Breaking News

సీమ తుమ్మ కాయలు లేక సీమ చింత కాయలు

chimachinta kayalu (2) chimachinta kayalu (3)

మనందరం బాల్యంలో తిన్నవే ఈ సీమ తుమ్మ కాయలు లేక సీమ చింత కాయలు. కొందరు గ్రామీణులు వీటిని కోసితెచ్చి స్కూల్స్ ముందు గుట్టలుగా
పోసి అమ్మేవారు. నల్లని వీటి గింజల చుట్టూ ఉండే తెల్లని తియ్యటి పప్పు ( Sweet Aril) ను అందరూ ఇష్టంగా తింటారు. హిందీలో కూడా సీమ చింతను విలాయతీ ఇమ్లీ ( విదేశీ చింత) అనీ, విలాయతీ బబూల్ ( విదేశీ తుమ్మ) అనే పిలవడం విశేషం. సీమ, విలాయతీ శబ్దాలు ఈ చెట్లు మన దేశానికి వెలుపలి నుంచి వచ్చినవేనని తెలుపుతున్నాయి. మరాఠీ భాషలోనూ ఈ చెట్టును విలాయతీ చించ్ (విదేశీ చింత) అనటం కూడా గమనార్హం. జిలేబీ చుట్టలలాగా ఉండే సీమ తుమ్మ కాయల్నిబట్టి దీనిని హిందీలో జంగ్లీ జలేబీ ( Janglee Jalebi) అంటారు. మన గ్రామీణులు కొందరు ఈ సీమతుమ్మ కాయల్ని సీతమ్మ కాయలు అంటున్నారు.
ఆంగ్లంలో ఈ ముళ్ళ చెట్టును Madras Thorn అంటారు. దీనిని మనిలా టామరిండ్ ( మనిలా చింత – Manila Tamarind) అనటాన్ని బట్టి ఈ చెట్టు మనదేశానికి మొదటిగా ఫిలిప్పీన్స్ దీవుల నుంచి వచ్చి ఉంటుందని గ్రహించగలం. ( మనిలా ఫిలిప్పీన్స్ దేశ రాజధాని). దీనిని క్వామాచిల్ ( Quamachil) అని కూడా అంటారు. గ్రీకు భాషలో క్వామోస్ ( Kuamos) అంటే చిక్కుడు అని అర్థం. చిక్కుడు వంటి కాయల కారణంగా దీనిని క్వామాచిల్ అని ఉంటారు.ఈ చెట్లు కూడా ఇంగ్లిష్ ( సర్కారీ) తుమ్మ చెట్ల లాగే అతి వేగంగా పెరుగుతాయి. ముళ్ళ మొక్క అయినందున దీనిని కంచె మొక్కగా పెంచుతారు. పశువులు ఈ చెట్ల లేత కొమ్మల్ని ఇష్టంగా తింటాయి. నరికివేసే కొద్దీ ఈ చెట్లు ఏపుగా, గుబురుగా పెరుగుతాయి. గింజలు విత్తినా మొలుస్తాయి. కొమ్మలు పాతినా బతుకుతాయి. కొందరు ఈ కాయలను, వాటిలోని తెల్లని పప్పును కూర వండుకుంటారు. ఈ కాయలను పశువుల మేతగానూ వినియోగిస్తారు. చిన్నప్పటి నుంచీ ఈ కాయలలోని తెల్లని పప్పును తినటమే తప్ప వీటి నల్లని గింజలను నేను ఎప్పుడూ తినలేదు. వీటి గింజలను కూడా కొందరు పచ్చివిగానే లేక కూరగా వండుకుని తింటారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ గింజల నుంచి తీసే నూనె వంటనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ నూనెను సబ్బుల తయారీలో కూడా వినియోగిస్తారు. ఈ సీమ చింత గింజలు గానుగ ఆడిస్తే లభించే చెక్క ( Oil Cake) లో 29.7 శాతం మాంసకృత్తులు ఉన్న కారణంగా ఈ చెక్క పశువుల దాణాగా శ్రేష్ఠం. ఈ చెట్టు కాండంపై ఉండే బెరడులో టానిన్లు అధికంగా ఉండే కారణంగా తోళ్ళు ఊనడం ( Tanning) లో ఈ బెరడును వినియోగిస్తారు. ఈ చెట్ల
ఆకులు పశువులకు పచ్చి మేతగానూ, ఎరుపు – గోధుమవర్ణాల మిశ్రమ వర్ణంలో ఉండే ఈ చెట్ల కలపను
నిర్మాణరంగంలోనూ వాడతారు. కంచెలకు వినియోగించే బాదులుగా, ప్యాకింగ్ పెట్టెల తయారీలో, ఎడ్ల ఞబళ్లు, వ్యవసాయ పనిముట్ల తయారీలోనూ ఈ కలపను ఉపయోగిస్తారు. నిలిచి మండే ఈ కలప వంటచెరుకుగా
వాడితే మంచి సెగనిస్తుంది.
మనదేశానికి ఈ సీమచింత చెట్లు ఫిలిప్పీన్స్ దీవులనుంచి వచ్చినప్పటికీ ఈ మొక్క తొట్టతొలి జన్మస్థలం అమెరికా. ఇది అనుకూల పరిస్థితులలో 60 అడుగుల ఎత్తు వరకూ పెరిగే మధ్య తరహా ముళ్ళ వృక్షం. దీని ఆకులు చింత ఆకులలాగే చీలి(Bipinnate)
ఉంటాయి. తుమ్మ పూలలాగే గుండ్రని శీర్షాలలా ఉండే
ఈ వృక్షాల పూలు తెల్లగా ఉంటాయి. పది నుంచి పదిహేను సెంటీమీటర్ల పొడవుండే సీమతుమ్మ కాయలు
( Pods) జిలేబీ చుట్టలలాగా ఉంటాయి. నల్లని మెరిసే గింజలపైన ఉండే తెల్లని తియ్యటి పప్పు ( Sweet Aril)
ఒకోసారి పండి ఎర్రగా కూడా అవుతుంది. ఈ పప్పు తో మెక్సికో లో లెమొనేడ్ ( Lemonade) వంటి షర్బత్ తయారు చేస్తారు.

మైమోజేసీ ( Mimosaceae) కుటుంబానికి
చెందిన ఈ సీమచింత వృక్షం శాస్త్రీయ నామం పిథీసెల్లోబియం డల్సీ ( Pithecellobium dulce). దీనినే పిథీకొలోబియం డల్సీ ( Pithecolobium dulce)
అని కూడా అంటారు. పిథీకోస్ ( Pithekos) అనే గ్రీకు భాషా శబ్దానికి కోతి అని అర్థం. లోబోస్ ( Lobos) అంటే
చెవి అని అర్థం. కోతి చెవి ఆకారంలో ఉండే దీని కాయలోని పప్పును బట్టి ఈ వృక్షానికి పిథీసెల్లోబియం అనే పేరు ఏర్పడింది. లాటిన్ భాషలో డల్సిస్ ( dulcis) అంటే తియ్యని అని అర్థం. ఈ కాయల గింజలపైన ఉండే తియ్యటి పప్పు ( Sweet Aril) ను బట్టి దీనికి
dulce అనే పేరు వచ్చింది. నిన్న కృష్ణా జిల్లా పామర్రు వాస్తవ్యురాలు, ముఖపుస్తక నేస్తం డా. రొంపిచెర్ల భార్గవి
Rompicharla Bhargavi ) పెట్టిన టపాలోని ఫోటోలివి. ఆమె పెట్టిన టపా చూడగానే మన గ్రామసీమలలో ఇటీవల క్రమంగా కనుమరుగైపోతున్న ఈ
సీమచింత చెట్లను గురించి అందరూ తెలుసుకోవలసిన కొన్ని విషయాలు చెప్పాలనిపించి ఈ టపా పెట్టాను. గ్రామాలలోనూ ఈ చెట్లు పెరిగేందుకు అవసరమైన ఖాళీ స్థలాలు క్రమంగా అదృశ్యం కావటం,
వేగంగా పెరిగే ముళ్ళ చెట్లు కావటంవల్ల ప్రజలు బెడద వృక్షాలు( Invasive Trees) గా భావించి వీటిని నిర్మూలిస్తున్న కారణంగా కూడా ఈ చెట్లు క్రమంగా అంతరించిపోతున్నాయి.

— మీ.. రవీంద్రనాథ్.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *