Breaking News

శాస్త్రీయ దృష్టి

శాస్త్రీయ దృష్టి

20993963_1541892692548123_1998951492170965231_n 21015999_1541893312548061_204515239236732260_o 21032876_1541894022547990_5544207014033707103_n 21082982_1541892835881442_3304249037371502279_o 21105963_1541892652548127_6175698082491043278_n

నాకు పదహారేళ్ళ వయస్సులో మానవుడు చంద్రమండలంపై కాలుమోపాడు.’అపోలో’ వ్యోమనౌకలో ఎడ్విన్ ఆల్ డ్రిన్ తో అక్కడికి చేరుకున్న నీల్ ఆమ్ స్ట్రాంగ్ అక్కడి నేలపై పాదం మోపిన తొలి మానవుడయ్యాడు.అప్పట్లో కొందరు సంప్రదాయవాదులు ఈ
‘ చారిత్రక ఘటన’ను అసలు వాస్తవమని అంగీకరించలేదు.
ఒకప్పుడు వారే యూరీ గగారిన్ రాకెట్లో వ్యోమంలో భూమిని చుట్టి వచ్చినప్పుడు ‘ భూమి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం కాదు; చేతనైతే చంద్రమండలానికి వెళ్ళమనండి.అప్పుడు ఆలోచిద్దాం.శాస్త్ర పురోగతి యొక్క ప్రయోజకత్వాన్ని గురించి’ అని సవాళ్లు విసిరే వాళ్ళు.తీరాతీసి, చంద్రుడి పై మానవుడు పాదం మోపిన తరువాత, అదసలు సత్యమని అంగీకరించడానికి కూడా వారు నిరాకరించారు.’హేతువాదులు స్వర్గం, నరకం ఉన్నాయంటే అంగీకరించరు.మనిషి మరణించిన తరువాత అక్కడికి వెళతాడంటే అస్సలు ఒప్పుకోరు.మానవుడు రాకెట్లో చంద్రమండలానికి చేరుకున్నాడని అంటే మాత్రం ఎలాంటి తటపటాయింపులూ లేకుండా నమ్మేసేస్తారు. మరి ఏ శాస్త్రీయ ఆధారాలతో వాళ్ళు దీన్ని సత్యమని నమ్ముతున్నారు?’ అంటూ ప్రశ్నించేవారు.
వార్తాపత్రికలలో ప్రచురితమైన ఫోటోలు అసలు చంద్రుడి ఉపరితలంపై తీసినవేనా? అసలవి ఆ వ్యోమగాములుతీసిన ఫోటోలేనని ఎలా నమ్మాలి? అంటూ కూడా వారు పలు సందేహాలు లేవనెత్తేవారు.నాకున్న పరిమితమైన శాస్త్ర పరిజ్ఞానంతోనే ఈ వాదనలను అప్పట్లో నేను ఎదుర్కొనేవాడిని.మానవుడు తన స్వయంకృషితో కనుగొన్న పలు పరికరాలలో ఫోటోగ్రాఫిక్ కెమెరా ఒకటి. కెమెరాలో లెన్స్, ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్,ఎపర్చర్ ముఖ్యమైనవి.కెమెరాను ఎప్పుడు క్లిక్ చేసినా లెన్స్ కు ఎదురుగా ఉన్న వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు ఎపర్చర్ ,లెన్స్ ల గుండా ఫిల్మ్ పై పడతాయి. ఫిల్మ్ లో ఉన్న సిల్వర్ బ్రోమైడ్ కారణంగా ఆ వస్తువు యథాతథ ప్రతిరూపం ఫిల్మ్ పై ముద్రితమౌతుంది.ఇలా మనకు లభించే నెగెటివ్ నుంచి ఆ వస్తువు యొక్క ప్రతిరూపానికి ఎన్ని ప్రతులనైనా మనం ముద్రించవచ్చు. ఇది ఇక్కడ సత్యమైనట్లే చంద్రమండలం పైన కూడా సత్యమే. దీనికి వేరే రుజువులవసరం లేదు. క్లిక్ చేసినప్పుడు కెమెరా ముందు మీరు ఉంటే అందులోని ఫిల్మ్ పై మీ రూపం ముద్రితమైనట్లే, ఎప్పుడూ మనం కెమెరాను ఏ వస్తువుపై ఫోకస్ చేసి క్లిక్ చేస్తామో ఆ వస్తువు ప్రతిరూపం కెమెరాలోని ఫిల్మ్ పైనముద్రితమౌతుంది.అక్కడ ఆ వ్యోమగాములు చంద్ర మండల ఉపరితలాన్ని, దానిపై నిలిపివున్న వారి వ్యోమ నౌకనూ,ఒక వ్యోమగామిని మరొక వ్యోమగామి తీసిన పలు చాయాచిత్రాలే కాక వారు తీసిన చిత్రాల్లో దూరంగా కనిపిస్తున్న భూగోళం కూడా ఉన్న పలు ఫోటోలు నాటి వార్తా పత్రికలలో — మరీ ముఖ్యంగా ‘లైఫ్’ వంటి పెద్ద సైజు వర్ణ చిత్రాల మాగజైన్లలోనూ ప్రముఖంగా ప్రచురించబడ్డాయి.భూమికి అత్యంత సమీపంలో ఉన్న భూ ఉపగ్రహమైనట్టి చంద్రుడికీ, భూమికీ మధ్యగల దూరం అంతకు పూర్వమెప్పుడో శాస్త్రీయంగా లెక్క కట్టబడింది.ఈ దూరం సరిగా, శాస్త్రీయంగా గుణించబడినదేనని ప్రయాణానికి పట్టిన కాలం, వ్యోమనౌక వేగంల ఆధారంగా మరోమారు రుజువుపరచబడింది. భూమి ద్రవ్యరాశి కంటే చాలా తక్కువైన ద్రవ్యరాశి కలిగిన కారణంగా చంద్రుడికి భూమికి ఉన్నంత గురుత్వాకర్షణ శక్తి ఉండదని అంతకు ముందరెప్పుడో శాస్త్రీయంగా నిర్ధారించబడింది. చంద్రోపరితలంపై నడవడానికి ప్రయత్నించిన వ్యోమగాములు తమ స్వీయానుభవంతో చంద్రుడి 
గురుత్వాకర్షణ శక్తి గురించి లోగడ చేసిన నిర్ధారణలు శాస్త్రీయమైనవేనని మరోమారు రుజువుపరచారు. అలాగే చంద్రుడిపై వాతావరణపు పొర లేదనే విషయం కూడా ఆ వ్యోమగాములు మరోమారు తమ అనుభవపూర్వకంగా రుజువు పరచుకున్నారు. శాస్త్రీయంగా ఆలోచించడం, శాస్త్రీయంగా అంచనాలు కట్టడం, వాటిని పరీక్షకులోనుచేసి పొరబాట్లేవైనా ఉంటే వాటిని దిద్దుకోవడం, మరింత మెరుగైన శాస్త్రీయ అవగాహనతో ముందుకు సాగడం.ఇదీ శాస్త్రీయత అంటే.

మనందరం మైక్రోస్కోపు కనిపెట్టగలిగేటంత మేధావులం కానవసరం లేదు.కానీ, మైక్రోస్కోపు క్రింద పరిశీలిస్తే కంటికి కనుపించని సూక్ష్మ పదార్థాలు సైతం పెద్దవిగా కనుపిస్తాయనీ, అది ఇక్కడే కాదు సర్వే సర్వత్రా సత్యమనీ తెలుసుకుంటే చాలు. ఆ విషయం మేరకు మనం శాస్త్రీయ దృష్టి కలిగి ఉన్నట్లే.శాస్త్ర సత్యాలకు మనం ఆవిష్కర్తలం కానవసరం లేదు.శాస్త్ర సత్యాలన్నీ మనకు తెలిసి తీరాల్సిన అవసరమూ లేదు. ఎన్ని శాస్త్రాలనని మనం స్వయంగా అధ్యయనం చేసి, ఆపోసన పట్టగలం? అందుకని మనం శాస్త్రీయ దృష్టిని కలిగి ఉంటే చాలు. మన తలకు వెంట్రుకలు ఎన్నున్నాయో, మన శరీరంలో కణాలు, నాడులు ఎన్నున్నాయో తెలియాల్సిన అవసరమూ లేదు. దాని వల్ల మనకు ఎటువంటి ప్రయోజనమూ లేదు.. శాస్త్ర సత్యాలు ఎక్కడైనా ఎవరికైనా సత్యాలుగానే ఉంటాయనీ,వాటి ఆవిష్కరణకు ఒక సుదీర్ఘ చరిత్ర ఉందనీ,ప్రతి రంగంలోనూ ఒక శాస్త్రజ్ఞుడి ఆవిష్కరణలకు అంతకు పూర్వపు శాస్త్రీయ ఆవిష్కరణలు ఆధారాలుగా నిలుస్తాయనీ,వాటి పునాదిపైనే సరికొత్త ఆవిష్కరణలు చేయబడతాయనీ గ్రహిస్తే చాలు.ఈనాటి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు అన్నింటికీ అలా ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది.అదంతా అలా గాలికి ఒదిలేసి, మానవ నాగరకతా చరిత్రలో మానవుడు ఒకదాని తరువాత మరొకటిగా ఆవిష్కరిస్తూ వస్తున్న ఈ శాస్త్రీయ పరిశోధనలనన్నిటినీ త్రోసిరాజని, ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం యొక్క ఆసరా ఇసుమంతైనా లేకుండా కేవలం యోగ దృష్టితోనే మానవుడు తన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో కూడా తెలుసుకోగలడనీ, పరమాణు సంఘాత, విఘాతాలకు కారణాలు, వాటి పరిణామాలు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాడని, విశ్వ రహస్యాలన్నీ ఆవిష్కరించడం యోగదృష్టితో సాధ్యమేననీ ,భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన, జరుగుతున్న, జరుగనున్న సంఘటనలన్నింటినీ తెలుసుకోగలగడం కూడా యోగ సాధన ద్వారా సాధ్యమనీ అంటే నమ్మేయడం శాస్త్రీయత ఎలా ఔతుంది? మేధావి అయిన ప్రతి శాస్త్రజ్ఞుడి విజయాల వెనుక, అతడి వెనుక తరాలవారి శాస్త్ర పరిజ్ఞానం,వారి విజయాల, పరాజయాల, అనుభవాల సారాంశం తప్పనిసరిగా ఇమిడి ఉంటాయని గ్రహించడమే నిజమైన శాస్త్రీయ దృష్టి.శాస్త్రజ్ఞుల విజయాలకు కేవలం వారి వ్యక్తిగత ప్రతిభో లేక దైవ కృపో కారణమని భావించడం శాస్త్రీయ దృష్టి కాదు.కేవలం యోగసాధనతోనే సకల శాస్త్ర మర్మాలూ తెలుసుకోగలిగేటట్లయితే ఇన్నిన్ని భాషలూ, ఇన్నిన్ని శాస్త్రాలూ, ఇన్నిన్ని స్పెషలైజేషన్లూ, ఇన్నిన్ని పరిశోధనలూ, ఇన్నిన్ని విజయాల , పరాజయాల , అనుభవాల సారాల మదింపులూ అవసరమా? ఏ ఒక్క యోగినో యోగసాదనలో కూర్చోబెట్టి, ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని లేకుండా సకల శాస్త్ర మర్మాలూ అతడి ద్వారా తెలుసుకుంటూ సమాజాన్ని మరింత బాగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగొచ్చు కదా? అప్పుడు మిగిలినవాళ్ళ సమయం, ధనం కూడా వృథా కాకుండా ఉంటాయి కూడా!ఇలాంటిదసలు సాధ్యమేనా? సాధ్యమైతే ఏరకంగా సాధ్యమో శాస్త్రీయంగా వివరించగలవారు ఎవరైనా ఉన్నారా? ఇది శాస్త్రీయంగా సాధ్యపడేదైతే నేటి ప్రభుత్వాలు దీనికే ప్రథమ ప్రాధమ్యం ఇవ్వాలి. ఏ శాస్త్రం ప్రకారం కూడా ఇది శాస్త్రీయ దృష్టి కానే కాదని ఆలోచనాపరులెవరైనా ఇట్టే గ్రహించగలరు.ఇదీ క్లుప్తంగా శాస్త్రీయ దృష్టికీ, కేవల విశ్వాసానికీ ఉన్న మౌలికమైన భేదం.

కొందరు తమ విశ్వాసాలు ఏమేరకు శాస్త్రీయమైనవోనని తెలుసుకునేందుకు వాటిని ఎట్టి పరీక్షలకు లోనుచెయ్యరు. తరతరాలుగా తమ తాత తండ్రులు నమ్ముతూ వస్తున్న వాటినే తామూ ఎటువంటి శాస్త్రవిచారణ చేయకుండా సత్యాలుగా స్వీకరిస్తారు.అలాంటి విశ్వాసాలలో భాగమే దేవుడు,దయ్యం, స్వర్గం, నరకం వగైరాల గురించి వారికున్న నమ్మకాలు కూడా.మన శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలతో పాటు ఆత్మఅనేది కూడా ఒకటి ఉంటుందనీ, అది పదార్థేతరమైనదనీ(Spiritual), అది పదార్థంలా నశ్వరం(నశించేది) కాదనీ, అనశ్వరమనీ(నశించనిదనీ), అది ఒక శరీరం నుంచి మరొక శరీరం లోకి ప్రవేశిస్తుందనీ(Metempsychosis) కొందరు ఇలాగే ఎలాంటి విచారణ చెయ్యకుండానే నమ్ముతున్నారు.మరణానంతరం వారి కర్మల గుణ దోషాలనుబట్టి పుణ్య కర్మలు చేసినవారి ఆత్మలు స్వర్గానికి వెళ్తాయనీ, పాప కర్మలు చేసినవారి ఆత్మలేమో నరకానికి వెళ్తాయనీ నమ్ముతున్నారు.స్వర్గం ఎక్కడుంది? అనే విషయంలో ప్రపంచంలో ఒక్కో మతం ఒక్కో అభిప్రాయం కలిగి ఉంది.

ఋగ్వేద ఆర్యులు స్వర్గం ఊర్థ్వలోకాల్లో ఉందని భావించారు.అగ్ని మండేటప్పుడు వెలువడే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్లు గాలి కంటే తేలికైనవి అయినందున అగ్ని కీలలు ఎప్పుడూ పైకే మండుతూ ఉంటాయి.ఈ కారణంగా ఊర్థ్వ లోకాలలో ఉన్న దేవతలకు తాము యజ్ఞాల సందర్భంగా సమర్పించే హవిస్సులను వారు యాగాగ్నిలో వేసి ,వాటిని అగ్ని స్వర్గంలోని దేవతల వద్దకు మోసుకు వెళ్తాడని భావించేవారు.అందుకే వారు అగ్నిని’హుత వాహుడు’,’హవ్య వాహనుడు’ అని పిలిచారు.విలువైన నేతినీ,’తిల,మాషా,వ్రీహి,యవా'(నువ్వులు,మినుములు,వరి ధాన్యం,బార్లీ)మొదలగు విలువైన ఆహార ధాన్యాలను అగ్నికి వారు సమర్పించేవారు. అగ్ని ద్వారా దేవతల వద్దకు చేరతాయని వారు భావించిన సకల వస్తు సంచయమూ హోమ గుండంలో బుగ్గిపాలయేది- ‘జగదేక వీరుని కథ’ చలన చిత్రంలోని ‘రాజన్'(రాజనాల),బాదరాయణ ప్రెగ్గడ(సి.యస్.ఆర్.)ల వలెనే. వారు స్వర్గానికి వెళ్ళినట్లు ఆధారాలేలాగైతే లేవో అలాగే ఆ హవిస్సులూ దేవతల వద్దకు చేరిన దాఖలాలు లేవు. దేవతల వద్దకు తాను మోసుకెళ్ళి సమర్పించిన హవిస్సులకు ప్రతిఫలంగా వారినుండి యజమాని(యజ్ఞ నిర్వాహకుడైన గృహస్తు)కి అగ్ని సకల సంపదలూ తీసుకొస్తాడని వారు నమ్మారు.అందుకే వారు అగ్నిని ‘హోత’గానూ,’ రత్న దాత’గానూ భావించారు.

స్వర్గం ఊర్థ్వ లోకాల్లో ఉందనీ, నాట్య ప్రావీణ్యంలో రంభ-ఊర్వశి ల నడుమ ఏర్పడిన తగవులో న్యాయ నిర్ణయం చేసేందుకు ఇంద్రుడి పనుపున విక్రమార్కుడిని ఇంద్ర సారథి మాతలి తన రథంలో దేవలోకానికి తీసుకు వెళ్ళాడనీ బాల్యంలో విన్న కథ.సంత్ మహాత్ములనూ, పతివ్రతలనూ బొందితో స్వర్గానికి తీసుకు వెళ్ళేందుకు పుష్పక విమానాలు, దేవ రథాలూ సత్యకాలంలో తరచు భూలోకానికీ, స్వర్గానికీ మధ్య ‘షటిల్ సర్వీసు ‘గా నడిచేవట! అప్పట్లో భూమికీ,స్వర్గానికీ మధ్య రాయబారులుగా బిజీ,బిజీగా తిరిగిన మన ‘కలహ భోజనుడు’నారదుడు గానీ, నాటి గ్రీకు దేవదూత హెర్మిస్ గానీ మరి ఇప్పుడేమై పోయారో వారి ఆచూకీ మచ్చుకైనా తెలియరావడం లేదు!!

క్రైస్తవుల మత గ్రంథం ‘బైబిల్’ లో కూడా స్వర్గం మనకు పైనే ఉన్నదనే నమ్మకమే వ్యక్తమైంది.ఆది కాండం(Genesis) లో పేర్కొన్న గొప్ప జలప్రళయం తరువాత షినార్(Shinar) మైదానం లో బేబెల్ టవర్ (Tower of Babel) ను అక్కడి ప్రజలు స్వర్గారోహణ చేసే ఉద్దేశంతోనే మేఘాలు తాకేటంత ఎత్తైనదిగా నిర్మించారు.అయితే దాని నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది; దాన్ని ఆ తరువాత అలెగ్జాండర్ కూలగొట్టాడు; అది వేరే సంగతి. మన కుతుబ్ మినార్ ల వంటి ఎత్తైన నిర్మాణాల వెనుక ఉద్దేశం కూడా ‘స్వర్గారోహణ’ చెయ్యాలనే దురాశేనేమో మరి!

మహాభారతం లోని’ స్వర్గారోహణం’ ఉదంతం మనవాళ్ళు స్వర్గం ఊర్థ్వ లోకాల్లోనే (Upper Worlds) ఉన్నదని నమ్మారనేందుకు మరో ఆధారం.పైన ఉంటేనే కదా మనం ఆరోహణ చేసేది(ఎక్కేది)? ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట’ అనే సామెత కూడా మన ప్రాచీనులు స్వర్గం మనకు పైనే ఉన్నదని నమ్మారని తెలుపుతున్నది.విశ్వామిత్రుడు ‘త్రిశంకు’ అనే వాడిని బొందితోనే స్వర్గానికి పంపాలని ప్రయత్నించి, అతడికి అక్కడ ప్రవేశం లభించనందున భూమికీ, స్వర్గానికీ మధ్యలో అతడికోసం ఏకంగా ఒక స్వర్గాన్నే నిర్మించాడట !! దాన్ని’ త్రిశంకు స్వర్గం’అని పిలిచారు.

ప్రాచీన గ్రీకులు తమ దేవతలు ఒలింపస్ పర్వతం పైన ఉంటారనీ, దేవతల కృప ఉన్న వారు మరణానంతరం వారి స్వర్గమైన ల్యూక్ దీవి(తెలి దీవి)కి చేరి అక్కడ తాము కోరుకున్న స్త్రీలతో సుఖపడతారనీ నమ్మేవారు.గ్రీకుల స్వర్గం’ తెలి దీవి’ డాన్యూబ్ నది( River Danube ) నల్ల సముద్రం (Black sea)లో కలిసే చోటికి సమీపంలో ప్రస్తుతం రుమేనియా దేశ భూభాగంలో ఉన్న ‘ల్యూక్’ లేక ‘ల్యూకే'(Luke) దీవి.వారి నరకం స్టిక్స్ (Styx) నదికి ఆవల ఉన్న యాస్ఫోడెల్ మైదానాలట. పాపిష్టి వారిని నరకలోక పాలకుడైన హేడీజ్(Hades) చిత్రహింసల పాల్జేసి, నరక కూపం(Tartarus) లో వేసి అణగదొక్కుతాడట.హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంద్రుడు స్వర్గలోకాధిపతి. ఏడు ఊర్థ్వ లోకాల్లో స్వర్గం ఒకటి. పుణ్య కర్మలు చేసినవారు స్వర్గలోకం చేరుకుని అమృతపానం చేసి, చావన్నది లేకుండా దేవ వేశ్యలైన అప్సరసలతో సుఖిస్తారట. భూతల స్వర్గం వంటి సస్యశ్యామలమైన భారతదేశంలో ఒక్క చావుతప్ప మనిషి జయించలేక పోయిందేదీ లేదు.అందుకే భారతీయులు స్వర్గంలో అమృతం (Nectar or Ambrosia) లభిస్తుందనీ, అది తాగి అమరులవవచ్చనీ ఆశించి తమ స్వర్గాన్ని తదనుగుణంగానే ఊహించుకున్నారు. పాపం నీరు కూడా సరిగా చాలినంత దొరకని అరేబియా ఎడారిలో పుట్టిన మతం కాబట్టి ‘ఇస్లాం’ మత గ్రంథమైన ‘ఖురాన్’లో వారి స్వర్గాన్ని వారు పరిమిత కోర్కెలతోనే ఊహించుకున్నారు.స్వర్గంలో ఎక్కడ చూసినా పుష్కలంగా నీరు లభిస్తుందట.ఎటుచూసినా ఆకు పచ్చటి ఫల, పుష్ప వృక్షాలు, చల్లటి మలయ మారుతాలు,ఎప్పుడూ ఎడతెగకుండా ప్రవహించే ‘జమ్ జమ్’ అనే నీటి ఊట- ఇవి చాలనుకున్నారు వారి స్వర్గంలో. కొందరేమో కైలాస పర్వతం ముక్తికి సోపానమనీ అక్కడికి చేరుకొనడమే మానవుల అంతిమ లక్ష్యమనీ, అదే స్వర్గమనీ నమ్ముతారు.మరికొందరు ప్రపంచం లోకెల్లా ఎత్తైన టిబెట్ లోని పామీర్ పీఠభూమి లోనిదైన ‘మానస సరోవరం’ సమస్త దేవతలకూ నెలవనీ అదే స్వర్గమనీ అభిప్రాయపడ్డారు. ప్రపంచం లోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సయిన రష్యా లోని సైబీరియా లోని బైకాల్ (వైఖానస)సరస్సు లోని ‘తెలిదీవి’ విష్ణువు లేక నారాయణుడి నివాసమనీ, ఆ తెలిదీవే వైకుంఠమనీ వైష్ణవుల విశ్వాసం.ఇక పాపిష్టివారు నరకలోకాధిపతి యముడు పెట్టే నరక యాతనలు లేక యమ యాతనలు భరించాలట. ఇందుకోసం నరుల ఆత్మలు తమ యాతనా దేహంతో సహా వైతరణీ నదిని దాటి యముడి పాలనలోని నరకలోకం చేరుకుంటాయట. గ్రీకుల స్టిక్స్ (Styx) నది వంటిదే మన వైతరణీ నది.

నరకలోకం సప్త అధోలోకాల(Nether Worlds)లో అట్టడుగుదట.దాన్ని పాతాళం అనీ , నాగలోకం అనీ అనేవారు. మన పురాణాలు, ప్రాచీన సాహిత్యం నరకలోకం నాగులకు నెలవనీ, కొన్ని పాములపుట్టల అడుగునుంచీ, కొన్ని నదుల అడుగునుంచీ, నైమిశారణ్యం లోని సరస్సుల అడుగు భాగం నుంచీ నాగలోకానికి దారులున్నాయని పేర్కొనడం జరిగింది.మహాభారతంలో విషాహారం తిన్న బాల భీముడు యమునా నది అడుగునుంచి ఉన్న మార్గం ద్వారానే నాగులచే నాగలోకానికి తీసుకుపోబడి నాగరాజుచేత విషహరణం చేయబడి సురక్షితంగా హస్తినకు తిరిగివస్తాడు.వాస్తవానికి భూమి గోళాకారంలో ఉన్నదనే పరిజ్ఞానం నాటికిలేదు.భూగర్భంలో అట్టడుగున ఉండే నాగలోకం( అంటే భూకేంద్రం) వద్ద ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకు నాగుపాములేకాదు; ఏ పదార్థాలూ ఘనస్థితిలో ఉండే అవకాశమేలేదు.దాదాపు పదార్థాలన్నీ మండుతున్న వాయువుల రూపంలోనో, సలసల కాగుతున్న ద్రవాల రూపంలోనో ఉంటాయి.కనుక భూకేంద్రంలో నాగలోకం, నాగులు ఉండే అవకాశమేలేదు. ఇక మన వాళ్ళు ఊహించుకున్న ‘ రౌరవం’ మొదలైన నరకాలన్నీ ఎక్కడ ఉండేవో మరి ? అయినా మన పూర్వులు అవి ఉన్నాయని నమ్మారు కనుక మనమూ నమ్మాలా మరి?

గ్రీకు పురాణ గాథలను అనుసరించి టైటాన్లు (Titans) అనే తమ కంటే బలిష్టులైన దాయాదులను ఒలింపియన్ దేవదేవుడు జ్యూస్(జియస్)మోసంతో, మాయోపాయంతో నరకంలోని పాతాళ కూపం(Tartarus) లో వేసి అణగ తోక్కేసాడట– మన విష్ణువు వామనావతారంలో మాయోపాయంతో దానశీలి, ఆడి తప్పనివాడూ అయినట్టి బలి చక్రవర్తిని తన మూడో పాదంతో పాతాళానికి తోక్కేసినట్టు.

.పునర్జన్మ అంటూ లేకుండా ఉండడమే మోక్షం అని మన ప్రాచీనుల భావన.అలాంటి జన్మరాహిత్యం కోసం వాళ్ళు పరితపించేవారు.ఈ శ్లోకం చూడండి.

శ్లో. కేదారేహ్యుదకం పీత్వా 
వారణాస్యాం మృతం తథా
శ్రీశైల శిఖరం దృష్ట్వా 
పునర్జన్మ న విద్యతే ||

కేదారనాథ్ క్షేత్రంలో నీళ్ళు తాగినా, వారణాసి లో మరణించినా,శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నా తిరిగి పునర్జన్మ ఉండదు.జన్మరాహిత్యమేనని ప్రాచీనులు నమ్మేవారు.

శ్రీశైల క్షేత్రంలో కళ్ళారా శిఖరదర్శనం చేసుకున్నాక కూడా పై విశ్వాసం పట్ల నమ్మకం లేకనో ఏమో పండితారాధ్యుడు శివైక్యం చెందడం కోసం గిరి శిఖరాన్నుంచి కిందకు దూకి మరణించాడు. ఇలా కైవల్య సిద్ధిని కోరి గిరి శిఖరం పైనుంచి దూకి ప్రాణ త్యాగం చేయడాన్ని ‘కరుమారి’ అంటారు.వీర శైవంలో శివైక్యం చెందడం కోసం భక్తుడు భగవంతుడికోసం తన తల నరుక్కుని ప్రాణత్యాగం చేయడమూ ఉంది.

ఒక పక్క ఆత్మ భౌతిక పదార్ధం కాదనీ, దానికి చావు- పుట్టుకలూ, ఆకలి -దప్పులూ ఉండవంటూనే పితరుల (పితృ దేవతల)ఆత్మలు సత్యలోకం దిశగా ఆరోహణ చేస్తూ ఉంటాయని నమ్ముతూ , వారి ఆకలి తీర్చడానికి పిండ ప్రదానం, వారి దాహార్తి తీర్చడానికి తర్పణలు విడవడం చేస్తుంటారు మనవాళ్ళు.ఆ ఆహారం తీసుకుని, ఆ తర్పణలు త్రాగి పితృ దేవతలు తృప్తి చెందుతారట.ఈ శ్లోకం చూడండి.

శ్లో. వాల్మీకి గీత రఘుపుంగవ కీర్తి లేశై :
తృప్తిం కరోమి కథమప్యధునా బుధానాం
గంగాజలైర్భువి భగీరథ యత్న లభ్ధ్యై :
కిం తర్పణం న విదధాతి నరః పిత్రూణాం ||
(భోజ మహారాజు — ‘చంపూ రామాయణమ్’ )

” వాల్మీకి మహర్షి ఎప్పుడో గానం చేసిన ‘రామాయణమ్’ నుంచే నేను కొద్ది లవలేశాలను గ్రహించి ఈ చంపువును రచించాను. అయినప్పటికీ ఈ నా కృషిలో నేను తప్పక పండితులను మెప్పిస్తాను. అదెలాగంటే గంగాజలాన్ని భూమి మీదకు మనమెవరం తీసుకురాలా. భగీరధుడు తీసుకొచ్చాడు. అయినా మనం ఆ గంగాజలం తో మన పితరులకు తర్పణలిస్తుంటే అవి వారిని తృప్తి పరచడం లేదా?” అంటున్నాడు భోజమహారాజు — రామాయణాన్ని 
Plagiaristic గా కాపీ కొట్టాడనే నింద రేపు తనపైకి రాకుండా ముందు జాగ్రత్తతో.
” పిండాలను చేసి, పితరులను తలపోసి వాటిని మీరు కాకులకు పెడుతున్నారు. అశుద్ధం తినే కాకి పితరుడు ఎలా అయ్యాడు? “– అంటూ లోకరీతిని కటువుగా విమర్శించిన వేమన పద్యం సుప్రసిద్ధమే.
ఇప్పుడు ఒక్కసారి తాపీగా, నిరావేశంగా ఆలోచించండి.
మన పంచ జ్ఞానేంద్రియాలు సేకరించిన సమాచారాన్ని మన మనస్సు విశ్లేషించి, మెదడు లోని కణజాలంలో సంగ్రహంగా భద్రపరుస్తుంది.అవసరం అయినప్పుడు ఆ సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుని దాన్ని అవసరమైన మేరకు ఉపయోగిస్తుంది. మనం మరణించిన తరువాత మెదడుతోపాటు ఆ జ్ఞాపకాలు, భావాలు,భయాలు, ఆవేశాలు, ఆలోచనలూ అన్నీ నశించడమే కాదు; మనం బ్రతికి ఉండగా కూడా ఏ కారణంగానైనా మెదడుకు రక్త సరఫరా నిలిచిపోతే మనం కోమా లోకి జారుకుంటాం. మన మెదడు పనిచేయటం నిలిచిపోతుంది.మనలో పంచేంద్రియాలు, వాటిని పనిచేయించే మనస్సు, రక్తం అనే ఇంధనంతో పనిచేసే మెదడు- ఇవే తప్ప పదార్థేతరమైన’ ఆత్మ’ అనేది ఒకటి ఉండే అవకాశం ఉందా? ఉంటే కోమాలో ఉన్నప్పుడు, బ్రెయిన్ పెరాలిసిస్ వచ్చినప్పుడు అది(ఆత్మ) చొరవతో శరీరావయవాలను పనిచేయించవచ్చు కదా? అప్పుడూ పనిచేయకపోతే అది ఉండికూడా ఇక చేసే పనేముంది? అసలది ఉన్నట్లు రుజువేదైనా ఉందా?ఇలా అసలు ఉందో లేదో ఆచూకీ తెలియని ఆత్మ మన మరణానంతరం స్వర్గం దిశగానో, నరకానికో సాగి పోతుందని విశ్వసించడం ఏమేరకు శాస్త్రీయమంటారు?పదార్థేతరమైన ఆ ఆత్మకు ప్రయాణం చెయ్యడానికి ఇంధనం ఎక్కడినుంచి వస్తుందని ఎవరైనా ప్రశ్నిస్తారని కామోసు– స్వర్గానికి వెళ్ళే ఆత్మలను పుష్పక విమానమో, దేవ సారథి మాతలి రథమో,గరుత్మంతుడో మోసుకు వెళతారనే నమ్మకం, నరకానికి వెళ్ళే ఆత్మలను యమ పాశంతో బంధించి యమభటులు ఈడ్చుకు పోతారనే నమ్మకం కూడా తోడయ్యాయి. శాస్త్రీయ భౌతిక వాదం ఆత్మను నమ్మదు.గౌతమ బుద్ధుడు కూడా అనాత్మవాదే.ఆయన ఐహికేతరమైన, భౌతికేతరమైన విషయాలను ఆలోచించడం వృథా అన్నాడు.అలాంటి విషయాలను ‘అవ్యాకృత వస్తూని’ (Ineffable)అంటూ వాటిపై విచారణను పక్కనపెట్టాడు. శాస్త్రీయ భౌతికవాదం(Scientific Materialism) మాత్రం బుద్ధుడు వదిలేసిన అధిభౌతిక ప్రశ్నల(Metaphysical Questions)ని సైతం ఆధునిక శాస్త్ర పరిశోధనల వెలుగులో విపులంగా చర్చించింది.

ఇలా ఒకదానికొకటి పరస్పరం పోసగనివే దాదాపు మన నమ్మకాలన్నీ. అశాస్త్రీయమైన తరతరాల మన విశ్వాసాలనూ , శాస్త్రీయంగా రుజువుపరచబడిన శాస్త్ర సత్యాలనూ మనం ఒకటే గాటన కట్టరాదు. అలాగని మన ప్రాచీనుల జ్ఞాన సంపదనూ ఎవ్వరూ చిన్న చూపు చూడరాదు. ఆనాడు వాళ్ళు కనుగొన్న ప్రాయికమైన సత్యాలే తరువాతి కాలపు శోధకులకు మార్గదర్శకాలయ్యాయి.ఎంతటి ఉద్గ్రంథాలు చదివిన వ్యక్తైనా 
అక్షరాలు నేర్చుకున్నాకే కదా- ఎన్ని పరిశోధనలు చేసినా! అలా మన శాస్త్ర విజ్ఞానం యొక్క మూలాలు మన ప్రాచీనుల జ్ఞాన సంపదపైనే ఆధారపడి ఉన్నాయన్న సంగతి ఎవ్వరూ, ఎప్పుడూ మరువరాదు. ఖగోళ విజ్ఞానానికి ఆర్యభట్టు,వరాహ మిహిరుడు, భాస్కరాచార్యుడు వంటి ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు గట్టి పునాదులు వేశారంటేనూ ,చరకుడు,సుశ్రుతుడు వంటి భారతీయ వైద్యులు,ఎస్క్లీపియాస్,మేకేయన్,పొడలీరియస్,హిప్పోక్రేటీజ్ వంటి ప్రాచీన గ్రీకు వైద్యులు ఆధునిక వైద్య విజ్ఞాన పురోగతికి బాటలు వేసారంటేనూ ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి? అయితే వారంతా తమ కాలానికి ముందరి 
శాస్త్ర జ్ఞానాన్ని అవసరమైన మేరకు ఉపయోగించుకుంటూ తమ మేధస్సుతో, పరిశోధనా పటిమతో శాస్త్రీయ పద్ధతుల్లోనే ఈ శాస్త్ర విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారనడం సబబు గానూ, శాస్త్రీయంగానూ ఉంటుందే కానీ వారంతా ఎటువంటి అధ్యయనం చేయకుండా, కేవలం యోగ దృష్టి తోనో తపస్సాధనలోనో లేక భగవత్ కటాక్షం కారణంగానో ఈ పరిశోధనా ఫలితాలు సాధించారనడం అవివేకం కాక మరేమిటి? తాముగా వివరించలేని, ఇతరులకు రుజువు పరచలేని అశాస్త్రీయ విషయాలను నమ్మడమేకాక అవి శాస్త్ర సత్యాలంత నికార్సైనవని ఎవరైనా కొందరు ఇంకా వాదిస్తూ ఉంటే వారిని, వారి వాదనలను పక్కకు పెట్టి మనం ముందుకు సాగి పోవాల్సి ఉంటుంది.లేకుంటే మన జీవితంలో మనం సాధించాలనుకుంటున్న లక్ష్యాల దిశగా మనం సాగించే ప్రయాణం కష్ట తరం అవుతుంది.’నాకు బోధపడింది.నీకు బోధపడేటప్పటికి నీకూ బోధపడుతుంది.అందుకోసం నేనేమీ చెయ్యలేను.నీవు కూడా యోగ సాధన చెయ్యి. తపస్సిద్ధి అయ్యాక నీకూ తత్త్వం బోధపడుతుంది.’ అని నాతో అన్న ఒక మిత్రుడిని ‘మరి నువ్వు ఏ తపస్సూ చెయ్యడం లేదు.నాకంటే చక్కగా లౌకిక సుఖాలన్నీ అనుభవిస్తున్నావు.నీకు తత్త్వం బోధపడాల్సిన అవసరం లేదా మరి?’ అని అమాయకంగా అడిగాను.’అబ్బే! నాకెందుకు తపస్సిద్ధి? నా తాత తండ్రుల విశ్వాసాలనన్నిటినీ నేను నమ్ముతున్నానుగా. భారమంతా భగవంతుడి మీద వేసిన నాకు ఇంకేం కావాలి? ‘ అన్నాడతడు ఏమాత్రం తడుముకోకుండా.”ఓహో! అయితే కఠినమైన ఈ యోగ సాధన ఎదుటి మనిషికి సలహా చెప్పేటందుకెనా? నీవు ఆచరించడానికి కాదన్నమాట.ఎట్టి విచారణ చేయకుండా అన్ని విషయాలనూ శాస్త్రీయ సత్యాలుగా స్వీకరించడం,తప్పులతడకలూ,అశాస్త్రీయాలూ అయిన విశ్వాసాలను సైతం నమ్ముతూ, తదనుగుణమైన కార్యాచరణ చేయడం తప్ప ‘ఏమిటి?ఎందుకు?’-వగైరా ప్రశ్నలు వేసుకోవడంగానీ, తత్త్వవిచారం తోగానీ నీకేం పని లేదన్నమాట.”అన్నాను నేను — ‘ ఈ తరహా జీవితం జీవించాలని ఏ బుద్ధిజీవీ, ఆలోచనాపరుడూ కోరుకోరాద’ని మనసులో గట్టిగా అనుకుంటూ.

మీ,
రవీంద్రనాథ్.

( నెట్ లో గతంలో ‘శాస్త్రీయ దృష్టి – అంధ విశ్వాసాలు’ అనే అంశం మీద జరిగిన చర్చలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశమిది.)

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *