Breaking News

ఉసిరి పండు- చ్యవన్ ప్రాశ్

ఉసిరి పండు- చ్యవన్ ప్రాశ్
మిత్రులందరికీ శుభోదయం. ‘ వయస్స్థాపకానాం ఆమలకం శ్రేష్ఠమ్ ‘ అని ఆర్యోక్తి. మనకు ముదిమి ( వృద్ధాప్యం) రాకుండా వయస్సును నిలువరించేవాటిలో
ఆమలకం అంటే ఉసిరిపండు శ్రేష్ఠమైనదని అర్థం. ఒకప్పుడు భృగు మహర్షి కుమారుడు, వృద్ధుడైనట్టి చ్యవనుడి చేత దేవవైద్యులైన అశ్వనీ దేవతలు ఉసిరి పండ్లతో తయారైన ఒక లేహ్యాన్ని తినిపించి, అతడిని తిరిగి యౌవనవంతుడిని చేయగా చ్యవనుడు సుకన్య అనే యౌవనవతిని పెండ్లాడి సుఖంగా జీవించాడని ఐతిహ్యం. ఉసిరి త్రిఫలాలలో ఒకటి. ఔషధ గుణాలు కలిగిన మూడు ప్రసిద్ధ ఫలాలలో ఉసిరిపండు ఒకటి. మిగిలిన రెండూ తాని ( తాండ్ర) కాయ, కరక్కాయ. ఉసిరి త్రిదోషాలనూ హరిస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను త్రిదోషాలు అంటారు. ఉసిరి శరీరానికి శక్తినిస్తుంది. ఉసిరిలో నారింజపండుతో పోలిస్తే సి- విటమిన్ ఇరవై రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే శరీరానికి రోగనిరోధక శక్తిని కలిగించేవాటిలో ఉసిరిదే అగ్రస్థానం. ఉసిరి కాలేయం (లివర్) పనితీరును మెరుగుపరిచే కారణంగా రోజూ ఏదో ఒక రూపంలో ఉసిరిపండును తింటే మనం సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తాం. కొందరూ రోజూ పెరుగన్నంలో ఉసిరి ఊరగాయ నంజుకు తింటారు. కొందరు ఉసిరి పండ్లను తేనె, పంచదార పాకంలో నానబెట్టి తయారుచేసే ఉసిరి మురబ్బా తింటారు. మరికొందరు ఉసిరి పండ్లతో తయారైన చ్యవన్ ప్రాశ్ అనే లేహ్యాన్ని ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తింటారు. ‘అభుక్త్వామలకం పథ్యమ్’ అన్న ఆర్యోక్తిని అనుసరించి ఉసిరి పరగడుపునే తినదగింది. ఉసిరిపండు రసం రాసుకుంటే తల వెంట్రుకలు నెరవకుండా నిగనిగలాడతాయి. ఉసిరిపండు రసాన్ని, భృంగం ( గుంటకలగర) రసంతో కలిపి నువ్వులనూనెతో కాచి తయారుచేసే భృంగామలకతైలం శిరోజాలకు మంచిది. మెదడుకు చలువ చేస్తుంది. ఉసిరి మూత్రకారి. విరేచనకారి. పైత్యాన్ని పోగొడుతుంది. నోటి అరుచి, తలతిప్పట, ఆకలిలేమి వంటి దోషాలకు ఉసిరి దివ్యౌషధం.కామెర్లు ( జాండిస్), దగ్గు, అగ్ని మాంద్యం మొదలైనవి పోగొడుతుంది.
యూఫోర్బియేసీ ( Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఉసిరి చెట్టు శాస్త్రీయ నామం ఫిల్లాంథస్ ఎంబ్లికా ( Phyllanthus emblica). దీనికి ఎంబ్లికా అఫిసినేలిస్ ( Emblica officinalis) అనే మరో శాస్త్రీయ నామం కూడా ఉంది. ఆంగ్లంలో ఉసిరిని ఇండియన్ గూస్ బెర్రీ ( Indian Gooseberry) అనీ ఎంబ్లిక్ మైరోబలాన్ ( Emblic Myrobalan) అనీ పిలుస్తారు. దక్షిణ భారతీయ భాషలన్నిటిలో ఉసిరికి నెల్లి అనే మరో పేరు కూడా ఉంది. నెల్లి మర్ల, నెల్లి కుదురు, నెల్లి వలస వంటి గ్రామనామాలు ఉసిరి చెట్టు మీదుగా ఏర్పడ్డవే.
ఫోటో లోని చ్యవన్ ప్రాశ్ అనే లేహ్యం పూటకి ఒక స్పూన్ చొప్పున రోజూ మూడుపూటలూ భోజనానికి పావుగంట ముందు తింటే ఆరోగ్యపరంగా మనకి ఎంతో మేలు చేస్తుంది. ఝండు, డాబర్, ఇంప్ కాప్స్ ( IMPCOPS, Adayar) ఆయుర్వేద కంపెనీల చ్యవన్ ప్రాశ్ లేహ్యాలు శ్రేష్ఠం. లేహ్యము అంటే నాకుతూ తినేది అని అర్థం.
 
ఇదండీ ఉసిరి పండు గురించి, చ్యవన్ ప్రాశ్ లేహ్యాన్ని గురించిన ముచ్చట్లు.
— మీ..రవీంద్రనాథ్.
9849131029
 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *