Breaking News

పునుగు- జవ్వాది – పునుగుపిల్లి

పునుగు- జవ్వాది – పునుగుపిల్లి
ఈరోజు ‘ రెంటికీ చెడిన రేవడు’ పేరిట నేను పెట్టిన టపా మీద స్పందిస్తూ కొందరు మిత్రులు సుగంధ ద్రవ్యాలపై ఆసక్తిగా మరింత సమాచారం తెలుసుకొనగోరారు. ముఖ్యంగా కొందరు పునుగు, జవ్వాది ఒక్కటేనా ? పునుగుపిల్లి, జవ్వాది పిల్లి ఒకే జంతువా ? అంటూ ప్రశ్నించారు. అందుకే అనుమాన నివృత్తికోసం మన ప్రాచీనులు ఉపయోగించిన సుగంధద్రవ్యాలన్నిటి గురించి క్లుప్తంగా వివరించే ఈ కింది సమాచారం ఆసక్తిగల మిత్రులకోసం ఇస్తున్నాను.

అంబరు లేక అంబరము అనేది ఒక సుగంధ ద్రవ్యం. దీనిని ఆంగ్లంలో ambergris అనే పేరుతో వ్యవహరిస్తారు. స్పెర్మ్ వేల్ (Sperm Whale) అనబడే తిమింగలం పేగులలో తయారయ్యే ‘యాంబర్ గ్రిస్’ అనే ఈ చిక్కటి ద్రవం గట్టిపడి తునకల్లా అవుతుంది. బూడిదరంగులో ఉండే ఈ తునకలను వెచ్చచేస్తే పరిమళం ఇస్తాయి. మైనంలాగా ఉండే అంబరు తునకలు ఉష్ణప్రాంత సముద్రాల నీటిలో తేలుతూ దొరుకుతాయి. అంబరును సుగంధద్రవ్యాల పరిశ్రమలో ఉపయోగిస్తారు.

పునుగు- జవ్వాది - పునుగుపిల్లి (2)

ఇక లేత పసుపు లేక ఎరుపు లేక గోధుమ రంగులో లభించే ఒక పారదర్శక శిలాజపు రెసిన్ (Fossil Resin) ని కూడా ఆంగ్లంలో amber పేరుతో పిలుస్తారు. అది వేరు. పాలిష్ పెడితే తళతళా మెరిసిపోయే ఈ రెసిన్ ని ఆభరణాల తయారీలో వాడతారు. సంస్కృతంలో దీనిని ‘తృణమణి’ అంటారు.

అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన ‘హంస వింశతి’ ఐదవ ఆశ్వాసంలోని ఈ కింది పద్యం చూడండి.

గీ. చారు శ్రీ గంధ మగరు కేసరి కదంబ 
మంబరు పునుంగు జవ్వాది హరిణమదము 
బుక్క యత్తరు గోవ గంబూర బోలు 
చట్ట కలపంబు పన్నీట చాది పూసి.

ఈ చక్కటి పద్యంలో అలనాటి సుగంధ ద్రవ్యాలనన్నింటినీ ఒక్కచోట ప్రస్తావించాడు కవి.

చారు శ్రీ గంధము (శ్రేష్ఠమైన, ఒప్పిదమైన సిరి చందనము); అగరు ( చందనములలో ఒక రకం. దీనినే అగరువు అనీ, అగురు అనీ, అగలు అనీ కూడా అంటారు. తిన్నడి గ్రామమైన ఉడుమూరులోని ప్రజలు అగరు క్ష్మారుహముల అంటే అగరు చెట్ల కలపనే వంట చెరకుగా వినియోగించేవారని ‘కాళహస్తి మాహాత్మ్యము’ కావ్యంలో ధూర్జటి పేర్కొన్నాడు)

కేసరి అంటే సామాన్యార్థంలో అకరు లేక అకరువు లేక పుష్పంలోని కింజల్కము(the filament) అని అర్థం.అయితే కుంకుమ పువ్వు అనే సుగంధ ద్రవ్యాన్ని కూడా కేసరి అంటారు.దీనినే సంస్కృతంలో ‘కుంకుమమ్’, ‘కాశ్మీరజమ్’ అని కూడా అంటారు. ఆంగ్లంలో దీనిని Saffron అంటారు. కష్మీర్ లో సాగుచేసే Crocus sativus అనే శాస్త్రీయ నామం కల ఒక మొక్క నీలిరంగు పుష్పాలలోని ఎర్రటి కీలములు, కీలాగ్రములను సేకరించి, సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దానినే కుంకుమ పువ్వు అంటారు.

కదంబము అంటే మృగనాభి(కస్తూరి మృగం- Musk Deer- నుంచి లభించే కస్తురి లేక కస్తూరి అనే సుగంధద్రవ్యం – Musk) మొదలైన వాటిని పన్నీటితో కలిపి చేసే ఒక పరిమళ ద్రవ్యం.

పునుగు అంటే పునుగు పిల్లి లేక మార్జారిక (Civet Cat) అనే జంతువు నుంచి సేకరించే సుగంధద్రవ్యం. దీనినే జవాది, జవాజి, జవ్వాజి, జవ్వాది, సంకు మదము అనే పలు పేర్లతో పిలుస్తారు. ‘జగడపు చనవుల జాజర’ అంటూ సాగే అన్నమాచార్యుని సంకీర్తనలో వేంకటపతికి అతి ఇష్టమైన సంకుమదము గురించిన ప్రస్తావన ఉంది. వేంకటేశ్వరునికి నిత్యం చేసే అలంకరణలలో సంకుమదం అలదడం కోసం తిరుమల కొండలమీద పునుగు పిల్లుల్ని ప్రత్యేకంగా పెంచుతారు.

హరిణమదము అంటే ఇర్రి లేక కురంగము అని పిలువబడే కస్తూరి మృగం నుంచి సేకరించే కస్తూరి అనే సుగంధ ద్రవ్యం.

బుక్క, బుక్కా లేక బుక్కాయి అంటే వివిధ పరిమళ ద్రవ్యాలు కలిపి చేసిన ఒక పొడి. దీనినే పిష్ఠాతకము లేక పటవాసకము అని కూడా అంటారు. ఈ పొడిని బట్టి సుగంధద్రవ్యాలు అమ్మేవాడిని (Perfumer) బుక్కా వాడు అంటున్నారు.

అత్తరు అంటే పుష్పాల సారంతో తయారుచేసే సుగంధ తైలం.

గోవ గంబూరము అంటే మనోజ్ఞమైన కర్పూరము.

చట్టము అన్నా పునుగు చట్టము అన్నా పునుగు పిల్లి శరీరంలో ఉండే ఒక గ్రంథి లేక సంచి. దీనిని పిండి, పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని సేకరిస్తారు.

కలపము అంటే పరిమళ ద్రవ్యాలను చేర్చి కలిపిన చందనము. చాదుట అంటే గట్టి లేక చిక్కటి పదార్థాన్ని మేనికి రాయడానికి అనువుగా పలుచన చేయడం. చట్ట కలపమును(పునుగు కలిపిన చందనాన్ని) పన్నీరులో పలుచనచేసి రాశారట.

ఇక పునుగుపిల్లి లేక జవ్వాది పిల్లిని సివెట్ లేక సివెట్ కాట్ (Civet Cat ) అంటారు. ఇవి రాత్రివేళల్లో తిరిగే Viverridae కుటుంబానికి చెందిన పిల్లి తరహా జంతువులు. వీటిలో మొత్తం పన్నెండు ఉపజాతులున్నాయి. సుగంధభరితంగా ఉండే వీటి మదాన్ని సేకరించి సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీనినే సంకు మదము, జవ్వాజి, పునుగు వగైరా పేర్లతో పిలుస్తారు. ప్రపంచంలోనే అతి పరిమళభరితమైన, అత్యంత ఖరీదైన కాఫీ ( Civet Coffee) ఈ పునుగుపిల్లుల నుంచి తయారు చేస్తారు. 
కాఫీ పళ్ళ (Coffee Berries) ని పునుగుపిల్లులచేత తినిపించి, అవి విసర్జించిన కాఫీ గింజల ( Coffee Beans) ను సేకరించి,
శుభ్రపరచి, వేయించి, పొడిచేస్తారు. పరిమళభరితమైన ఈ కాఫీ
ప్రపంచంలో అతి ఖరీదైన కాఫీ. చైనా, ఫిలిప్పీన్స్ వంటి ఆసియన్ దేశాలలోని ధనికులు ఈ కాఫీ తాగుతారు.

ఇవండీ మన ప్రాచీనులు ఉపయోగించిన కొన్ని సుగంధద్రవ్యాల గురించి, పునుగుపిల్లిని గురించి వివరాలు.
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *