Breaking News

తొలగిపోతున్న తెలుగు పదాలు

తొలగిపోతున్న తెలుగు పదాలు 

అన్వాహార్యము

నెలనెలా అమావాస్య రోజున పితృదేవతలను సంతృప్తి పరచేందుకు చేసే శ్రాద్ధ కర్మను ‘అన్వాహార్యము’ అంటారు. ఈ పితృయజ్ఞాన్ని ‘పిండాన్వాహార్యకము’ అని కూడా అంటారు. ‘మనుస్మృతి’ ( 3-123) లో ఇలా ఉంది.

“ పితౄణాం మాసికం శ్రాద్ధమన్వాహార్యం విదుర్బుధః 
తచ్చామిషేణ కర్తవ్యం ప్రశస్తేన ప్రయత్నతః”

దీని భావం – పితృదేవతల కొరకు నెలనెలా చేసే మాసిక శ్రాద్ధాన్ని అన్వాహార్యము అంటారు. ప్రయత్నపూర్వకంగా ప్రశస్తమైన ఆమిషము (మాంసము) ను సంపాదించి ఈ పితృయజ్ఞాన్ని చేయాలి. ఆ కాలంలో అన్ని యజ్ఞాలలో జంతుబలి, పితృదేవతలకు పెట్టే పిండాలలో మాంసం తప్పనిసరి అంశాలు. సంస్కృత భాష నుంచి తెలుగులోకి వచ్చి చేరిన ఈ పదం ఇప్పుడెక్కడా ఉపయోగంలో లేదు.

అన్విష్టము

‘అన్విష్టము’ అన్నా ‘అన్వేషితము’ అన్నా ‘వెదుకబడినది’ అని అర్థం.

అన్వీక్షకి

‘ అన్వీక్షకి’ అన్నా ‘ ఆన్వీక్షకి’ అన్నా తర్క విద్య (Logic). దీనిని ‘ ఆన్వీక్షికీ’ అని కూడా అంటారు. క్షత్త్రియ కుమారులకు బాల్యంలో గురువులు ఉపదేశించే నాలుగు రాజశాస్త్రాలు లేక రాజవిద్యల( King – craft) లో ‘ఆన్వీక్షికీ’ ఒకటి. రాజనయము లేక రాజనీతిలో భాగంగా వారికి ‘ ఆన్వీక్షికీ’ లో కూడా శిక్షణ ఇచ్చేవారు. ‘ మను స్మృతి’ ( 7-43) ప్రకారం రాజకుమారులకు త్రయీ విద్యలు (ఋక్, సామ, యజుర్ వేదములు),దండనీతి , బ్రహ్మ విద్యలతో పాటు ఆన్వీక్షకీ (తర్కశాస్త్రం) లో కూడా రాజగురువులు శిక్షణ ఇచ్చేవారు.

అన్వీక్షణము

‘ అన్వీక్షణము’ అంటే అన్వేషణ. మార్గణము లేక వెదకుట. ‘అన్విష్టము’ అన్నా ‘ అన్వేషితము’ అన్నా‘ వెదకబడినది’ అని అర్థం.

అన్వితము – అన్వీతము

‘అన్వితము’ లేక ‘అన్వీతము’ అన్నా ‘కూడుకొన్నది’ అని అర్థం.
అప – అప్ప

అక్కను ‘అక ‘ అన్నట్లే, ‘అన్న’ ను ‘అన’ అన్నట్లే ‘అప్ప’ ను ‘ అప’ అనికూడా అంటారు. అప్ప శబ్దానికి తల్లి, తండ్రి, అక్క, పతి, దైవము – ఇలా పలు అర్థాలున్నాయి. 
“ కనుగొంటి .. కనుగొంటి .. ఇప్పుడిటు కనుగొంటి .. ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాధీశు గంటి .. “ అంటూ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు రాసిన కృతిలో ‘అప్పడు’ అంటే దైవం, పతి (భర్త) అని అర్థం.

‘అచ్ఛ తెనుఁగు రామాయణము’ లోని యుద్ధకాండములో తిమ్మయ కవి ‘అప్ప’ శబ్దాన్ని ‘తండ్రి’ అనే అర్థంలో ప్రయోగించిన తీరు చూడండి –

‘అప్ప యానతిబూని కానలకరిగి తపసుల వెఱపు దీఱిచి, 
చుప్పనాకను ముక్కుజెవులును సొరిది గోసి కొఱంతజేరిచి’ 
‘ 
అప అనేది అప్ప శబ్దానికి రూపాంతరంగా తల్లి, తండ్రి, అక్క, దైవం వంటి అర్థాలలోనే కాక, ఉపసర్గము ( a preposition pre-fixed to roots)గా విరుద్ధమైన అర్థాన్ని ఇవ్వడానికి ప్రయోగిస్తారు. 
ఉదా : అపకీర్తి, అపఖ్యాతి, అపయశము, అపజయము,అపార్థము, అపకారము, అపసవ్యము, అపస్వరము,అపస్మృతి (అపస్మారము) మొదలైనవి.

‘అన్నా !’, ‘అన్నన్నా!’ శబ్దాలను ఆశ్చర్యార్థకాలుగా వాడినట్లే, ‘అప్పా !’ , ‘అప్పప్పా !’ శబ్దాలనూ ఆశ్చర్యాన్ని తెలియజేసేందుకు ప్రయోగిస్తారు.

చేమకూర వేంకటకవి ‘ సారంగధర చరిత్రము’ మొదటి ఆశ్వాసములో చేసిన ఈ క్రింది ప్రయోగము చూడండి –

“ ఉ. అప్పప్ప భవత్ప్రభావవిభవాఢ్యత యేమని సన్నుతింపగన్”

‘ రాజవాహన విజయము’ కావ్యంలోని మొదటి ఆశ్వాసంలో కాకమాని మూర్తి కవి చేసిన ఈ క్రింది ప్రయోగం కూడా చూడండి –

“ ఉ. అప్పాయప్పురి జెప్పనొప్పుదురు రూపాజీవికా రత్నముల్”

(రూపాజీవికలు అంటే తమ రూపం మీద ఆధారపడి బతికేవారు. వేశ్యలు.)

అపక్రమించు

అపక్రమము అనే శబ్దానికి తిరోగమించడం అని అర్థం. అపక్రమించు అంటే (యుద్ధం నుంచి) పారిపోవడం అని. క్రమము అంటే ‘వరుస’ , ‘సొరిది’ అనే అర్థాలు కాక ‘అడుగిడడం’ అనే అర్థం కూడా ఉంది. అందుకే ‘అతిక్రమించు’ అంటే ‘మితిమీరి ముందుకు వెళ్లడం ‘ అనీ, ‘అపక్రమించు’ అంటే వెనక్కి తిరిగి పారిపోవడం లేక వెన్నుచూపడం అనీ అర్థాలు ఏర్పడ్డాయి. . దీనినే ‘ అపయానము’ అనీ, ‘ ఈడ బోవడం’ (ఈడన్ +పోవు) అనీ కూడా అంటారు.

అపచాయితుడు / అపచితుడు

‘అపచాయితుడు’లేక ‘అపచితుడు’ అంటే ‘అర్చితుడు’, ‘ పూజింపబడినవాడు’. అపచితి అంటే పూజ.

అపత్రప / అపత్రపిష్ణువు

ఇతరులవలన కలిగే సిగ్గును ‘ అపత్రప’ అంటాం. లజ్జయే స్వభావముగా కలవాడిని ‘అపత్రపిష్ణువు ‘ (సిగ్గరి) అంటాం.

అపసర్ఫుడు

అక్కడక్కడా తిరుగుతూ రహస్య సమాచారం సేకరించి తెచ్చి రాజుకు నివేదించే ఉద్యోగిని ‘ అపసర్ఫుడు’ అంటారు. అతడినే ‘వేగరి’ అనేపేరుతోనూ పిలుస్తారు.

అపస్నానము / అపస్నాతుడు

మనకు దగ్గరివారు చనిపోయినప్పుడు మనం చేసే స్నానాన్ని ‘అపస్నానము’ అంటారు. అలా అపస్నానం చేసిన వ్యక్తిని ‘అపస్నాతుడు’ అంటారు.

అపామార్గము

అపామార్గము అంటే ఉత్తరేణి మొక్క. ఎమరాంథేసీ 
( Amaranthaceae) కుటుంబానికి చెందిన ఉత్తరేణి మన ప్రాంతాలలో విరివిగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం ఎకిరాంథస్ యాస్పరా (Achyranthes aspera). దీనిని ఆంగ్లంలో Prickly Chaff Flower అనీ Devil’s Horse Whip అనీ అంటారు. గుర్రాన్ని తోలే కొరడాలా ఉండే ఈ మొక్క పుష్పగుఛ్చాన్నిబట్టి దీన్ని అలా పిలుస్తున్నారు. ఈ మొక్కకున్న వైద్యపరమైన విలువలను మన ప్రాచీనులు గుర్తించారు. ఆ కారణంగానేనేమో వినాయక చతుర్థి రోజున గణేశపూజకు వాడే 21 రకాల పత్రి మొక్కలలో ఉత్తరేణిని కూడా చేర్చారు.ఈ మొక్క లేత ఆకులను కొందరు ఆకు కూరగా వాడుకుంటారు.ఈ ఆకుల్ని పశువులు, మేకలు ఇష్టంగా తింటాయి. దీని గింజలకున్న సన్నటి నూగు ముళ్ళ కారణంగా ఇవి బట్టలమీద, ఒంటిపైన చిక్కుకుంటాయి. ఈ మొక్క ఆకుల రసం శరీరంలోని స్రావాలను అరికడుతుంది. మూత్రాన్ని జారీకావిస్తుంది. ఈ రసం స్త్రీల ఋతుస్రావాన్ని క్రమబద్ధీకరిస్తుంది. మూల వ్యాధి (పైల్స్)ని, చర్మ రోగాలనూ నివారిస్తుంది. గనేరియా, ఉబ్బసం, 
కుష్ఠు వంటి మొండి వ్యాధులను నయం చేస్తుంది. దీని వేళ్ళను మెత్తగా నూరి కళ్ళలో పెట్టుకుంటే చూపు మందగించినవారికి ఎంతో ప్రయోజనకరం. ఈ వేళ్ళ కషాయం తాగితే ఉదర కోశ సంబంధమైన వ్యాధులు, మూత్ర పిండంలోని రాళ్లు నివారణ అవుతాయి.

— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *