Breaking News

గాడిద కథ – కమామిషూ

గాడిద కథ – కమామిషూ

మా చినరావూరుకి అప్పుడప్పుడూ కొన్ని గాడిదలు అతిథులుగా వస్తాయి. ఎక్కడినుంచి వస్తాయో తెలియదుగానీ వరసనే నాలుగు రోజులు కనిపిస్తే మళ్ళీ వారం దాకా పతా లేకుండాపోతాయి. నేను ఉదయపు నడకకు వెళ్ళినప్పుడు వాటిని శ్రద్ధగా గమనిస్తూ ఉంటాను. అవి అలా దారికి అడ్డంగా నిలబడే నిద్రపోతుంటాయి. రోడ్డు మధ్యలో అవి నిలబడితే ఎంత పెద్ద వాహనాలైనా సరే తప్పుకుని పోవలసిందేగానీ అవి మాత్రం ఒక పట్టాన దారి ఇవ్వవు. ఇలా తొలగకుండా దారికి అడ్డంగా నిలబడతాయి కనుకనే వాటిని అడ్డగాడిదలు అంటారేమోననిపిస్తుంది వాటి ధోరణి చూస్తుంటే. నేను ఈ అడ్డగాడిదలను మొన్న కొన్ని ఫోటోలు తీశాను. గాడిదల గురించి నాకు తెలిసిన సమాచారాన్ని నాకు గుర్తున్నమేరకు పొందుపరుస్తూ ఈ టపా రూపొందించాను.

gadida01 gadida02 gadida03

గాడిద – ఒక పరిచయం

గాడిద, గాడ్ద, గాడిదె, గాడ్దె అంటూ మనం పలువిధాలుగా పిలిచే గాడిద జంతువులన్నింటిలోకీ విలువ తక్కువదని భావిస్తారు. గాడిద పరిమాణంలో గుర్రం కంటే చిన్నదిగా ఉన్నా దాని చెవులు మాత్రం గుర్రపు చెవుల కంటే బాగా పెద్దవిగా ఉంటాయి. ‘ అయితే గాడిదా గుర్రం ఒకటేనంటావా ?’, ‘ ఎన్నిచెప్పినా గుర్రం గుర్రమే, గాడిద గాడిదే’, ‘రేపటికి గాడిదే గుర్రం అవుతుంది ; గుర్రం గాడిద కూడా అవచ్చు’ వంటి ప్రయోగాలు మనం విన్నవే. గుర్రం శ్రేష్ఠమైన జాతికీ, గాడిద హీనజాతికీ చెందినవనే మన భావన వల్లే ఈ తరహా పద ప్రయోగాలు వాడుకలోకొచ్చాయి.

గాడిదలకు వెనుక కాళ్ళ మధ్య ఒక విధమైన ‘దొడ్డి’ ఉంటుంది. ఇలాంటి కాళ్ళున్న (Bandy-legged) మనిషిని ‘ముట్టు మోకాళ్లవాడు’ లేక ‘గాడిద కాళ్ళవాడు’ అంటారు. రెండు మోకాళ్లూ ఒకదానికొకటి రాసుకుంటూ, కింది భాగంలో రెండూ ఎడంగా ఉండే కారణంగా, గాడిదలు వెనుక కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తాయి. వికారమైన ఈ తరహా నడకను ‘గాడిద నడక’ అంటుంటాం. వెనుక కాళ్ళు కురచగా ఉండే కారణంగా గాడిదలాగే వికారంగా నడిచే మాంసాహార జంతువు ‘దుమ్ముల గొండి’ లేక ‘కొర్నవ గండు’ (Hyena) ను దాని శరీరంపై ఉండే చారలనుబట్టి ‘గాడిద పులి’ అంటారు.

శాస్త్రీయ సమాచారం

గుర్రం ప్రజాతి (Genus)ని లాటిన్ భాషలో ఈక్వస్ ( Equus ) అంటారు. దాని మీదుగానే గుర్రపు పందాలను Equestrian Races అంటారు. ఇదే Equus ప్రజాతికే చెందిన ఈ గాడిదలలో రెండు తరహాలున్నాయి. మొదటిది ఆఫ్రికన్ గాడిద. దాని శాస్త్రీయ నామం 
ఈక్వస్ ఆఫ్రికానస్ (Equus africanus). రెండవది ఆసియన్ గాడిద. దాని శాస్త్రీయనామం ఈక్వస్ హెమియోనస్ ( Equus hemionus). ఆంగ్లభాషలో ఇంకా మచ్చిక కాని అడవి గాడిదను ‘యాస్’ (Ass ) అనీ, మచ్చికైన పెంపుడు గాడిదను ‘డాంకీ’ ( Donkey) అనీ అంటారు. Asinus అనే లాటిన్ పదం నుంచి Ass శబ్దం ఏర్పడింది.

సాహిత్యంలో గాడిద

ఆంగ్ల సాహిత్యంలో Ass, Donkey శబ్దాలు రెండింటినీ ‘మూఢుడు’ లేక ‘అవివేకి’ అనే అర్థంలోనూ ప్రయోగిస్తారు. తెలుగులో కూడా విలువ తక్కువ మనిషిని గాడిద అనడం వాడుక. అంతేకాదు. వివేక శూన్యుడైన వ్యక్తినీ గాడిద అనడం పరిపాటి. గ్రహింపు లేని వ్యక్తిని 
‘ ఒకసారి చెపితే అర్థం కాదా ? నువ్వు మనిషివా ? గాడిదవా ?’ అంటుంటాం.

” పిండములనుజేసి పితరుల దలపోసి

కాకులకునుబెట్టు గాడ్దెలారా !”

అంటూ పితృదేవతలను తలచుకుంటూ కాకులకు పిండాలు పెట్టేవారి అవివేకాన్ని వేమన ఏనాడో పరుషంగా విమర్శించాడు.

ఏబ్రాసి గాడిద, అడ్డగాడిద వంటి పదాలు తెలుగు చలన చిత్రాలలో తరచు ప్రఖ్యాత సినీ నటుడు కీ. శే. సి. యస్.ఆర్. నోటివెంట వినేవాళ్ళం. దొంగ గాడిదా, గాడిదకొడకా అని తిట్టటం సర్వసాధారణం. ఎవరో ఎవరినో ” గాడిదకొడకా !” అనే తిడుతూ ఉంటే ఒకసారి ఓ గాడిద విని ఏడ్చిందట – ‘ఛీ .. ఛీ .. వీడా నాకొడుకు ?’ – అని.

ఆడిన మాటలు తప్పిన 
గాడిద కొడుకంచు తిట్టగా విని ‘అయ్యో!
వీడా నా కొడుక’ని 
గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!

గాడిదను తెలుగు సాహిత్యంలో ఖరము, గర్దభము, గార్దభము, చక్రీవంతము, ధూసరము, బాలేయము, రాసభము, గాలిగాడు, గాడ్దె, గాడ్ద అంటూ పలు విధాలుగా పేర్కొన్నారు.

గంగిగోవు పాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు ?
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ – అన్నాడు వేమన.

‘ వేంకటేశ నిఘంటువు’ గాడిద గురించి ‘ ఱేవుగుఱ్ఱము, గాలిగాడు, గాడిదయనంగను ఖరము రాగిలుచుండు’ అని ప్రస్తావించింది. ఱేవుగుఱ్ఱము, గాలిగాడు, గాడిద అనే పేర్లతో ఖరము రాగిల్లుతూ (రాజిల్లుతూ) ఉంటుందట. చాకి ఱేవులో వస్త్రాలు శుద్ధి (చలువ) చేసే చాకలికీ, గాడిదకూ అనాదిగా అవినాభావ సంబంధం ఉంది. వస్త్రశుద్ధి శ్రామికులు మైల బట్టలను ఉతికేందుకు చాకిరేవుకూ, తిరిగి శుద్ధిచేసి, ఆరబెట్టిన(చలువ చేసిన) మడి బట్టలను ఇంటికి మోసేందుకు అతి ప్రాచీన కాలం నుంచీ మచ్చిక చేసిన గాడిదలనే ఉపయోగించేవారు. అందుకే గాడిదను ‘ చలువ గుఱ్ఱము’ అనీ ‘ ఱేవు గుఱ్ఱము’ అనీ అనడం. ‘ బండ చాకిరీ చాకలిపాలు – బండెడు మోత గాడిద పాలు’ అని లోకోక్తి. ఆంగ్ల భాషలో ‘Asses are born to bear’ 
( గాడిదలు మోయడానికే పుట్టాయి) అనే నానుడి ఉంది. గాడిద బరువులు మోయడంలో దిట్ట. అందుకే భారవాహక జంతువుల (Beasts of Burden) లో గాడిదది ఒక ప్రత్యేకమైన స్థానం. ఎత్తైన ప్రదేశాలలో మొండిగా ఎక్కువదూరాలు ఓర్పుగా బరువులను మోసే గుణం దీనికున్న కారణంగా Pack Animals లో గాడిద స్థానం అద్వితీయం. అలాగే గాడిదను ఎంత బాదినా తట్టుకుంటుంది. బండతనం, మొండితనం విషయంలో మనం గాడిదనే చెప్పుకోవాలి. ఏ పరిస్థితులలోనూ ఏ మాత్రం చలించని మొండితనం దానిది. పొద్దస్తమానం కఠినమైన శ్రమచేసే దాని స్వభావాన్నిబట్టి కఠినమైన శ్రమను ‘గాడిద చాకిరీ ‘ అనడం వాడుకయింది. ఒకప్పుడు దొమ్మరి కులస్థులు తమ విద్యలు ప్రదర్శిస్తూ ఊరూరూ తిరిగేటప్పుడు తమ గడలు, ఇతర సరంజామా అంతా ఒకచోటినుంచి మరో చోటికి మోసుకువెళ్లడానికి గాడిదలనే ఉపయోగించేవారు. అందుకే దొమ్మరి బృందాల దగ్గర గాడిదలు పెద్దసంఖ్యలో ఉండేవి. గాడిదలు బరువుల మోతకే తప్ప వ్యవసాయంలో భూమి దున్నడానికి పెద్దగా పనికిరావు. ఆ కారణంగానే ‘ గాడిదలే దున్నితే దొమ్మరులు పంటకాపులు కారా ? ‘ అనే సామెత ఏర్పడింది.

కంచర గాడిద

గాడిదలలో కంచరగాడిద అనే సంకరజాతి గాడిద ఒకటి ఉంది. దీనిని ‘అశ్వతరము’ అంటారు. ‘కంచరము’ అనేది ఒకప్పుడు జనం వాడిన చిన్న బండి. ఆ బండిని లాగేందుకు ఉపయోగించిన గాడిదలను ‘కంచర గాడిదలు’ అనడం వాడుక అయింది. కంచర గాడిద అంటే ఒక మగ గాడిదకూ, ఆడ గుర్రానికీ పుట్టిన జంతువు. గాడిదను ఆంగ్లంలో ‘Ass’ అనీ, ‘Donkey’ అనీ అంటే, కంచర గాడిదను ‘Mule’ అంటారు. కంచర గాడిద బహు మొండి, బండ జంతువు. ఎంత కష్టాన్నైనా మొండిగా సహిస్తుంది. ఎంత బరువులనైనా ఓపిగ్గా లాగేస్తుంది. ఆంగ్లంలో అవివేకంగా, మొండిగా వ్యవహరించే వ్యక్తిని ‘Mule’ అంటారు. అర్థంలేని మొండి పట్టుదలను ‘Mulish Tenacity’ అంటారు.

కన్నపు దొంగలు – గాడిదలు.

ఎరుకల కులస్థులు అనాదిగా గాడిదలను పెంచుతారు. ఒకప్పటి వారి కులవృత్తి దొంగతనం. వారు బృందాలుగా ఏర్పడి ఊరు వెలుపల తాత్కాలికంగా ఏర్పరచుకున్న గుడారాలలో నివసించేవారు. ఎరుకలసానులు పగలు గృహస్థులకు ‘ఎరుక’ చెపుతూ ఇల్లిల్లూ తిరుగుతూ, దొంగతనానికి అనువైన ఇళ్లను గుర్తించి, వాటి ఆనుపానులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రాత్రి వేళల్లో మగవాళ్ళు తాము అనువైనవిగా ఎంచుకున్న ఇళ్లకు కన్నాలు వేసి, దొంగతనాలు చేస్తారు. అప్పట్లో కొండరాళ్లతో, మట్టి అడుసుతో నిర్మించిన ఇంటి గోడలు ఎలాంటి శబ్దం రాకుండా కన్నాలు వేసేందుకు అనువుగా ఉండేవి. పగలంతా శారీరక శ్రమచేసిన గృహస్థులు ఒళ్ళుతెలియని గాఢనిద్ర పోయేవారు. అందుకే అప్పట్లో దొంగలు ఇళ్లకు సులువుగా కన్నాలు వేయగలిగేవారు. తెనాలి రామలింగకవి రాసిన ‘ ఉద్భటారాధ్య చరిత్రము’ కావ్యంలో మదాలసుడు ఇలా తలపోస్తాడు.
క. కడియును గత్తియు నాచే

వడియుండిన యేని పద్మభవునిల్లైనన్

వడి జొచ్చి కన్నమున వెస

వెడలింపనె మినుకకుండ వేదండంబున్.

కడి అంటే కన్నం వెయ్యడానికి వాడే తవ్వుగోల లేక దొంగలు మొరిగే కుక్కలకు వేసే విషాన్నపు ముద్ద అని రెండు అర్థాలు. పద్మభవుడు అంటే బ్రహ్మ. వెసన్ – వేగముగా. వేదండము – ఏనుగు. మినుకకుండ – ఎలాంటి అలికిడి కాకుండా. 
” కడి, కత్తి నా చేతిలో ఉంటే బ్రహ్మ ఇంటికైనా కన్నం వేసి, ఆ కన్నంలోనుంచి ఎలాంటి అలికిడి కాకుండా ఏనుగునైనా సరే బయటికి తీసుకురానా ? ” అని భావం. అలాంటిది నాటి కన్నపు దొంగల ప్రతిభ.

అయితే ఒకవేళ ఎప్పుడన్నా ఈ కన్నం వేసే అలికిడికి ఇంటి యజమానులు లేస్తే, వారు లోపలివైపు గొడ్డళ్లతో కాచుకుని ఉండి కన్నంలో నుంచి లోపలికి దూరే దొంగలను కసిగా తలలు నరికేసేవారట. అందుకే ఆ దొంగలు కన్నంలో ముందు తల దూర్చకుండా ఒక కాలు లోపలపెట్టి ఆడించి, ఏ ప్రమాదమూ లేదని నిర్ధారణ అయ్యాక మాత్రమే లోనికి ప్రవేశించేవారట. ఇలా దొంగలు కన్నంలోంచి లోనికి పెట్టిన కాలును ఇంట్లోని వారు నరికేసే సందర్భాలు కూడా తరచుగా ఉండేవట. అప్పుడిక ఆ దొంగ తెగింపుగా మొండి ధైర్యంతో ఒంటికాలుతోనే పరుగెత్తుకుంటూ పారిపోయి ప్రాణాలు కాపాడుకునేవాడట. ఇలాంటి సందర్భాలలో ఆ దొంగలకు బాగా తెగువ, మొండితనం అవసరం. అందుకే ప్రాచీనకాలంలో ఎరుకల కులస్థులు మొండి ధైర్యంకోసం గాడిదలను పెంచుతూ, వాటి పాలు, పచ్చి రక్తం తాగడం, మాంసం వండుకుని తినడం చేసేవారట. అలా చేస్తే గాడిద లాగే తమకూ మొండితనం అలవడుతుందని వారి నమ్మకం. ఆంగ్లేయుల వలస పాలనాకాలంలో ఈ ఎఱుకలవారిని వారున్న గ్రామాలనుంచి తరలించి, వారికోసం ఒకే తావులో ప్రత్యేక సెటిల్ మెంట్ కాలనీలు ఏర్పరచి, వారిపై నిఘా పెంచి, అదుపుచేస్తూ వారు రాత్రిళ్ళు బయటికెళ్లి చోరీలకు పాల్పడకుండా తగు చర్యలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వారికి ప్రభుత్వం తగిన విద్యావకాశాలు, షెడ్యూల్డ్ జాతులుగా రిజర్వేషన్స్ కల్పించిన కారణంగా తమ సంప్రదాయ కులవృత్తి అయినట్టి దొంగతనాన్ని మానేసి ఇప్పుడు వారంతా చదువుకుని ఉద్యోగాలలో స్థిరపడడం జరిగింది. అయినా ఇప్పటికీ గాడిదలతో ఎఱుకల వారికి ఉండిన అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. పాత అలవాటు ప్రకారం వారింకా పెద్ద సంఖ్యలో గాడిదలను పెంచుతూనే ఉన్నారు. శిశువులకు వచ్చే పాల ఉబ్బస నివారణకు వైద్యులు శిశువులకు గాడిదపాలు తాగిస్తారు. క్రిమిరోగానికి, మలబద్ధకానికి సంప్రదాయ వైద్యంలో గాడిద మాంసం, గాడిద మూత్రం వినియోగిస్తారు. ప్రసవ స్త్రీలకు వచ్చే పొత్తికడుపు నొప్పి నివారణకు గాడిద లద్దెలను వెచ్చజేసి, వారి పొత్తికడుపు మీద కట్టుగా కడతారు. గుంటూరుజిల్లావాసులు వైద్యం నిమిత్తం ఒకప్పుడు సీతానగరం, తాడేపల్లి ప్రాంతాలలోని సెటిల్ మెంట్ ఎరుకలవారి వద్దకు వెళ్లి గాడిదపాలు, గాడిద మాంసం, మూత్రం వంటివి కొనుక్కుని తెచ్చుకోవడం ఉండేది.

గాడిదలు విజ్ఞత లేనివే అయినా విశ్వాసపాత్రమైనవి. అవి విశ్వసనీయతకు పేరుమోసిన కుక్కల కంటే కూడా విశ్వాసం కలిగినవని తెలిపే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒక చాకలి తాను ప్రేమగా పెంచే కుక్కకు రోజూ మాంసం ముక్కలు పెట్టి మేపుతూ, బట్టలు మోసే గాడిదకేమో ఇష్టంలేనట్టు కాసిని ఎండు గడ్డి పరకలు మాత్రం వేసేవాడట. రోజంతా బండ చాకిరీ చేసిన ఆ చాకలి ఒక రాత్రివేళ ఆదమరచి నిద్రపోతూ ఉండగా ఒక దొంగ ఆ ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అప్పుడు కడుపారా తిన్న కుక్క తన యజమానితో పాటు తానూ గుర్రుపెట్టి నిద్రపోతున్నదట. అలికిడికి మెలకువ వచ్చిన గాడిద దొంగను గమనించి, తన యజమాని పట్ల విశ్వాసంతో అతడిని హెచ్చరించేందుకు పెద్దగా ఓండ్ర పెట్టిందట. అది మంచి ఉద్దేశంతోనే ఇలా చేసినా, యజమానికి నిద్రాభంగమై చిర్రెత్తుకొచ్చిన కారణంగా అతడు ఆ అమాయక ప్రాణిని దుడ్డుకర్రతో చావమోదాడట. దీనినుంచే ‘కుక్కపని గాడిదకేల ?’ అనే లోకోక్తి ఏర్పడింది.

నేటి గాడిద జాతికి మూలం న్యూబియన్ యాస్ (Nubian Ass) అనే అడవి గాడిద. క్రీ.పూ. 4000 సంవత్సరాల క్రితమే మెసొపొటేమియా, ఈజిప్టు లలోని ప్రజలు వీటిని మచ్చిక చేసుకుని భారవాహక జంతువులుగా వినియోగించడం మొదలుపెట్టారు. భారతదేశంలోని గాడిదలలో చిన్న సైజు ధూసరవర్ణపు (బూడిదరంగు) గాడిదలు, పెద్ద తెల్లటి గాడిదలు – ఈ రెండు రకాలూ ఉన్నాయి. తెల్లని పెద్ద గాడిదలు గుజరాత్ రాష్ట్రంలోని కథియవార్ ప్రాంతంలో కనిపిస్తాయి. చిన్న బూడిదరంగు గాడిదలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ మనం చూడవచ్చు. భారతదేశంలో 1982 నాటికే పది లక్షల ఇరవై వేల గాడిదలున్నాయనీ, నాటినుంచీ వీటి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతూపోతున్నదనీ ఒక అంచనా.

గాడిద యొక్క ధూసర వర్ణం ( బూడిద రంగు) కారణంగా దానికి ‘ధూసరము’ అనే పేరూ వచ్చింది. అది బూడిద రంగులో ఉండడమే కాదు ఎప్పుడూ మురికిగా, అసభ్యంగా ఉంటుంది. దాని పరిశుభ్రత గురించి, ఆరోగ్యాన్ని గురించి, దానిని పెంచుకుని దాని చేత చాకిరీ చేయించుకునేవారు సైతం పట్టించుకోరు. ‘ గాడిద పుండుకు బూడిదే మందు’ అనే సామెత దాని ఆరోగ్యం విషయం ఎవరికీ పట్టదనే వాస్తవాన్ని తెలుపకనే తెలుపుతుంది.

గాడిద శుచి, శుభ్రత ఎరుగని ఎడ్డి మడ్డి జంతువు. ‘ గాడ్దె మేన దెచ్చి గంధంబు బూసిన – గాడ్దెకేమి దెలియు సౌరభంబు ?’ అంటూనూ, ‘ గాడిద గంధపు చెక్కలు మోస్తుందేగానీ వాటి పరిమళం దానికేమి తెలుసు ?’ అంటూనూ గాడిద గురించి అతి హీనంగా మాట్లాడతారంతా.

గాడిద ముట్టు మోకాళ్ళ కారణంగా దాని నడక వికారంగా ఉంటుందే కానీ, దాని వెనుక కాళ్లకు బలంగా తాపు తన్నే శక్తి మాత్రం చాలా ఎక్కువ. ‘గాడిదతో స్నేహం కాలి తాపులకే ‘ అనే సామెత అందుకే ఏర్పడింది. ‘ గాడిదలతో సేద్యము చేస్తూ కాలి తన్నులకు దడిస్తే ఎలా ?’ అనే సామెత కూడా సుప్రసిద్ధమే. గాడిద చాకిరీ ఎక్కువగా చేస్తుంది గానీ ఆహారం మాత్రం మితంగా తింటుంది. ‘ గాడిదలెన్నిమేసినా గరిక తరుగుతుందా ?’ అన్న నానుడి అలా ఏర్పడ్డదే. గాడిదకు ప్రతిగా గుర్రం ఆహారం బాగా తింటుంది. గుర్రాలు ఉలవ గుగ్గిళ్ల వంటి బలమైన ఆహారాలు కూడా తిని జీర్ణించుకుంటాయి. గుర్రాల యజమానులు కూడా వాటి పోషణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే గాడిదలను పెంచుతూ, వాటిని చాకిరీకి వినియోగించుకునేవారు సైతం వాటి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోరు. అవి దొరికిన గడ్డి కరిచి ఎలాగోలా బతుకీడుస్తాయి. 
‘ గాడిద మోత .. గుర్రాల మేత’ అని అందుకే అంటారు. యజమాని మేత వేయకుండా గాడిదను గాలికి వదిలేసే కారణంగానే దానికి ‘గాలిగాడు’ అనే పేరు వచ్చిందేమో ! 
గాడిద కూయడాన్ని ఓండ్ర పెట్టడం ( The bray of an ass ) అంటారు. ఆ శబ్దం కర్ణ కఠోరంగా ఉంటుంది. ఈ వింత శబ్దానికి మిగిలిన జంతువులన్నీ బెదిరిపోయి దడుచుకుంటాయి. తాబేలు తన నోటితో దేనినైనా కరుచుకుంటే గాడిద కూసిందాకా వదలదంటారు. వికారంగా ఉండే గాడిద రూపమే కాదు, కఠోరమైన దాని కంఠస్వరమూ ఎగతాళి పాలయింది. ‘ గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందం చూసి గాడిద మూర్ఛపోయింద’ ని సామెత. అసంభవమైన విషయాన్ని ‘గాడిద గుడ్డు’ అంటారు. ఇది Mare’s Nest వంటిదే. ఆడ గుర్రం గూడు నిర్మించుకోవడం ఎలా అసంభవమో గాడిద గుడ్డుపెట్టడమూ అలాగే అసాధ్యం. అయితే కొందరు ఆంగ్లేయులు ప్రయోగించిన “God the good..conquered the peace!”—అనే పదబంధం మన వాళ్ల నోళ్లలో తిరగక—గాడిదగుడ్డు..కొంకర పాసూ—అయిందని చెప్తారు! కానీ దైవం peace ( శాంతి) ని conquer చేయడం (జయించడం) అనే పదం అర్థవంతంగా లేదు. (దైవం అరాచకాన్ని జయించి శాంతిని నెలకొల్పడం అనడం సబబు )

ఇకపోతే గాడిద మానవజాతికి చేస్తున్న బహుముఖీనమైన సేవలలో తిట్లు, విమర్శలు, ఎత్తి పొడుపులలోనూ అది మానవులకు ఒక సాధనంగా తెలిసో, తెలియకో ఉపయోగపడడాన్ని కూడా మనం తప్పక చెప్పుకోవాలి. ఆధునిక యుగంలో రాజకీయ వ్యంగ్య విమర్శనం ( Political Caricature ) లోనూ గాడిద పోషిస్తున్న పాత్ర తక్కువైనదేమీ కాదు. క్రిషన్ చందర్ ( 1914 – 1977) అనే సుప్రసిద్ధ ఉర్దూ రచయిత
‘ ఏక్ గధే కీ సర్ గుజష్త్’ ( ఒక గాడిద ఆత్మకథ) పేరిట ఉర్దూ లో రాసిన వ్యంగ్య నవల ఆ తరువాత హిందీ మొదలైన 16 భారతీయ భాషలలోకి, ఇంగ్లిష్ మొదలైన పలు ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. హిందీలో ‘ ఏక్ గధే కీ ఆత్మకథా’ పేరిట, ఆంగ్లంలో ‘An Autobiography of a Donkey’ పేరిట ఈ నవలకు చేయబడిన అనువాదాలు సుప్రసిద్ధం. ఈ నవలే కాక ‘ ఏక్ గధే కీ వాపసీ’. ‘ ఏక్ గధా నేఫా మే’ వంటి తన తదుపరి రచనలలో గాడిదను కథా వస్తువుగా తీసుకుని నాటి సమాజంలోని కూలతత్వానికి, మతోన్మాదానికి, హింసకూ వ్యతిరేకంగా తన మనసులోని అభిప్రాయాలను స్పష్టం చేశారాయన.

రామాయణంలోని ఖరాసురుడికి బహుశా గాడిదను పోలిన రూపం కలిగివున్న కారణంగా ఆ పేరు వచ్చిందేమో. ఖరుడు రావణుడి సవతి తల్లి కుమారుడు. రావణ, కుంభకర్ణ, విభీషణాదులు విశ్రవసుడికి కైకసి గర్భాన జన్మించగా, ఖరుడు, దూషణుడు, శూర్పణఖ విశ్రవసుడి మరో భార్య పాక కు పుట్టారు. తమ సోదరి శూర్పణఖకు లక్ష్మణుడు ముక్కుచెవులు కోసిన సందర్భంలో రామలక్ష్మణులపై దండెత్తిన ఖరదూషణులు వారిచే సంహరింపబడతారు. ఖర అంటే కాకి అనే అర్థమూ ఉందనీ, ఖరాసురుడు కాకిలా ఉండేవాడని కొందరు చెపుతారు. అయితే రామునితో మందాకినీ నదీతీరంలో తలపడిన కాకాసురుడు అనేవాడు వేరే ఉన్నాడు. అతడు కాకి ఆకారంలో ఉంటాడట. శాస్త్రీయంగా చూస్తే, అతడు కాకిలా నల్లని రూపుకలవాడని మనం భావించాలి. ఖరాసురుడు గాడిదలా బూడిద వన్నె వాడు అయివుంటాడు. రావణాసురుడి రథం గాడిదలు పూన్చిన రథమని కొందరు అంటున్నారు. అదేమో గానీ యుద్ధాలలో సరకు రవాణా (Logistics) లో గాడిదల వినియోగం మనదేశంలో ఎప్పుడూ ఉంది. గుర్రాలలాగా చురుగ్గా కదలలేని గాడిదలను యుద్ధరథాలకు వాడారంటే చిత్రమే. అప్పటికింకా గుర్రం భారత ఉపఖండంలోకి ప్రవేశించి ఉండకపోవచ్చు. ఆర్యులు గుర్రాలపై స్వారీచేస్తూ యుద్ధం చేస్తే, ఆర్య విస్తరణను ఎదుర్కున్న సింధులోయ ప్రజలు దున్నల బండ్లపై స్వారీచేస్తూ పోరాడారట. ఇక అదలా ఉంచితే, సూర్యుని సహాయకులలోనూ ఖరుడు అనేవాడు ఉన్నాడట. వాస్తవానికి సూర్యకిరణాలలోని కోసివేసేటట్లుండే పదునును ‘ ఖర’ అంటారు. సూర్యుడికున్న ఖరకరుడు, ఖరాంశుడు, ఖరరశ్మి అనే పేర్లు సూర్యకిరణాలలో ఉండే ఈ పదును (ఖర) కారణంగా ఏర్పడినవే. గుర్రాల సంరక్షణ, పోషణల కోసం అశ్వశాల ఉన్నట్లే గాడిదలను కట్టివేసి సంరక్షించే కొట్టాన్ని ‘ఖరకుటి’ అంటారు. మరి ఇది ఏ కాలపు మాటో ? విలువలేనిదిగా భావించే గాడిదకు మన దేశంలో ఇలాంటి కొట్టాలలో పోషణ, సంరక్షణ గౌరవం ఒకప్పుడైనా లభించిందంటే అది సంతోషకరమైన విషయమే ! పాపం ఇప్పుడు మనదేశంలోని గాడిదలన్నీ గాలికి వదిలేయబడి, ‘గాలిగాడు’ అనే పేరును సార్థకం చేస్తూ దొరికిన గడ్డి కరుస్తూ దయనీయమైన జీవితాలు గడుపుతున్నాయి. గాడిద పాల జున్నులో ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయనీ, కొన్ని దేశాలలో అది విపరీతమైన ధర పలుకుతుందనీ తెలుసుకున్న నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

కంసుని చెరసాలలో వసుదేవుడి భార్య దేవకీదేవి ప్రసవించి, ఆమె అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంలో వసుదేవుడు ఆ శిశువును రాత్రివేళ రహస్యంగా యమునకు ఆవలి వైపున ఉన్న వ్రేపల్లెలోని నందుని ఇంటికి తరలించే క్రమంలో యమునాతీరానికి చేరగా, అది గమనించి మథురానగరంలోని ఒక గాడిద పెద్దగా ఓండ్ర పెట్టిందనీ, అప్పుడు గుట్టు రట్టు చేయవద్దనీ, మౌనంగా ఉండమనీ వసుదేవుడు ఆ గాడిద కాళ్లుపట్టుకుని బతిమిలాడాడని ఓ కథ చెపుతారు. అయితే ఈ కథ భాగవతంలో లేనిదనీ, కాబట్టి విశ్వసనీయం కాదనీ కొందరు కొట్టి పారేస్తున్నారు – అక్కడికేదో యమునానది విడిపోయి వసుదేవుడికి దారి ఇవ్వడం వంటివన్నీ విశ్వసనీయాలైనట్లు. నిజమైనా కాకున్నా ఈ ఉదంతం మాత్రం గాడిద నిజాయతీని తెలుపుతున్నది. కాపలాదారులు, కుక్కలు – ఎవరూ వసుదేవుడిని పట్టించుకోకపోయినా, ఆ నిశీధి వేళలో కాపలా కాయడం తన కర్తవ్యం కాకున్నా ఒక్క గాడిద మాత్రమే నిజాయతీగా ప్రవర్తించడం మెచ్చుకోదగ్గదిగా ఉంది.

అందుకే నాకు గాడిద యొక్క నిజాయతీ అంటే ఇష్టం. దాని దయనీయ స్థితి పట్ల జాలి కూడా.

ఇదండీ గాడిద కథా – కమామిషూ ! ఇది చదివినవారిలో కొందరికైనా ఈ అభాగ్య జీవి పట్ల సానుభూతి కలిగితే ఈ వ్యాసం ఉద్దేశం నెరవేరినట్లే !!

— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *