Breaking News

అరుణ్ సాగర్ ! ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్బుత జ్ఞాపకం

49205151_2021097497977146_3341294186157572096_n 49701125_2021091031311126_8572443835903246336_n

అరుణ్ సాగర్ ! ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్బుత జ్ఞాపకం.తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో , తెలంగాణా వాదులు ఆంద్రప్రజలను తిడుతున్న సమయంలో .. తెలంగాణా వాదానికి తన మద్దతు ప్రకటించాడు తప్ప, ఏ నాడు ఆంధ్రప్రజలను అవమానించలేదు, పైగా ఆ ఉద్యమ సమయంలో ఒంగోలు పొగాకు రైతుల సమస్య గురించి లేవనెత్తితే, ఖమ్మం జిల్లా పొగాకు రైతల వెతల తో సారూప్యం వెతికిన మానవతా వాది. అయన మరణించిన రోజు గుండె తడవని సాహితీవేత్త లేడు, సాహితీఅభిమాని లేడు. అయన భౌతిక కాయం వెంట ఆంద్రా, తెలంగాణా బేధం లేకుండా అందరూ ఖేదపడుతూ నడిచారు. ఫిల్మ్ నగర్ వీదివెంట అయన అంతిమయాత్ర సాగుతుంటే సినిమా సైతం ఒక్క క్షణం ఆగి తనను తాను ఓదార్చుకుంది. నేను అత్యంత అభిమానించే కవి, అరుణ్ సాగర్ మరణించినప్పుడు ఆయనకు నివాళిగా రాసుకున్న కవిత. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయనకు నా అశృనివాళి

దోడ తిత్తివా
===========

అతనో ప్రవాహం
సుజల జ్వలిత గోదావరి తట
జీవిత , తాడిత , పీడిత, కోయ, సవర
గదబ, చెంచుల రణన్నినాదం
అనగనగా ఒక అరుణ్ , అనగా ఒక కవి
ఇంకా విపులంగా చెప్పవలెనన్న ఒక విలేఖరి
మరింత విపులీకరించి, వివరించవలెనన్న
ఒక మేల్ కొలుపు గీతా సాగరుడు.
వెరిసి అతనొక “షాన్ ”

* * * * * *

ఎక్కడో వినిపించీ వినపించని కొమ్ముబూర శబ్దం
బహుశా బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ఒక ఇంటలెక్చువల్ విన్నపం అనుసరించి
ఇప్పుడొక ప్రాయోజిత కార్యక్రమం
సీదర సెంద్రయ్య రేల పాట
“రేలరేలరేల రేరేలా రేల రేలా రేరేలా ”
రిధమిక్ గా సాగిపోతున్న పాట
“యు నో ! ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్
ఈ సాంగ్ పాడే ట్రైబ్స్ ఆర్ గోయింగ్ టూ వానిష్”
విషాదంగా గొంతులోకి దిగుతున్న షాంపేన్.
మెట్రో సిటీ లోని కాస్మోపాలిటన్ క్లబ్బుల నిండా
నిషా నింపుకున్న కళ్ళకు కూడా ఫ్రేం అంతా
బ్లర్డ్ విజన్ లో మాయమవుతున్న రావిచెట్టును
పిట్టను పరిచయం చేసిన రిలాక్స్ ఎరుగని హెర్క్యులెస్

* * * * *

పాపి కొండల నడుమ వంపు తిరిగిన
ఆ నదిని గాడాలింగనమున చుంబించి
తొలిప్రేమల రహస్యాలను దమ్మక్క చెవిలో చెప్పి
రాముడితో గోదారికి రాయబారమంపిన ధీశాలి
*పీకే కి తునికాకు పళ్ళిచ్చి , వనం కోసం ఎడారిలో
అంజనం వేసి అచ్చు అమ్మ గొంతుతో *దోడ తిత్తివా
అని ప్రేమతీరా అడిగిన కరుణ సాగరుడు .

* * * * * *
అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్
ఒక్కటే ప్రశ్న బ్రో !!
ఓ అరుణ సాగరుడా
నీ కవిత్వాన్ని
జర్నలిజాన్ని , అడవిబిడ్డల్ని
వదిలి ఎందుకు వెళ్ళావు ??
ఐ నో యూ విల్ బీ దేర్ ఎట్
ద మీటింగ్ పాయింట్ ఆఫ్ స్కై అండ్ ఎర్త్
సుదూర తీరం నిండా నువ్వే గోదారంతై పరుచుకున్నావు
అగైన్ ఆవేర్ ఆఫ్ దీజ్ థింగ్స్
కొన్ని ప్రశ్నలు
దిగులు దీపపు స్తంభపు నుండి రాలుతున్న కాటుక చీకటి
నయనాల నిండా నిండిపోయి పొర్లుతున్న
దు:ఖాశ్రువుల ను ఏ లేపనాలు
పూసి తగ్గించాలి ??
చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురవుతున్న
నిర్వాసితుల నివేదనా గాధలు ఎవరు వినాలి ?
ఇప్పుడు కురసం ముత్తమ్మ
వనమంతా తిరిగి తిరిగి ఏరుకొచ్చిన
తట్టలోని రేగిపళ్ళు ఎవరు తినాలి ?
సీతాకోకచిలుక రెక్కలంచు కోకా రవికల
నేరేడు రంగు పీకే తెచ్చిన ఇప్పసారా ఎవుడు తాగాలి ??
ఇయన్నీ పోనీ గానీ
అన్నా ! అరుణన్నా !!”దోడ తిత్తివా ” అన్నా !!

* పీకె == కోయ భాషలో పిల్ల
* దోడ తిత్తివా = కోయ భాషలో “అన్నం తిన్నవా…

…………mohan ravipati…………

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *