Breaking News

గంగిరెద్దులాటలు

గంగిరెద్దులాటలు

Gangireddu_01 gangireddu-with-haridasu HYM14SANKRANTHI

“గంగిరెద్దుల వాడు కావర మణచి – ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు” అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతి ప్రాచీన కాలం నుంచీ ఈ గంగి రెద్దాటలు ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది.
గంగిరెద్దుల ఆటకు మూలం

పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. 
శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. 
అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవిదుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. 
నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించి …గజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించమని కోరుతాడట. 
అందు కోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తిఅద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. 
గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట. 
తన పాచిక పారిందనుకున్న హరి… ఇది శివుని వాహనమైన నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. 
అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట. 
ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. 
ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు.

ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట,
రాములవారి పాట, 
ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట,
వీరగున్నమ్మ పాట (మందస ప్రాంతంలో), 
మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీకట్టి పాడతారు. 
సినిమా పాటలు కూడా పాడతారు. 
తమిళనాడు, కర్ణాటకరాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల వారున్నారు. 
అయినా వీరంతా తెలుగువారే. మహారాష్ట్రలో వీరిని నందివాలా అంటారు.

డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా
కఉరుకుతూ రన్నా రారన్న బసవన్నా
అమ్మవారికీ దండం బెట్టు అయ్యగారికీ దండం బెట్టు
మునసబు గారికి దండం బెట్టూ
కరణం గారికి దండం బెట్టూ
రారా బసవన్నా, రారా బసవన్నా…. అంటూ
ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు,
మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలను ఊపిస్తారు.

ఒక నాడు దేదీప్యమానంగా వెలిగిన గంగిరెద్దాటలు వ్యాచక వృత్తిని అవలంబించినా అవి విద్వత్తును ప్రదర్శించే గంగి రెద్దుల మేళంగానూ, ప్రజలను వినోద పర్చి ఆనందింప చేసే కళా రూపంగానూ ఖ్యాతి వహించింది. గంగిరెద్దుల మేళాల వారు, రెండు మూడు కుటుంబాలు కలిసి అయిదారు అందమైన బలిసిన గంగిరెద్దులతో దండుగా బయలు దేరి ఆంధ్ర దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ మకాంలు వేస్తూ జీవ యాత్రలు చేసే వారు.
గంగిరెద్దుల వారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తెలుగు భాషనే మాట్లాడుతారు. 
వీరికి ఒక వూరనేది లేదు. సంచార జీవులైన వీరు పర్వ దినాలలోనూ, ముఖ్యంగా రైతులకు పంటలన్నీ చేతికి వచ్చి పని పాటలు లేని సమయాల్లోనూ, సంక్రాంతి పండుగ దినాలలోనూ వూర్ల వెంట బయలు దేరుతారు.

పూర్వం ప్రజలు గంగిరెద్దుల వారిని ఆదరించి బట్టలు, భత్యం, డబ్బులు యిచ్చి చనిపోయిన తాత తండ్రుల పేరు మీద పొగిడించేవారు. గ్రామాలలో వివిధ ప్రదేశాలలో గంగిరెద్దు విన్యాసాలు చేయించేవారు.

గంగిరెద్దుల అలంకారం:

గంగిరెద్దుల్ని స్వంత బిడ్డల్లా చూస్తారు. 
వాటిని ఎన్నో రకాలుగా అలంకారిస్తారు. 
మూపురం వద్ద నుండి తోక వరకూ ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. రింగులతో కొమ్ములను అలంకరిస్తారు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి చిరవన రంగురంగుల ఊలు దారాల కుచ్చులను కట్టతారు. వీటినే కుప్పెలు అని అంటారు. మూతికి తోలుతో కుట్టబడిన మూజంబరంను కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. అందమైన గవ్వలను కూడా కడాతారు. మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగ వేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును, గవ్వల హారాన్ని కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. ఇంటి యజమానులు చీరలు, దుప్పట్లు వంటి బట్టలను ఇస్తారు. వాటిని ఆ గంగిరెద్దు వీపు మీద వేస్తుంటారు. అప్పుడు చూడాలి ఆ బసవన్నల అందం. సాక్షాత్తూ నందికేశ్వరుని పోలి వుంటుంది……..@తులసి….

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *