Breaking News

ntr (ఎన్టీరా వర్మ!!!)

ఎన్టీఆర్, ఈ పేరు వింటే నరనరాల్లో శక్తి, ఉత్సాహం ఉరకలేస్తుంది. కళ్ళు మూసుకొని ఆ మనిషిని తలచుకుంటే ఉద్వేగం, గౌరవం, భక్తి, ఆనందం, ఆశ్చర్యం అన్నీ ఒకేసారి కుదిపేస్తాయి. ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ అనుభూతి ని మాటల్లో వర్ణించటం ఎవడి వల్లా కాదు, ఎవడికి వాడు అనుభవించి తరించాల్సిందే. అసలు ఎన్టీఆర్ ని నిర్వచించటం ఎవడి వల్ల అవుతుంది !! ఎవడికైనా దేవుడినైనా నిర్వచించగల శక్తి ఉంటుంది కానీ, వాడిని వాడు నిర్వచించుకోగల శక్తి ఎవడికుంది !! అదే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే ఎవ్వరో కాదు నువ్వు, నేను, అందరూ. తెలుగు నేల మీద పుట్టిన ప్రతివాడి మీద ప్రభావం చూపిన వ్యక్తి ఎన్టీఆర్, అయన ప్రభావం సూర్యుడు లాంటిది. ఆ ప్రభావం పడని వ్యక్తి తెలుగునేల మీద లేడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడు తెలుగు నేల మీద ఉన్న ప్రతివాడి మీద ఎన్టీఆర్ ప్రభావం ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది

తెలుగు వాడి పౌరుషం చూడాలంటే ఆయన రోషం చూడాలి, తెలుగు వాడి ప్రేమ చూడాలంటే ఆయన అప్యాయత చూడాలి. తెలుగువాడి ఆతిద్యం చూడాలంటే ఆయన పలకరింపు చూడాలి తెలుగోడి ఆనందం చూడాలంటే ఆయన నవ్వు చూడాలి, అసలు తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన అద్దం ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగోడు, తెలుగోడు అంటే ఎన్టీఆర్.

ఆయన జీవిత చరిత్ర మీద సినిమా అంటే , తెలుగోడి మీద సినిమా. తెలుగు వాడి జీవిత చరిత్ర, మదరాసీ గా మాత్రమే గుర్తింపు పొందిన తెలుగు వాడి కి ప్రత్యేక గుర్తింపు తెచ్చి , వాడి తేజం ఆకాశమంత ఎత్తు అని నిరూపించి ప్రపంచాన్ని తెలుగు ప్రజల పాదాక్రాంతులను చేసిన తెలుగోడు ఎన్టీఆర్ మీద సినిమా అంటే తేలికైన విషయం కాదు, అందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఎవ్వరూ తట్టుకోలేరు. నిజాలు మాత్రమే తియ్యాలి అంటున్న మాట నిజమే అయినా, అసలు ఆ నిజం ఎవరి కోణంలో అనేది ముఖ్యం,. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. బాలకృష్ణ హీరో అంటున్నారు కాబట్టి ఆయన కోణంలో ఉన్న నిజం మాత్రమే పరిగణలోకి తీసుకోవటం లో తప్పు లేదు. మిగతా వారి నిజాలు అనవసరం . ఎందుకంటే అసలు నిజం ఎన్టీఆర్ కి , దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మనకు తెర మీద కనపడేదే అసలైన నిజం, అదే మనం నమ్మే నిజం, అదే జరిగిన నిజం , ఇంతవరకు మిగతా వారి వాదనలు ఎలా ఉన్నా వాటికి విలువలేదు, పట్టించుకోవాల్సిన పని లేదు . ఇలాంటి వాదనల్లో ఎవడి నిజాలు ఎన్నుంటాయో, ఎవడి అబద్దాలు అంతకన్నా వందరెట్లు ఎక్కువుంటాయి . ఎవడిది నిజమైన నిజం కాదు, కాబట్టి కథాంశం మీద నాకు ఎలాంటి సమస్య లేదు, రాదు.

నాకు ఈ సినిమా మీదున్న సమస్య దానికి మించింది, దర్శకుడి తో సమస్య, రామ్ గోపాల వర్మ ప్రతిభావంతుడైన దర్శకుడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఆయన సినిమాలు చూసి, ఈయనకు రాయిని అప్పగించినా, దానితో కూడా నటన చేయించగల ప్రజ్ఞాశాలి అని దేశం మొత్తం చేత కీర్తి కిరీటాలు తొడిగించుకున్న దర్శకుడే. ఇప్పటికీ ఈయన పాత సినిమాలు చూస్తూ, ఔత్సాహిక దర్శకలు పాఠాలు నేర్చుకుంటుంటారు. కానీ గత దశాబ్దంగా వర్మ మారిపోయాడు, సర్కార్ -1 బహుసా అయన మనసు పెట్టి తీసిన చివరి సినిమా అయ్యిండొచ్చు, అప్పటి నుండి ఆయనలో దర్శకుడి స్థానే మార్కెంటింగ్ వర్మ ఉదయించాడు. ఇప్పుడు కూడా వర్మ సినిమాలు చాలా మందికి పాఠాలే, కాకపోతే ఇప్పుడు మార్కెటింగ్ టీమ్స్ కి . అంత చెత్త సినిమాని కూడా ఆయన మార్కెటింగ్ చేసి చూపించాడు చూడండి అని మార్కెటింగ్ టీమ్స్ కి చూపిస్తున్నారు.

సినిమాకి పెట్టిన పెట్టుబడి , లాభాలతో రావటం ముఖ్యమే, కానీ, సినిమా ఒక ఆర్ట్ ప్లాట్ ఫాం, కామర్స్ ప్లాట్ ఫాం కాదు. ప్రతిదానికి సి.ఎ.లు వేసినట్టు అర్ధం పర్ధం లేని లెక్కలేసి, ప్రభుత్వానికి టాక్స్ లు ఎగ్గొట్టే వ్యాపారస్తుడు, సి.ఎ.లు డబ్బులు సంపాదించుకుంటూ ప్రభుత్వాన్ని ప్రతిసారి వెర్రి దాన్ని చేస్తే ఎలా !! అందులోనూ ఇప్పుడు అన్ని రకాలా టాక్స్ లు తీసేసి, జియస్టీ ఒక్కటే వేసిన రోజులు, అలాంటి జిమ్మిక్కులకు కాలం తీరిపోయింది. కానీ వర్మ మాత్రం పాత టాక్స్ లనే నమ్ముకుంటూ తిమ్మిని బమ్మిని చెయ్యగలం అనే పాతకాలపు సి.ఎ.ల ఆలోచనతోనే ఉన్నాడు.

సినిమా అంటే భావోద్వేగాల సమ్మేళనం. అందులోనూ ఎన్టీఆర్ మీద సినిమా అంటే భావోద్వేగాలకు భావోద్వేగాలను అద్దే అతి క్లిష్టమైన ప్రక్రియ.. దానికోసం ప్రతి అంశాన్ని సున్నితంగా స్పృశించగలగాలి. శివ, క్షణక్షణం, రంగీలా, సత్య లాంటి సినిమాలలో ఉద్వేగాలను ఎంత సుకుమారంగా తెర మీద ఆవిష్కరించాడో అంతకు వంద రెట్ల శ్రద్దతో తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చెయ్యాలి. కానీ, ఈ రోజు వర్మ విడుదల చేసిన పాట ని వింటే వర్మ ఎప్పటిలాగే ఏ మాత్రం శ్రద్ద పెట్టకుండా రూపొందిస్తున్నాడా అనే అనుమానం వచ్చేలా ఉంది. పాట సాహిత్యం గొప్ప గా ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా, మరీ అధమంగా లేదు అని సరిపెట్టుకోవచ్చు కానీ, సంగీతం మాత్రం ఏ మాత్రం కొత్త దనం లేకుండా, ఒక లో బడ్జట్ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లా ఉంది. పది సంవత్సరాల క్రితం రూపొందించిన రక్తచరిత్ర సినిమాలో వాడిన ట్యూన్ చాయల్లోనే, వీరప్పన్, సర్కార్, వంగవీటి సినిమాల్లో పాటలు ఉంటే, ఇది కూడా అదే చాయల్లోఉంది తప్ప, మరెలాంటి కొత్త దనం లేదు.

ఎన్టీఆర్ ని కీర్తించాలంటే “ జై ఎన్టీఅర్ “ అనే నినాదం సరిపోదు. ఆ నినాదం మనసునుండి రావాలి. గుండెలోతుల్లోనుండి రావాలి. అప్పుడే ఆ నినాదానికి జీవం వస్తుంది. గుండె లోతుల్లోనుండి ప్రతిద్వనించే ఆ నినాదం తెలుగు వారికి ప్రణవనాదం. కానీ, వర్మ పాటలో లో ద్వని ఉంది కానీ, ఆ ధ్వనిలో జీవం లేదు, శబ్డాడంబరామే తప్ప, మనసులో ఒకముద్ర వేసే ఎలాంటి ప్రత్యేకతా లేదు, ఎన్టీఆర్ వేసే ప్రతి అడుగు కు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వ్యక్తి కథను ఇలా సాదాసీదా గా, మరో పసలేని బయో ఎపిక్ అంటూ తీస్తే వర్మ భంగపడటమే కాకుండా ప్రేక్షకులను కూడా భంగపరుస్తాడు.

ఇప్పటికీ వర్మ మంచి దర్శకుడే, కొద్ది రోజులు స్క్రిప్ట్ మీద శ్రద్ద పెట్టి, ఒక గుడి కడుతున్నంత శ్రద్దగా, ఒక మొక్కని పెంచుతున్నంత శ్రద్దగా సినిమాని రూపొందిస్తే, వర్మ , శివ తర్వాత మరోసారి చరిత్రలో నిలిచిపోతాడు, లేకుంటే తెలుగు ప్రేక్షకులు వర్మ అంటే అసహ్యించుకుంటారు.

మోహన్.రావిపాటి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *