Breaking News

రామాఫలం కథా .. కమామిషూ ..

రామాఫలం
ramaphalam 01
మిత్రులందరికీ శుభోదయం. నిన్న మా పొరుగింటివారైన శ్రీమతి దావులూరి సుమతి, మాధవరావు దంపతులు వాళ్ళ మేనల్లుడు శ్రీ ఆలూరి సురేష్ పెదరావూరు నుంచి తెచ్చిన రామాఫలం ఒకటి మాకు పంపారు. అది బాగా పండిన పండు. చూడటానికి ఆకర్షణగానూ ఉంది. మా ప్రాంతంలో రామాఫలం అరుదైనదేమీ కాదు. నేను గతంలో చాలాసార్లు తిన్నాను కూడా . అయినా తిని చాలాకాలం అయినందున వెంటనే ఆబగా లాగించేశాను.
రామాఫలాలు సీతాఫలాల కంటే పెద్దవిగా ఉంటాయి. పసుపువన్నె, ఎరుపు కలగలసిన రంగులోనూ, గోధుమ వన్నెలోనూ ఈ పళ్ళు ఉంటాయి. చూసేందుకు ఎద్దు గుండెకాయ లాగా ఉండే కారణంగా రామాఫలాన్ని ఆంగ్లంలో Bullock’s Heart అంటారు. సంస్కృతంలో రామాఫలాన్ని కృష్ణబీజ ( నల్లని గింజలు కలది) అనీ, లవలీ అనీ అంటారు. మృదువుగా ఉండే ఈ పళ్లనుబట్టి రామాఫలాన్ని సంస్కృతంలో ‘మృదుఫలమ్’ అనీ అంటారు.
అనోనేసీ ( Annonaceae) కుటుంబానికి చెందిన రామాఫలం చెట్టు శాస్త్రీయ నామం అనోనా రెటిక్యులేటా ( Annona reticulata). పది మీటర్ల ఎత్తువరకూ పెరిగే, ఆకురాల్చే రామాఫలం వృక్షం తొట్టతొలి జన్మస్థలం వెస్ట్ ఇండీస్ దీవులు. అయితే మన దేశంలోకి తేబడ్డతరువాత మనం ఈ వృక్షానికి రామాఫలం అని పేరుపెట్టుకున్నాం. సీతాఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం మొదలైనవన్నీ కూడా రామాఫలం లాగే అనోనేసీ కుటుంబానికి చెందిన వృక్షాలే.
రామాఫలం పై భాగంలో సీతాఫలానికున్నట్లు గొగ్గులు ఉండవు. అయితే గరుకుగా ఉంటుంది. బాగా పండితే నున్నగా అవుతుంది. పళ్ళ గుజ్జు బూజర బూజరగా, తియ్యగా ఉంటుంది. అయితే ఈ గుజ్జు రవ్వ పులుపు (కొద్దిగా పులుపు) కూడా కలిసిన రుచి కలిగిఉంటుంది. గుజ్జులో రవ్వ పలుకులు (granules) తగులుతూ ఉంటాయి. గుజ్జు జిగురుగా ఉంటుంది. ఏమైనా రుచికి రామాఫలాలు సీతాఫలాలంత తియ్యగా మాత్రం ఉండవు. రామాఫలం గింజలు సీతాఫలం గింజలకంటే చిన్నవిగా, మరింత నల్లగా మెరుస్తూ ఉంటాయి. ప్రతి పండులో 50 నుంచి 100 వరకు గింజలుంటాయి. ఈ వృక్షాలు ఆగస్టు – డిసెంబర్ నెలల మధ్యకాలంలో పుష్పిస్తాయి. ఫిబ్రవరి – ఏప్రిల్ నెలల మధ్యలో పళ్ళు లభిస్తాయి. ఈ చెట్లు మొదట్లో పది పదిహేను కాయలకు మించి కాయవు. అయితే బాగా ఎదిగిన చెట్లు 70 కాయలదాకా కూడా కాస్తాయి. మొక్కలు నాటిన నాలుగైదేళ్లకు కాపుకొస్తాయి. ఈ పళ్లకు ఉడతలు, పక్షులు, గబ్బిలాల (Fruit Bats) బెడద ఎక్కువ. ఈ పళ్లలో అయోడిన్, ఫ్లోరిన్, యాస్కార్భిక్ యాసిడ్ ఉంటాయి. పచ్చి కాయలు స్రావాలను అరికడతాయి. కడుపులోని క్రిములను నశింపజేస్తాయి. నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలను తగ్గిస్తాయి. జ్వరాలను హరిస్తాయి. క్లోమ గ్రంథి వాపును పోగొడతాయి. రక్తం తక్కువగా ఉన్నవారు రామాఫలం తింటే రక్తహీనత నయమౌతుంది. అజీర్తి, విదాహం, వాంతులు, కళ్ళు తిరగటం వంటి వాటిని రామాఫలాలు పోగొడతాయి. రామాఫలం గుజ్జును స్నానానికి ముందు తలకు రాసుకుని, కాసేపు ఆగి స్నానం చేస్తే తలలోని పేలు నశిస్తాయి. వీటి గింజలలోని పప్పు, ఆకుల రసం, బెరడు, వేళ్ళ రసం మొక్కలకు పట్టే చీడపీడలను నశింపజేసే సేంద్రియ కీటకనాశిని (Organic Insecticide) గా పనిచేస్తాయి. రామాఫలం గింజల నుంచి తీసే నూనె కూడా చీడ పీడలను పోగొట్టేందుకు మొక్కలపైన స్ప్రే చేస్తారు. నూనె తీసిన చెక్క (Oil Cake) లో నత్రజని చాలా ఎక్కువగా ఉండే కారణంగా అది ఎరువుగా మొక్కలకు వేస్తారు. రామాఫలం గుజ్జులోనూ, గింజలలోని పప్పులోనూ, కాండం బెరడులోనూ, వేళ్లలోనూ కాన్సర్ ను నివారించే గుణముందని ఇటీవల పరిశోధనలలో తేలిందట. భవిష్యత్ పరిశోధనలు ఈ విషయాన్ని మరింతగా నిగ్గుతేలుస్తాయేమో చూడాలి…
 
ఇదండీ రామాఫలం కథా .. కమామిషూ ..
— మీ.. రవీంద్రనాథ్.
9849131029
 
 
 
 
 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *