Breaking News

హెర్బల్‌ టూత్‌పిక్స్‌.బీరపీచు స్క్రబ్‌

మన రోజువారీ వినియోగంలో పాస్టిక్‌ లేని సందర్భం ఉండడం లేదు. పళ్లు తోముకునే బ్రష్‌ నుంచి పడుకునే దిండు వరకు ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తూనే ఉంటాం. ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ తన పరిశోధనలో ప్రతిరోజు మనిషి గ్రాముల్లో ప్లాస్టిక్‌ను శరీరంలోకి పంపుతున్నాడని వెలుగులోకి తీసుకొచ్చింది. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వెల్లడించింది.

జీవులకు హాని చేస్తున్న ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పాపయ్యరాజుపాలెం ఎన్‌ఏడీ లేఅవుట్కు చెందిన సీనియర్‌ సిటిజన్‌ ఎస్‌వీఆర్‌ మూర్తి ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన వస్తువులను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చని వివరిస్తున్నారు. వేప, కరివేపాకు ఆకుల ఈనెలతో టూత్‌ పిక్స్, బీరపీచుతో స్క్రబ్‌ తయారు చేసి..వాటి ఉపయోగాలను స్థానికులకు వివరిస్తున్నారు.

ఎస్‌వీఆర్‌.మూర్తి ఎన్‌ఎస్‌టీల్‌ సంస్థలో టెక్నికల్‌ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధిగా ఆయా కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటారు. ఓ సారి సంఘం వనభోజనాల కార్యక్రమంలో ఓ ఆయుర్వేద వైద్యుడు ప్రకృతిలో దొరికే వస్తువులతో నిత్య అవసరాలను తీర్చుకోవడం ఎలా అనే విషయంపై సభ్యులకు సూచనలు చేశారు. ఆయన మాటలతో మూర్తి స్ఫూర్తి పొందారు.

బీరపీచుతో స్క్రబ్‌ తయారీ ఇలా…

బాగా ముదిరిపోయిన బీరకాయను ఎండలో ఎండిబెట్టి పైన తొక్కను తీసివేయాలి. రాత్రంతా ఆ పీచును నానబెట్టాలి. కాస్త సున్నితంగా అయిన తర్వాత దాన్ని స్క్రబ్‌గా వినియోగించుకోవచ్చు. ఇది ఉంటే వళ్లు తోముకునేందుకు ప్లాస్టిక్‌ స్క్రబ్‌ అవసరం లేదని మూర్తి పేర్కొన్నారు. సహజ సిద్ధమైన ఈ పీచు చర్మంపై మలినాలను సులభంగా తొలగిస్తుందని చెబుతున్నారు. దీన్ని గిన్నెలు తోముకునేందుకు కూడా వాడుకోవచ్చని చెప్పారు.

హెర్బల్‌ టూత్‌ పిక్స్‌…

ప్రతిరోజు ఇంట్లో వాడి పడేసే కరివేపాకు, వేప ఆకుల ఈనెలతో హెర్బల్‌ టూత్‌పిక్‌లను మూర్తి తయారు చేశారు. కరివేపాకు, వేప ఆకులను తొలగించి వాటి ఈనెలను నీడలో ఆరబెడుతున్నారు. వాటిని అవసరమైన పరిమాణంలో కత్తిరించి నిల్వ చేస్తున్నారు. ఆరిన తర్వాత ఈనెలు గట్టిపడి వినియోగానికి అనువుగా మారుతున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల సువాసన రావడంతో పాటు వాటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మూర్తి చెబుతున్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం వల్ల పర్యావరణం, మూగ జీవులకు ఎంతో మేలు జరుగుతందని వివరిస్తున్నారు.

హెర్బల్‌ ప్రాచుర్యానికి కృషి

మరికొన్ని రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వస్తువులను హెర్బల్‌తో తయారు చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. సంఘం సమావేశాలు, శుభకార్యాలు, ఇతర సామూహిక కార్యక్రమాల్లో అందరికీ వీటిపై అవగాహన కల్పిస్తున్నా. ఇటీవల మా బంధువుల పెళ్లిలో హెర్బల్‌ టూత్‌పిక్‌లను ఉపయోగించారు. ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేస్తే ప్లాస్టిక్‌ వినియోగాన్ని కొంతైనా తగ్గించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *