Breaking News

గుమ్మడి విత్తనాలు-ప్రయోజనాలు

గుమ్మడి విత్తనాలు
మిత్రులందరికీ శుభోదయం. ఈ ఫొటోలో కనిపించేది గుమ్మడి విత్తనాల పాకెట్. ఈరోజు మనం ఈ గుమ్మడి గింజల( Pumpkin Seeds) ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం దాదాపు డ్రై ఫ్రూట్ షాపులన్నిట్లో ఈ గుమ్మడి గింజల పాకెట్లు లభిస్తున్నాయి. లూజుగానూ కిలో, అరకిలో, పావు కిలో, వంద గ్రాములు అలా కూడా మనకు కావలిసినన్ని కొనుక్కోవచ్చు కూడా. గుమ్మడి పప్పులు దోసపప్పు, బీరపప్పు, చార ( సార) పప్పుల లాగే హల్వాలలో వాడతారని మనకి తెలుసు. నా చిన్నతనంలో ఎప్పుడైనా గుమ్మడికాయ కూర లేక పులుసు వండినప్పుడు పిల్లలం ఆ గింజల పైపొట్టు ఒలుచుకుని లోపలి పప్పు తినేవాళ్ళం. గుమ్మడి గింజ లోపలి పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ గుమ్మడి పప్పులు కేవలం రుచికరంగా ఉండటమే కాదు. వాటికి ఎన్నో ఆహార, పోషక విలువలున్నాయి. మరెన్నో వైద్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గుమ్మడి తీగ క్యూకర్బిటేసీ ( Cucurbitaceae) కుటుంబానికి చెందినది. దాని శాస్త్రీయ నామం క్యూకర్బిటా మాక్సిమా ( Cucurbita maxima ) గుమ్మడి గింజలు చూసేందుకు చిన్నవిగానే కనిపించినా, అవి విలువైన పోషకాలతో నిండి ఉన్నాయి. రోజూ కాసిని గుమ్మడి గింజలు తిన్నా మన శరీరానికి ఎంతో అవసరమైన కొవ్వు పదార్థాలు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింకు వంటి ఖనిజాలన్నీ వీటి నుంచి లభిస్తాయి. ఇవి రోజూ తింటే గుండె పని తీరు మెరుగు పడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి కి రక్షణ లభిస్తుంది. ఇంకా కొన్ని తరహాల కాన్సర్ల నుంచి ఇవి మనల్ని కాపాడతాయి. పచ్చి విత్తులు ఒట్టివే తినవచ్చు. లేక ఏ ఆహార పదార్థాలలోనైనా వీటిని వేసుకోవచ్చు. లేక కాస్త నెయ్యి లేక నూనెలో వేయించి ఉప్పు కారం చేర్చి తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇరవై ఎనిమిది గ్రాముల గుమ్మడి పప్పులో ప్రోటీన్లు, ప్రయోజనకరమైన కొవ్వులతో కూడిన రమారమి 151 కాలరీల శక్తి ఉంటుంది. ఇంకా వీటిలో శరీరానికి ఎంతో అవరమైన పీచు పదార్ధం, ఫాస్ఫరస్,మాంగనీస్, ఇనుము, రాగి వంటివి కూడా ఎక్కువ. మనకు గాయాలు అయినప్పుడు రక్తస్రావం ఆగటానికి, గాయం త్వరగా మాని, చర్మం మూసుకొనేందుకు ఉపయోగపడే విటమిన్ – కె కూడా ఈ విత్తనాలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ – ఇ కూడా ఎక్కువే. శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్, రైబోఫ్లేవిన్ ( vitamin B2) వంటివి కూడా వీటిలో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని జీవకణాలను ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ బారినుంచి కాపాడతాయి. అందుకే గుమ్మడి గింజలకు మన ఆరోగ్య రక్షణలో అంత ప్రాముఖ్యం ఏర్పడింది. గుమ్మడి గింజలు క్రమం తప్పకుండా తింటూ ఉంటే రొమ్ము కాన్సర్, ఊపిరి తిత్తుల కాన్సర్, ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ వంటివి మనజోలికి రావు. ముట్లుడిగిన స్త్రీలకు సహజంగా వచ్చే రొమ్ము కాన్సర్ గుమ్మడి గింజలు రోజూ తింటుంటే రాదు. ప్రోస్టేట్ గ్రంథి వాచి మూత్ర విసర్జన కష్టమైన వారు కూడా రోజూ గుమ్మడి గింజలు తింటూ ఉంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గుతుంది. మెగ్నీషియం అత్యధికంగా లభించే సహజసిద్ధమైన పదార్థాలలోకెల్లా గుమ్మడి విత్తులే ప్రముఖమైనవి. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంచి, గుండె జబ్బులను నిరోధించే మెగ్నీషియం మన శరీరానికి ఎంతో ఆవశ్యకం. మన శరీరంలో నిత్యమూ జరిగే 600 కు పైగా రసాయనిక చర్యలలో మెగ్నీషియం ప్రముఖ పాత్ర వహిస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్థులలో రక్తంలో చక్కెర లెవెల్స్ ని అదుపులో ఉంచడానికి రోజూ గుమ్మడి విత్తనాలు తినడం ఎంతో ప్రయోజనకరం. గర్భిణులు రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటూ ఉంటే పుట్టే పిల్లలు మంచి ఎముక పుష్టితో పుడతారు. వృద్ధులు రోజూ గుమ్మడి విత్తులు తింటూవుంటే వారు ఎముకలు తేలికగా విరిగిపోయే ఆస్టియో పోరోసిస్ (Osteoporosis)బారిన పడకుండా ఉంటారు. ఎంతో ఆహార విలువ కలిగిన పీచు పదార్ధం గుమ్మడి గింజలలో ఉన్న కారణంగా అవి రోజూ తింటూ ఉంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. గుండె బలపడుతుంది. టైపు – 2 డయాబెటిస్, స్థూలకాయం ( ఒబేసిటీ) వంటివి మన దరికి రావు. గుమ్మడి విత్తనాలలో జింకు ధాతువు పుష్కలంగా ఉన్న కారణంగా అవి పురుషులలో వీర్యవృద్ధికి ఉపకరిస్తాయి. వీర్యం యొక్క క్వాలిటీ కూడా మెరుగౌతుంది. సంతానోత్పత్తికి అత్యావశ్యకమైన పురుష వీర్యంలోని కౌంట్ ( వీర్యకణాల సంఖ్య) మరియు మొటిలిటీ (చురుకుదనం) ఈ రెండూ పెరిగే కారణంగా సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి. రోజూ గుమ్మడి గింజలు తినే పురుషులలో టెస్టోస్టిరోన్ ( పురుష హార్మోన్) ఉత్పత్తి మెరుగౌతుంది. నిద్రలేమి ( ఇన్సోమ్నియా – Insomnia) తో బాధపడేవారు నిద్రకు ఉపక్రమించే ముందు కాసిని గుమ్మడి గింజలు తింటే వాటిలో ఉండే ట్రిప్టోఫాన్ (Tryptophan) అనే ఎమినో యాసిడ్ సుఖనిద్రను కలిగిస్తుంది. ఇందుకోసం రోజూ కనీసం రెండువందల గ్రాముల గుమ్మడి గింజలు తినాల్సి ఉంటుంది. కొందరి రక్తంలో చెడు కొలెస్టరాల్
( LDL – Low Density Lipoprotein) ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి రక్త నాళాలలో తక్కువ సాంద్రత కలిగిన ఆ లైపోప్రోటీన్ ఒక పొర లాగా పేరుకుని రక్త నాళాల వ్యాసం తగ్గి వాటి ద్వారా సరఫరా అయ్యే రక్తం పరిమాణం తగ్గుతుంది. ఆ కారణంగా గుండె పై భారం ఎక్కువై గుండె బలహీనపడి, వారు గుండెజబ్బులబారిన పడే అవకాశం ఉంటుంది. మన రక్తంలో ఉపయుక్తమైన కొలెస్టరాల్ ( HDL) పెరిగి, చెడు కొలెస్టరాల్ (LDL) తగ్గి మన గుండె పదికాలాలపాటు బలంగా ఉండాలంటే రోజూ మనం కాసిని గుమ్మడి గింజలు తింటే చాలు.
ఇన్నిన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్న గుమ్మడి గింజల్ని ఇకనైనా మన రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకుని వాటిలోని ఆహార, పోషక విలువలతో పాటు వాటి వైద్యపరమైన ప్రయోజనాలను కూడా పూర్తిగా పొందుదాం. మరి ఇంకెందుకు ఆలస్యం ? మిత్రులంతా వెంటనే గుమ్మడి గింజల కోసం వేట మొదలెట్టండి.
— మీ.. రవీంద్రనాథ్.
9849131029

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *