Breaking News

పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే..

Colon cancer awareness,కోలన్ క్యాన్సర్‌పై అవగాహన,పెద్దపేగు క్యాన్సర్ అవగాహన

పెద్దపేగు, మలద్వారాలకు (పురీషనాళం) వచ్చే కేన్సర్‌ను కోలోరెక్టల్, కోలన్ కేన్సర్ అని అంటారు. ఈ వ్యాధిలో పెద్దపేగు, మలద్వారం, అపెండిక్స్ భాగాల్లో కేన్సర్ కంతులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ వుంటాయి.
కేన్సర్ వ్యాధుల్లో దీనిని మూడవ అతి పెద్ద కేన్సర్‌గా చెపుతారు. కేన్సర్ వల్ల వచ్చే మరణాలకు ఇది రెండవ అతి పెద్ద కారణం. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 6,55,000 మంది కోలన్ కేన్సర్‌వల్ల మృత్యువు బారిన పడుతున్నారని ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పెద్దపేగులో పెరిగి- కేన్సర్ కాని కంతులైన అడినోమాటస్ పాలిప్స్ (బినైన్ ట్యూమర్స్) నుంచి ఈ కేన్సర్ కంతులు ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. కుక్కగొడుగులలాగా ఉండే ఈ అడినోమాటస్ పాలిప్స్.. మామూలుగా బినైన్ కంతులే అయి ఉంటాయి. కాని వాటిలోని కొన్ని మాత్రం తర్వాత కాలంలో కేన్సర్లుగా పరిణామం చెందుతాయి. పెద్దపేగులో వచ్చే కేన్సర్లను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా నిర్థారించడం జరుగుతుంది.
లక్షణాలు
కోలన్ కేన్సర్ వచ్చిన తర్వాత వ్యాధి ముదిరి తీవ్ర దశకు చేరే వరకూ ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ కారణంగానే కోలన్ కేన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకోవటానికి తరచుగా మల పరీక్ష, కొలనోస్కోపీ వంటి స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని ఎన్నో కేన్సర్ నివారణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
మామూలుగా కనిపించే లక్షణాలు ఈ క్రింది విధంగా వుంటాయి.
1.మలవిసర్జనా క్రమంలో మార్పులు వస్తాయి 2.జీర్ణకోశ వ్యాధుల్లోలాగా మలం రంగు మారి నల్లగా వెలువడుతుంది. 3.కొన్నిసార్లు మలబద్ధకం ఉంటుంది. మరికొన్నిసార్లు విరేచనాలు అవుతుంటాయి. 4.మలం మ్యూకస్‌తో (గంజిలాగా) కాని, రక్తంతో కలిసి వస్తుంటుంది. 5.మలం సన్నగా రిబ్బన్‌లాగా వస్తుంది. 6.కోలన్ కేన్సర్‌తో బాధపడేవారు రక్తహీనతకు గురవుతారు. ఆకలి ఉండదు. 7.కళ్ళు తిరిగి పడిపోతున్న భావన వుంటుంది. 8.బరువు కోల్పోతారు. 8.గుండె వేగంగా కొట్టుకుంటుంది.
పెద్దపేగులో వచ్చిన కేన్సర్ మిగతా అవయవాలకు కూడా ప్రాకే అవకాశముంది. ఇలాంటి సమయంలో కనిపించే లక్షణాలు ఇలా వుంటాయి.
ఊపిరితిత్తులకు కేన్సర్ కంతులు సోకితే శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. కాలేయానికి సోకితే ఉదర కోశంలో కుడివైపు ఛాతి క్రిందుగా నొప్పి ఉంటుంది. పైత్య రస ప్రవాహానికి అడ్డంకి ఏర్పడితే కామెర్ల వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. కాలేయ పరిమాణం పెరుగుతుంది.
ప్రమాదకర అంశాలు
కొలన్ కేన్సర్ రావడానికి కారణమయ్యే ప్రమాదకరాంశాలు ఇలా ఉంటాయి.
వయస్సు: వయస్సు పెరిగే కొద్ది కోలన్ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. చాలావరకూ 60,70 ఏళ్ళ వయస్సులో ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ. అలానే కుటుంబంలో కోలన్ కేన్సర్ ఉన్నవారు ఉంటే నడి కుటుంబంలో కూడా దాని బారిన పడటం జరుగుతుంది.
పాలిప్స్: పెద్ద పేగులో ఏర్పడే పాలిప్స్ (కంతి వంటి నిర్మాణాలు) ఈ వ్యాధిగా రూపాంతరం చెందడానికి అవకాశముంటుంది. ముఖ్యంగా అడినోమాటన్ పాలిప్స్ ప్రధానమైన ప్రమాదకర హేతువు కొలనోస్కోపితో పరీక్ష చేసేటపుడే ఈ పాలిప్స్‌ను తొలగించడంవల్ల కేన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు.
కేన్సర్ బారిన పడి ఉండటం
గతంలో ఏదోక వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయి చికిత్స తీసుకున్నవారికి భవ్యిత్తులో కోలన్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండాశయ, గర్భాశయ, రొమ్ము కాన్సర్లకు గురైన మహిళలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా వరకూ ఎక్కువగా ఉంటాయి.
వంశపారంపర్యత: కుటుంబంలో పెద్దలు ఈ వ్యాధితో బాధపడితే వారి సంతానానికి 50 ఏళ్ళ వయసులోనే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అడినోమాటస్ పాలిపోసిస్ సమస్య ఉండి సరైన చికిత్స చేయించుకోకపోతే 40 ఏళ్ళ వయసులోనే వారికి కోలోరెక్టల్ కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఎంతోకాలంగా అల్సరేటిస్ కోలైటిస్ సమస్యతో బాధపడుతున్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి.
పొగ తాగే అలవాటున్న వాళ్ళలో కూడా కోలాన్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆహారంలో తాజా కూరలు, పండ్లు, పీచు పదార్థాలు తక్కువగానూ, మాంసాహారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటంవల్లా పెద్ద పేగు కాన్సరు రావచ్చు. పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే వాళ్ళలోనూ ఈ ఇబ్బంది కలగవచ్చు.
శారీరక శ్రమ లేకపోవడం, హ్యూమన్ పాపిల్లోమా లాంటి వైరస్‌లవల్లా, మద్యం ఎక్కువగా సేవించడంవల్లా పేగు కాన్సర్‌లు వచ్చే అవకాశాలున్నాయి. క్రోన్స్ వ్యాధితో బాధపడుతున్నవాళ్ళలో కూడా కొలాన్ కేన్సర్ రావచ్చు.
డిజిటల్ రెక్టల్ పరీక్ష, ఫీకల్ అకల్ట్ బ్లడ్ పరీక్ష, ఎండోస్కోపి, సిగ్మాయిడోస్కోప్, కొలనోస్కోపి, బేరియమ్ ఎనీమా, కాన్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ లాంటి రక్త పరీక్షలు, సిటి, అల్ట్రా సౌండ్ లాంటి పరీక్షలతో రోగ నిర్థారణ చేస్తారు.
కొలనో కేన్సర్ దశని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించడం సాధ్యమవుతుంది.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *