Breaking News

సీమ తాడి ( తాళపత్ర వృక్షము)

సీమ తాడి ( తాళపత్ర వృక్షము)
అది 1998 వ సంవత్సరం. మండు వేసవి మే నెలలో ఓ రోజు తెనాలికి సమీపంలోని చేకూరు ( అప్పట్లో అది చేబ్రోలు మండల గ్రామం) నుంచి మా బంధువు వాసిరెడ్డి హనుమంతరావు నాకు ఫోన్ చేసి, తమ గ్రామం నుంచి తంగెళ్ళమూడి వెళ్ళే మార్గంలో ఒక వింత తాటి చెట్టు ఉందనీ, దానిని స్థానికులు ‘సీమ తాడి’ అంటున్నారనీ, అది ప్రస్తుతం మట్టలు రాల్చేస్తూ నిలువునా మాడి పోతున్నదనీ, వంద అడుగులకు పైగానే పెరిగిన ఆ భారీ వృక్షాన్ని చూసి, ఫోటోలు తీసుకునేందుకు వీలైనంత త్వరలో వాళ్ళ ఊరు రమ్మనీ అన్నాడు. అప్పట్లో నేను విజయవాడ వాణిజ్యపన్నుల శాఖలో డి .సి.టి.ఓ. గా పనిచేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా పలు వృక్ష, జంతు, పక్షి జాతుల మీద సమగ్ర అధ్యయనం చేస్తూ, తెనాలి ప్రాంతపు ప్రకృతి వింతల్ని, ఆ ప్రాంతానికి అరుదైన జీవజాతుల్ని అందరికీ పరిచయం చేసే వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని.
 
హనుమంతరావు అప్పటికే తమ ప్రాంతపు ఒకటి రెండు వింత వృక్షాల గురించి నాకు చెప్పి ఉన్నాడు. అందుకే నేను వెంటనే స్పందించి, ఈ వింత వృక్షమేమిటో కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఆ తరువాత ఆదివారమే చేకూరు వెళ్ళాను.చేకూరును ప్రస్తుతం అందరూ శేకూరు అంటున్నప్పటికీ ఆ వూరు అసలు పేరు చేకూరు. అది వేరుగా వివరించాల్సిన విషయం. ఆ ఊరులో మా అమ్మ తరఫు బంధువులు కొందరు ఉండటంతో అప్పుడప్పుడూ నేను అక్కడికి వెళుతూ ఉండేవాడిని. ఆ గ్రామానికి చెందిన కీ.శే. వాసిరెడ్డి నరసింహారావు, కీ.శే. నారాయణరావు సోదరులతోనూ మాకు బంధుత్వం ఉంది. కీ. శే. వాసిరెడ్డి నరసింహారావు గారు, ఆ తరువాత వారి సోదరుడు నారాయణరావు గారు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ నడిపిన రైతు ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనేవారు. విజయవాడలో 1944 లో – అంటే నేను పుట్టడానికి కూడా ఎనిమిదేళ్ల ముందే – జరిగిన అఖిల భారత రైతు మహాసభకు నరసింహారావు గారు హాజరయ్యారట. ఆ రైతు మహాసభ సందర్భంగా అక్కడ వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తెచ్చిన పలు మొక్కలతో ఒక ప్రదర్శన కూడా జరిగిందట. ఆ ప్రదర్శన నుంచి నరసింహారావు గారు కొని తెచ్చి తన పొలంలో పెంచుకున్న వింత వృక్షమే ఈ సీమ తాడి లేక శ్రీతాళము లేక తాళపత్ర వృక్షము (Talipot Palm).ఈ విషయాలు నారాయణ రావు గారి భార్య కీ. శే. సీతమ్మ గారు చెప్పగా విన్నాను. గోవా మొదలు కేరళ వరకూ కొంకణ, మలబార్ తీరాలలోనూ, శ్రీలంక లోనూ మాత్రమే కనిపించే ఈ వృక్షం మన తెలుగునేలకు అత్యంత అరుదైనది. అలా నరసింహారావు గారి ఆసక్తి కారణంగా సీమ తాడి వృక్షం తెనాలి సమీపంలోని చేకూరు నుంచి తంగెళ్లమూడి వెళ్లే మార్గంలోని వారి పొలంలో 1944 నుంచి పెంచబడింది.
ఇక ఈ వింత వృక్షం లక్షణాలు, ప్రత్యేకతలు వివరిస్తాను. ఈ వృక్షం తాటి, ఈత, కొబ్బరి, జీలుగ, పోక ( వక్క) చెట్లవలె పామ్ (Palm) తరహాకు చెందినదే. చూసేందుకు ఇది తాటిచెట్టులాగే అనిపించినా దీని మొదలు చుట్టుకొలత మన సాధారణ తాటి చెట్టు మొదలు కంటే కనీసం మూడు నాలుగు రెట్లు ఉంటుంది. దీని ఆకు మట్టలు చూడ్డానికి తాటాకు మట్టలలాగే కనిపించినా తాటి ఆకులకంటే సీమతాడి ఆకుల పరిమాణం కనీసం నాలుగైదు రెట్లకు పైమాటే. మట్టల మీద గరుకుగా ఉండే గరి (Spines on the petiole ) మరింత పదునుగా, నల్లగా ఉంటుంది. మనం సాధారణంగా చూసే వృక్షాలలో నిత్యం పూలు పూసేవీ, ఏడాదికోసారి ఆ యా ఋతువులలో పూలు పూసి, కాపు కాసేవీ ఉంటాయి. అయితే ఈ వృక్షం మాత్రం నలభై, యాభై సంవత్సరాలు పెరిగి, జీవితంలో ఒకేసారి పుష్పించి, ఫలించి, ఆ తరువాత చచ్చిపోతుంది. ఇలాంటి వృక్షాలను వృక్షశాస్త్ర పరిభాషలో మోనోకార్పిక్ ( Monocarpic) వృక్షాలంటారు. సెంచరీ ప్లాంట్స్ (Century Plants) పేరిట ప్రసిద్ధమైన యాస్పరాగేసీ
( Asparagaceae) కుటుంబానికి చెందిన ఎగేవ్ అమెరికానా (Agave americana) మొక్కలు, చాగ నార (సాగ నార), కలబంద తరహాకు చెందిన కొన్ని ఇతర మొక్కలు కూడా ఇలాగే జీవితకాలంలో ఒకేసారి పుష్పించి, ఫలించి, ఆ తరువాత చచ్చిపోతాయి.
ఆరేకేసీ (Arecaceae) కుటుంబానికి చెందిన ఈ వింత సీమ తాడి వృక్షాన్ని ఆంగ్లంలో TALIPOT Palm అనీ Fan Palm అనీ అంటారు. ఇది 24 మీటర్ల వరకూ అంటే సుమారు 90 అడుగుల వరకూ ఎత్తు పెరుగుతుంది. అరుదుగా వంద అడుగుల ఎత్తు పెరిగే శ్రీతాళ వృక్షాలూ ఉంటాయి.ఈ వృక్షం కాండం దగ్గర దగ్గర ఒక మీటర్ వ్యాసం కలిగి ఉంటుంది. అంటే దీని మొదలు చుట్టుకొలత రమారమి పదకొండు అడుగుల పైమాటే. దీనినిబట్టే చెప్పవచ్చు – ఈ వృక్షం ఎంత భారీ పరిమాణంలో ఉంటుందో !! కాండం ముదురు వయొలెట్ రంగులో రింగులు కలిగుంటుంది. ఫ్యాన్ ఆకారంలో ఉండే ఈ వృక్షం ఆకులు ఆకు కాడ (Petiole) చివరి నుంచి పత్ర శీర్షం (ఆకు మొన – Leaf Apex) వరకు రెండున్నర మీటర్ల పొడవు, ఐదు మీటర్ల విస్తృతి ( వెడల్పు) కలిగి ఉంటాయి.ఆకు మొత్తం 80 నుంచి 100 పక్షాల (Segments) తో మడతలుగా ఉంటుంది. 15 సెంటీమీటర్ల వరకూ వెడల్పు కలిగి ఉండే ఈ పత్ర పక్షాల మీద సింహళ దేశంలోని ప్రాచీనులు ఇనుప లేక ఇత్తడి గంటాల(Styles)తో పవిత్ర గ్రంథాలను, పత్రాలను రాసుకుని భద్రపరచుకునేవారట. అనాదిగా మన ప్రాంతపు కవులు, కరణాలు, వ్రాయసగాళ్ళు సాధారణ తాటి ఆకులను ఇందుకు వాడేవారు. మనం రాసేందుకు వాడిన తాటాకు పక్షాలకు మూడు రెట్లకు పైనే వెడల్పు కలిగుంటాయి ఈ సీమ తాడి పత్రపక్షాలు. దీని పత్ర పక్షాలను తాళపత్రాలుగా వినియోగించిన కారణంగానే శ్రీలంకలో ఈ వృక్షాన్ని తాళపత్ర వృక్షం ( Talipot Palm) అనటం వాడుకయింది. ఆకు కాడ ఏడు మీటర్ల వరకు పొడవుంటుంది. బాగా గరుకుగా, పదునుగా కోసుకుపోయే గరి కలిగివుంటాయి దీని మట్టలు. తాటి, ఈత, బొప్పాయి, ఖర్జూర వంటి చెట్లలో ఆడ, మగ చెట్లు వేర్వేరుగా ఉంటాయి. కొబ్బరి చెట్టుకి ఒకే చెట్టుమీద ఆడ పూలు, మగ పూలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఈ సీమ తాడి వృక్షం పూలలో ఒకే పువ్వు మీద స్త్రీ, మరియు పురుష జననాంగాలు రెండూ ఉంటాయి. ఇలాంటి పూవుల్ని Bisexual Flowers అంటారు. కాయలు చిన్నవిగా, గుండ్రంగా మూడు లేక నాలుగు సెంటీమీటర్ల వ్యాసం కలిగి, ఆలివ్ కాయల రంగులో ఉంటాయి.లోపలి గింజలు గుండ్రంగా, నున్నగా మెరుస్తూ, గట్టిగా ఉంటాయి.ఇక ఇప్పుడు శ్రీతాళ వృక్షానికి సంబంధించిన అతి ముఖ్యమైన, ప్రత్యేక లక్షణం గురించి చెప్పుకుందాం. ఈ వృక్షం తాను జీవించటం కేవలం జీవితకాలంలో ఒకేసారి పుష్పించి, ఫలించటానికేనా అని ఆశ్చర్యం కలుగుతుంది చూసేవారెవరికైనా. ఈ వృక్షంలో నలభై యాభై ఏళ్ళు కేవలం ఎదుగుదల తప్ప మరెటువంటి కార్యకలాపాలూ కనిపించవు.అనుకూల పరిస్థితులు, బలాన్నిబట్టి ఒక శ్రీతాళ వృక్షం నలభై లేక యాభై ఏళ్ళు పెరిగిన తరువాత నవంబర్ – జనవరి మధ్య కాలంలో ఒక్కసారిగా దాని శీర్షము లేక మొవ్వు ప్రాంతం నుంచి ఒక ఐదడుగుల ఎత్తైన మొగ్గ ( Terminal Bud or Spadix) వస్తుంది. ఆ మొగ్గలోనే ఈ వృక్షం యొక్క పుష్ఫ గుచ్ఛము చుట్టలు చుట్టుకుని ఉంటుంది. కొంతకాలం తరువాత ఆ మొగ్గ మరింత పెరిగి ఒక పెద్ద శబ్దంతో పగిలి, లోపలి పుష్ప విన్యాసం ( Inforescence) ఒక కొరడా లాగా విసురుగా బయటికొచ్చి ఈ వృక్షం తల మీద నిలిచి ఉంటుంది. ఆరు మీటర్లకు పైగా ఎత్తు, తొమ్మిది నుంచి పన్నెండు మీటర్ల వెడల్పు కలిగిన ఈ పుష్ప గుచ్ఛం మొత్తం వృక్షజాలంలోనే అతి పెద్ద పుష్ప గుచ్ఛం. ఒక వంద అడుగుల ఎత్తైన పెద్ద తాటిచెట్టు మీద ఒక విరగబూసిన బూరుగ దూది చెట్టు మొలిచిందా ? – అన్నట్లు అనిపిస్తుంది ఆ దశలో ఆ పెద్ద పుష్పవిన్యాసాన్ని చూసినవారెవరికైనా. ఆరు కోట్ల పూలతో శ్రీతాళ వృక్షపు పుష్ప గుఛ్చమే ప్రపంచంలో అతి ఎక్కువ పూలు పూసే పుష్ప గుచ్ఛం కావడం ఒక విశేషం. పండ్లు మండు వేసవిలో తయారై రాలిపోతాయి. ఈ కాయల్ని తినే పక్షులు, ఉడుతలు, ముళ్ళపందులు విత్తన వ్యాప్తికి దోహదపడతాయి. వర్షపు నీటి ద్వారా కూడా విత్తన వ్యాప్తి జరుగుతుంది. ఇక ఒకసారి పుష్పించి, కాయలు కాశాక ఆ వృక్షం మెల్లమెల్లగా ఆకులు రాల్చేస్తూ క్రమంగా ఎండి నశించిపోతుంది. దీని కాండంలోపలి బొండు (Pith) ను తీసి ఎండబెట్టి దంచి, ఆ పిండితో రొట్టెలు, కేక్ లు తయారు చేసుకుంటారు. ఈ వృక్షం విత్తనాలు రంగులు వేసి, దండలుగా తయారుచేసి పగడాల దండలుగా మెడలలో ధరిస్తారు. ఈ వృక్షపు ఆకులతో గొడుగులు తయారు చేస్తారు. ఈ ఆకుల వెడల్పాటి పత్ర పక్షాలు ( Leaf Segments ) అనాదిగా తాళపత్రాలుగా వాడేవారు. ఈ వృక్షం ఒక్కొక్క ఆకు వర్షంలో పదిహేను, ఇరవై మందికి ఆచ్చాదన ఇస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీలంకలో సైన్యం అటవీ ప్రాంతంలో తమిళ పులుల (ఎల్టీటీఈ) తో జరిపిన పోరులో వారు ఈ వృక్షపు ఆకులతోనే గుడారాలు వేసుకునేవారట.
మలబార్ తీరంలో, పశ్చిమ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని చిత్తడి ప్రదేశాలైన హొన్నావర్, కుంప్త ప్రాంతాలలోనూ, గెరసొప్ప జలపాతం ప్రాంతంలోనూ ఈ వృక్షాలు గుమ్ములు ( గుంపులుగా) కనిపిస్తాయి. అండమాన్ దీవులు, కోకో దీవులు, శ్రీలంక అటవీ ప్రాంతాలలోనూ ఈ శ్రీతాళ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరెకేసీ ( Arecaceae ) కుటుంబానికి చెందిన ఈ వింత వృక్షం శాస్త్రీయనామం కొరైఫా అంబ్రాక్యూలిఫెరా ( Corypha umbraculifera). గ్రీకు భాషలో కొరైఫె ( Koryphe) అంటే కొండ కొప్పు లేక గిరి శిఖరం (Summit or Hilltop) అని అర్థం. ఎత్తైన ఈ వృక్షం అగ్రభాగం నుంచి వచ్చే ఆకర్షణీయమైన పుష్పగుచ్ఛము కారణంగా దీనికి కొరైఫా అనే పేరు ఏర్పడింది. లాటిన్ భాషలో అంబ్రాక్యూల్( Umbracule) అంటే గొడుగు ( Umbrella). దీని ఆకులనుంచి గొడుగులు తయారు చేస్తారు కనుక దీనికి umbraculifera ( గొడుగులు ఇచ్చేది) అనే పేరు ఏర్పడింది.
మేము ఈ వృక్షాన్ని చూసేటప్పటికే అది పుష్పించి, కాపు కాసి, అవసాన దశకు చేరుకున్నది. గుండ్రంగా, కొంత కోలగా ఉన్న మెరిసే దాని కాయలు చెట్టు మొదలు దగ్గర రాలిపడివున్నాయి. కొన్నింటిని ఏరి ఫోటోలు తీశాను, అలాగే ఆ చెట్టు యొక్క ముదురు వయొలెట్ రంగు మొదలు ఎంత పెద్దదో, అది వాటానికి ఎలా అమరదో చూపే విధంగా మరికొన్ని ఫోటోలు తీశాను. అప్పట్లో ఇటు చేకూరు, అనుమర్లపూడి గ్రామాలనుంచే కాక, అటు తెనాలి నుంచి నందివెలుగు మీదుగా గుంటూరు వెళ్లే రహదారిలోని తంగెళ్లమూడి అడ్డరోడ్డు దగ్గరనుంచి కూడా ఈ వృక్షం సమున్నతంగా కనిపించేది. మేము చూసేటప్పటికి సంవత్సరం క్రితమే ఆ మహావృక్షం నడి నెత్తిన ఒక పెద్ద క్యాబేజీ వంటి మొగ్గ రావటం, అది క్రమంగా పెరిగి, పెద్ద శబ్దంతో పగిలి ఆకర్షణీయమైన పుష్పగుచ్చం బయటికి రావటం జరిగిపోయింది. ఆ సమయంలో పుష్ప విన్యాసంలోని పూలన్నీ కాయలుగా మారి అవి కూడా రాలిపోయి చెట్టు చుట్టూ కనిపించాయి. ఆ సమయంలో చూస్తే పుష్పగుచ్ఛపు Panicles బోసిగా కనిపించాయి.
దూరాన్నుంచి చూస్తే ఒక పెద్ద తాటి చెట్టు మీద మొలుచుకొచ్చిన మరొక ఆకులు రాల్చిన ఎత్తైన బూరుగదూది వృక్షంలా కనిపించింది ఆ దృశ్యం. 80 అడుగుల ఎత్తైన శ్రీతాళ వృక్షం మీద 20 అడుగుల ఎత్తైన బోసిపోయిన పుష్ప విన్యాసం. చూసేందుకు భలే చిత్రంగా అనిపించింది. అంతకు ముందే ఆ వృక్షాన్ని గురించి చదివి ఉండటాన నేను ఆ వృక్షాన్ని చూడగానే అది కొరైఫా అంబ్రాక్యూలిఫెరా అనేది నాకు అర్థమైంది.
తరువాత కొద్దికాలానికే నా అన్వేషణలో అక్కడికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని నారాకోడూరు గ్రామంలో కూడా అలాంటి వృక్షమే మరొకటి గుండవరం వెళ్లే మార్గంలో పొందూరి వెంకట్రావు అనే ఆయన ఇంటి ముందు పాతికేళ్ల నుంచి పెరుగుతూ ఉండటం గుర్తించాను. ఆ ఇంటి వారికి ఆ వృక్షం విశేషాలేమీ తెలియవు. నేనే వారికి ఆ వృక్షం ప్రత్యేకతలు వివరించి, కాపు కాయటంలేదని ఆ అరుదైన వృక్షాన్ని మాత్రం నరికెయ్యవద్దని చెప్పాను. ఆ తరువాత ఈ రెండు వృక్షాల ప్రత్యేకతలు వివరిస్తూ నేను ఒక వ్యాసం రాశాను. అప్పట్లో ‘వార్త’ తెనాలి విలేఖరి శ్రీ బి. యల్. నారాయణ నన్ను ముందుగా కలిసి నేను తీసిన ఫొటోలతో సహా ఆ వ్యాసంలోని విశేషాలను సంగ్రహంగా ‘వార్త’ దినపత్రిక ( ది.21-10-1999) లో ప్రచురించారు. ఆ తరువాత అన్ని దినపత్రికలలోనూ ఈ వృక్షం గురించిన వివరాలతో కూడిన వార్తలు వచ్చాయి. ఇక గుంటూరుజిల్లాలోని కళాశాలల వృక్షశాస్త్ర అధ్యాపకులు, నాగార్జున యూనివర్సిటీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వింత వృక్షాన్ని తిలకించడం జరిగింది.
నారాకోడూరులోని 1998 లో నేను గుర్తించిన (అప్పటికే సుమారు పాతికేళ్ల వయసున్న) సీమ తాడి వృక్షం ఇన్నేళ్లకు ప్రస్తుతం పుష్పించి, ఫలించి, ఎండిపోవడం మొదలైంది. ప్రస్తుతం అన్నామలై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య రవిప్రసాద రావు అనే శాస్త్రజ్ఞుడు ఇటీవల పుష్పించిన నారాకోడూరు గ్రామంలోని శ్రీతాళ వృక్షాన్ని చూసి గుర్తించినట్లు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ లో ఒక విడియో కథనం ఈ మధ్యనే ప్రసారమైంది. టీవీలో అది చూసిన నా మిత్రులు కొందరికి నేను 1998 లోనే చేకూరు గ్రామ శివార్లలోనూ, నారాకోడూరు గ్రామంలోనూ ఈ శ్రీతాళ వృక్షాలను గుర్తించిన విషయం జ్ఞప్తికి వచ్చి నాకు ఆ విడియో క్లిప్పింగ్ ను వాట్స్ యాప్ సందేశాల ద్వారా పంపారు. నేను దానిని ముఖపుస్తకంలో పోస్ట్ చేస్తూ ఆ శ్రీతాళ వృక్షాలను గురించి అప్పటికప్పుడు ఆ టపాలో కొన్ని వివరాలు తెలిపాను. గతంలో నేను రాసిన వ్యాసంలోని పూర్తి వివరాలతో సహా ఇప్పుడు ఈ టపా పెడుతున్నాను.
అరుదైన జీవజాతుల్ని, ప్రత్యేకించి ఈ తరహా వృక్షజాతులను కాపాడుకోవటం కోసం మిత్రులంతా ఇతోధికంగా కృషిచేయగలరని విశ్వసిస్తున్నాను.
— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *