిందీలో ‘అమర్ బేల్’ అని పిలిచే ఈ బంగారు తీగను ఆంగ్లంలో Chinese Dodder అంటారు. కన్వాల్వులేసీ (Convolvulaceae) కుటుంబానికి చెందిన బంగారు తీగను శాస్త్రీయంగా కస్కుటా చినెన్సిస్ (Cuscuta chinensis ) అంటారు. కొందరు దీనిని కస్క్యూటా అని కూడా పలుకుతారు. చైనాకు చెందిన మొక్క కనుక దీనికి చినెన్సిస్ అనే పేరు వచ్చింది. బంగారు వన్నెలో ఎక్కడా ఆకులు లేకుండా ఉండే ఈ తీగను మనం తేలికగానే గుర్తించవచ్చు. ఈ మొక్క ఆకులు చిన్న చిన్న పొలుసులుగా రూపాంతరం చెందివుంటాయి. నడి వేసవి నుంచి తొలకరి వానలు పడే లోపు ఈ తీగలు పుష్పించి చిన్న కాయలు కాస్తాయి. కాయలు తీగ రంగులోనే ఉంటాయి. పూలు ఆయా ఉపజాతినిబట్టి తెలుపు, పింకు లేక బంగారు వన్నెలో ఉంటాయి. బటానీ గింజలంత ఉండే దీని కాయల్లో చిన్న గింజలు అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ గింజల రక్షక కవచాలు (seed coats) చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఆ గింజలు చెడిపోకుండా ఐదారేళ్ళ వరకూ ఉంటాయి. ఒక్కోసారి ఆ గింజలు పదేళ్లకు మొలిచిన సందర్భాలూ ఉంటాయి. మన ప్రాంతంలో బంగారు తీగ వరిసాగు కాలంలో భూమిలో నిద్రాణంగా ఉండి, తరువాత మొలకెత్తి రెండవ పంటగా సాగుచేసే మినుము, పెసర, పిల్లిపెసర పంటలపై ఆధారపడి జీవిస్తుంది. ఈ తీగను రైతులు చేతులతో లాగివేయడం, లేక రసాయనాలు చల్లడం ద్వారా నిర్మూలిస్తారు. అయితే తీగ పుష్పించే లోపుగానే ఈ పని చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మొండి మొక్క కనుక కాయలు పగిలి ఏ పరిస్థితులలో విత్తన వ్యాప్తి జరగకుండా రైతులు జాగ్రత్త వహించాలి.
యూనానీ, చైనీస్ వైద్య విధానాలలో ఈ తీగకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. చైనీస్ వైద్యంలో దీనికి శృంగారోద్దీపికం (Aphrodisiac) గా మంచి పేరుంది. వృద్ధాప్యం సంప్రాప్తించకుండా చైనీయులు ఈ తీగను వాడతారు. నోటి అరుచి (anorexia)కి, చూపు మసకబారినా, జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోయినా బంగారు తీగను వినియోగిస్తారు. అంతే కాదు – దీనికి మంచి లివర్ టానిక్ గానూ పేరుంది. మూత్రం జారీగా రానివారికి (Dysuria) ఇది దివ్యౌషధం. కడుపు ఉబ్బరం, కాలేయ వ్యాధులు, దీర్ఘకాలం నుంచి అజీర్తి సమస్యలు ఉన్నవారికి బంగారు తీగ కాండం యొక్క కషాయం లోనికిస్తారు. రక్త శుద్ధికి దీని గింజలు, సుగంధపాల వేళ్ళతో కలిపి నూరి రసం తీసుకు తాగితే ప్రయోజనం ఉంటుంది. కడుపులో నుంచి గ్యాస్ ను వెడలింపజేయడానికి ఈ గింజల రసం బాగా పనిచేస్తుంది. దగ్గు, జ్వరాల్లో కూడా ఈ రసాన్ని ఉపయోగిస్తారు.
మరిన్ని వివరాల కోసం ‘ ది ఇండియన్ మెటీరియా మెడికా’ వంటి గ్రంథాలు పరిశీలించవచ్చు.
— మీ.. రవీంద్రనాథ్.—-98491 31029

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *