Breaking News

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలన్న సీఎం

 

• వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్రవ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధిద్వారా ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయాలని మార్గదర్శక ప్రణాళిక సూచించిన సీఎం
• నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని ఆరోగ్యశ్రీ కింద 150 ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు
• డిసెంబర్‌ 1నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం నెలకు రూ.5వేలు లేదా, రోజుకు రూ.225
• తీవ్రకిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10వేల వర్తింపు చేయాలని సీఎం ఆదేశం
• రూ. 5వేల కేటగిరిలో మరికొన్ని వ్యాధులు చేర్చాలని సీఎం ఆదేశం
• తీవ్ర పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికీ, రెండు కాళ్లు లేక చేతులు లేనివారు లేక పనిచేయని స్థితిలో ఉన్నవారికీ, కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్‌ వర్తింపు, జనవరి 1 నుంచి వీరికి పెన్షన్‌
• జనవరి 1 నుంచి ప.గో.లో 2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్య శ్రీ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు
• డెంగ్యూ, సీజనల్‌ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలన్న సీఎం
• గిరిజన ప్రాంతాల్లో బైకులద్వారా వైద్యసేవలను మారుమూలప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం
• ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న సీఎం
• అన్ని కమ్యూనిటీ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాలు డిసెంబర్‌ 2019 నుంచి పనులు మొదలు
• డిసెంబర్‌ 2020 నాటికి ఈ పనులు పూర్తి
• బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం*
• వైద్యవిద్య, నర్సింగ్‌ పూర్తిచేసుకున్న వారు ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయం
• ఆస్పత్రుల్లో మందులకు కొరతలేకుండా, మందులు నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
• మందులు దొరకడంలేదన్న కంప్లైంట్‌ ఎక్కడా రాకూడదన్న సీఎం*
• హెల్త్‌ సబ్‌సెంటర్లలో అభివృద్ది కార్యక్రమాలు కూడా వచ్చే మే నుంచి పనులు ప్రారంభమవ్వాలని సీఎం ఆదేశం
• ఆరోగ్యశ్రీలో డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను చేర్చాలన్న సీఎం
• డిసెంబర్‌ 21న ఆరోగ్యకార్డుల జారీ
• ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లకు రూ.రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని సీఎం ఆదేశాలు
• కంటి వెలుగు కార్యక్రమాన్ని కాలేజీల పిల్లలకూ వర్తింప చేయాలన్న సీఎం
• నెలరోజుల్లో కాలేజీ పిల్లలకూ పరీక్షలు చేయాలన్న సీఎం
• కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు
• స్కూలు పిల్లనుంచి ఈ కార్యక్రమం మొదలు
• మధుమేహం, బీసీ, సుగర్‌ లాంటి వ్యాధులను తగ్గించడానికి తగిన తరగతులు స్కూళ్లు, గ్రామాల్లోనిర్వహించాలన్న సీఎం
• అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం ఆదేశం
• మద్యం దుకాణాలకోసం గతంలో కొన్నిటిని డీ నోటిఫై చేశారని సమావేశంలో ప్రస్తావన
• వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో యాడ్‌ చేయాలన్న సీఎం
• రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు ఆస్పత్రికి వస్తే… డబ్బుకోసం వేచిచూడాల్సిన అవసరంలేదనే రీతిలో తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
• ప్రభుత్వం నుంచే కొంతమొత్తాన్ని దీనికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం, విధివిధానాలు ఖరారుచేయాలన్న సీఎం
• త్వరలోనే కార్యక్రమాన్ని ప్రకటించాలని సీఎం ఆదేశం
• వైద్య,ఆరోగ్యశాఖలో ఖాళీలభర్తీ ప్రక్రియ జనవరిలో మొదలుపెట్టాలన్న సీఎం
• అమరావతి : ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి శ్రీ వై.యస్‌. జగన్‌ మార్గదర్శక ప్రణాళిక నిర్దేశించారు. వైద్యఆరోగ్య, కుటుంబ,సంక్షేమ శాఖలు ఆరుసూత్రాలతో ముందుకు సాగాలని ఆదేశించారు.
• ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా వైద్య, ఆరోగ్యశాఖను భర్తీ చేయడం.
• రోగులకిస్తున్న మందులు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాల ప్రకారం ఉండేలా చూసుకోవడం. ఆ మందులను అందుబాటులో ఉంచడం.
• ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం అందించడం.
• తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రతీనెలా పెన్షన్‌ ఇవ్వడం.
• కొత్తగా 108,104 సహా బైక్‌ అంబులెన్స్‌లు కొనుగోలు ద్వారా రోగులకు సమర్ధవంతంగా సేవలు అందించడం.
• జాతీయ స్ధాయిలో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా ఆసుపత్రులను అభివృద్ధి పర్చడం.
• ఈ ఆరుసూత్రాల ప్రాధాన్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ ఆదేశించారు.
 జనవరిలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ

ఆసుపత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది లేకపోతే వైద్యసేవలు అందించడం కష్టమవుతుందని,ఆశించిన లక్ష్యాలు నెరవేరవని, సమీక్షలో ముఖ్యమంత్రి అన్నారు. ఖాళీలను భర్తీ చేస్తేనే ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసినట్లవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, నర్సుల పోస్టులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేయాలన్నారు. ప్రతీ జనవరిలో నియామకాల ప్రక్రియ కోసం క్యాలెండర్‌ విడుదల చేయాల్సిందిగా ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, ఆ మేరకు వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యవసరంగా భర్తీ చేయాల్సిన పోస్టులపై ఒక జాబితా తయారు చేయాలని ఆదేశించారు. కోర్సు పూర్తి చేసుకున్న ప్రతీ వైద్య విద్యార్ధి, నర్సింగ్‌ విద్యార్ధి తప్పనిసరిగా ఒక ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలంటూ సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.

 అందుబాటులో నాణ్యమైన మందులు

ప్రభుత్వాసుపత్రిలో మందులకు కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మందులకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో మందులు నాణ్యంగా లేవని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం మందులు తయారీకి ప్రయత్నాలు ప్రారంభించామని, నవంబరు 20 కల్లా కచ్చితంగా మార్పులు తీసుకొస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

 జనవరి 1 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు క్రింద ఆరోగ్యశ్రీ:

జనవరి 1 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు క్రింద ఆరోగ్యశ్రీలో మార్పులను పైలెట్‌ ప్రాజెక్టు కింద అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2వేలు, మిగిలిన జిల్లాల్లో 1200 రోగాలను ఆరోగ్యశ్రీ జాబితాలోకి తీసుకొచ్చి పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని సీఎం ఆదేశం గతంలో ఒక చెవికి మాత్రమే ఇంప్లాంట్‌ చికిత్స చేసి రెండో చెవికి వదిలేసేవారని, ఈ పరిస్ధితి ఉండరాదని సీఎం ఆదేశించారు. డెంగ్యూ సహా సీజనల్‌ వ్యాధులకు ఈ జాబితాలో చోటు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలుపెట్టామని ఫిబ్రవరి చివరి నాటికి ఈ తనిఖీలు పూర్తవుతాయని, మార్చి 1 నాటికి ఆసుపత్రుల జాబితా ఖరారవుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు.ఆరోగ్యశ్రీ క్రింద నవంబరు 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించనున్నట్టు అధికారులు సమావేశంలో వెల్లడించారు.

 డిసెంబరు 1 నుంచి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సాయం:

ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం అందించేందుకై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. అమలు చేయడానికి తగిన సన్నాహాలు చేయాలని సీఎం అన్నారు. ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీలో అందరికీ వర్తింప చేయాలా లేక కొంతమందికే పరిమితం చేయాలా? ఉద్యోగాలు చేస్తున్నవారిని మినహాయించాలా? అన్న అంశాలను అధికారులు ప్రస్తావించారు. దీనిపై జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి ఏ పథకాన్నైనా పక్షపాతం లేకుండా అమలు చేయాలని, అలా చేస్తేనే ఆ పథకం విజయవంతమవుతుందని అన్నారు. పథకాన్ని పరిమితం చేసే కొద్దీ పక్షపాతం చోటుచేసుకుంటుందని, అందుకే అందరికీ వర్తింపజేయాలని ఆదేశించారు. పక్షపాతం లేకుండా అమలు చేయడమే ప్రతీ పథకం వెనకున్న విజయ రహస్యమని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద ఆపరేషన్‌ చేయించుకునేందుకు ఒక వ్యక్తి ధరఖాస్తు చేసుకున్నప్పుడు ఆరోగ్యశ్రీ కంట్రోల్‌ రూంలో ఉన్న నిపుణులైన వైద్యుల బృందం అనుమతిస్తుందని, ఆపరేషన్‌కు ముందు, ఆపరేషన్‌ తర్వాత సంబంధిత వ్యక్తి ఫోటోను అప్‌లోడ్‌ చేస్తారు. ఏ తరహా ఆపరేషన్‌కు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో ముందే నిర్ణయిస్తున్నందున, ఈ పథకం అమలుకు పరిమితులు విధించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టంచేశారు. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు లేదా రోజుకు రూ.225 చొప్పున ఇవ్వడానికి ఇదివరకే తీసుకున్న నిర్ణయంపై తక్షణమే జీవో విడుదల కావాలన్నారు. డాక్టర్లు ఇచ్చిన సిఫారసు మేరకు ఎన్ని రోజుల విశ్రాంతి అవసరమో అన్ని రోజులు ఆ డబ్బులు అందించాలన్నారు. డిసెంబరు 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు.
 తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారికి నెలకు రూ.10 వేలు, రూ.5వేలిచ్చే పెన్షన్‌ జాబితాలో మరికొన్ని వ్యాధులు:

తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకురూ.10వేలు, రూ.5వేలు పెన్షన్‌ ఇస్తున్న ప్రభుత్వం… మరికొన్ని వ్యాధులను ఈస్కీంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకురూ.10వేలు వర్తింప జేసే జాబితాలో తలసేమియా, హిమోఫీలియా, సికిల్‌సెల్‌ఎనీమియాలతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు చొప్పున పెన్షన్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.నెలకు రూ.5వేలు పెన్షన్‌ కేటగిరీలో తీవ్ర పక్షవాతంతో వీల్‌ఛైర్‌కి పరిమితమయిన వారికీ, రెండు కాళ్లు లేదా రెండు చేతులు లేనివారికి లేదా అవి పనిచేయని స్ధితిలో ఉన్నవారికి, కండరాల క్షీణత కారణంగా అవి పనిచేయని పరిస్ధితుల్లో ఉన్నవారికి ఈ కేటగిరీ పెన్షన్‌ను వర్తింపుచేయాలని, ఈ మార్పులను జనవరి 1 నుంచి వర్తింపజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

 కంటివెలుగు తరహాలో ప్రజలందరికీ పూర్తి వైద్య పరీక్షలు:

కంటివెలుగు తరహాలోనే ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేయించాలని, సీఎం నిర్ణయించారు. దీనికోసం ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో స్కూల్‌ విద్యార్ధులు నుంచి మొదలు పెట్టి మిగతా ప్రజలకు కూడా పరీక్షలు చేయాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో భాగంగా కంటి వెలుగు పథకం పై సీఎం ఆరా తీశారు. ఇప్పటివరకు 60,669 స్కూల్‌్ికు గాను 56,982 స్కూల్స్‌ లో కంటి పరీక్షలు నిర్వహించామని, 69,33.525 మంది విద్యార్ధులకు గాను,64,08,086 మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించామని, దాదాపు 4.8లక్షల మంది పిల్లలకు కంటి సమస్యలున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. డేటా అప్‌డేట్‌ అవుతోందని, రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల విద్యార్ధులకు కూడా కంటి వెలుగు క్రింద కంటి పరీక్షలు చేయాలని సీఎం ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే స్కూల్‌ పిల్లలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పూర్తి స్ధాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, భవిష్యత్‌ తరాలు ఆరోగ్యంగా ఉండేందుకే ఈ కార్యక్రమమని సీఎం పేర్కొన్నారు. తర్వాత ప్రజలందరికీ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. మధుమేహం, బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులను తగ్గించడానికి తగిన అవగాహన, శిక్షణా కార్యక్రమాలు స్కూళ్లు, గ్రామాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు. కేన్సర్‌ కారకాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలని, గ్రామ సచివాలయాల పక్కనే వర్క్‌షాపుల్లో, ఆరోగ్యపరమైన అంశాలపై తరగతులు నిర్వహించాలన్నారు. సబ్‌ సెంటర్లలో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహించాలన్నారు.

 ఆస్పత్రుల్లో నాడు– నేడు

ప్రభుత్వాసుపత్రుల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, చేపట్టవల్సిన అభివృది ్ధకార్యక్రమాల పై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో కనీస వసతులు కల్పించాల్సిన 174 కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో జాతీయ ప్రమాణాల ప్రకారం చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామని అధికారులు సీఎంకు అధికారులు తమ ప్రణాళికను వెల్లడించారు. రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రుల్లో చేపట్టాల్సిన పనులపైనా సీఎం అధికారులతో సమీక్షించారు. 5 బోధనాసుపత్రుల్లో కొత్త భవనాలుండగా, 6 బోధానసుపత్రులు భవనాలు పాతబడ్డాయని అధికారులు సీఎంకు వివరించారు. భవనాలు నిర్మాణం సహా కనీస సదుపాయాలు సహా వసతులు ఏర్పాటుకు వచ్చే ఏడాది మే నుంచి పనులు ప్రారంభించేలా కార్యాచరణప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని సీఎం అధికారులును ఆదేశించారు. ఆరోగ్య ఉప కేంద్రాల అభివృద్ధి పనులు కూడా వచ్చే మే నుంచే ప్రారంభం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. 108,104 కొత్త వాహనాల కొనుగోలుతో పాటు బైక్‌ అంబులెన్స్‌ల సంఖ్యను కూడా పెంచాలని సీఎం ఆదేశించగా, జనవరి నాటికి కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు.
 ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులకు జీతాలు పెంపునకు సీఎం నిర్ణయం:

ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్ల జీతాలను 100శాతం పెంచాలని సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి వెంటనే జీవో జారీ చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనిని ఎవరు చేయగలరు, వారి వేతనాల విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఏలూరు పర్యటనలో శానిటేషన్‌ వర్కర్స్‌ నాతో సమస్యలు చెప్పుకున్నారని…. కత్తిరింపులు తర్వాత రూ.6500 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

 అన్ని జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం ఆదేశం:

రాష్ట్రంలో రోడ్డు ప్రమాద తీవ్రతపై సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి సత్వర వైద్యసేవల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అంబులెన్స్‌ల వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని, తగిన చికిత్స అందించేలా దాన్ని తీర్చిదిద్దాలన్నారు. మద్యం కూడా ప్రమాదాలకు కారణం అవుతోందని కొందరు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. జాతీయ రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని సీఎం అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు .మద్యం దుకాణాల కోసం గత ప్రభుత్వం కొన్ని జాతీయ రహదారులను ఢీ నోటిఫై చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినప్పుడు, వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో చేర్చాలని సీఎం స్పష్టంచేశారు. 2018లో 29,012 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 8,321 మంది మృతి చెందారని సీఎంకు అధికారులు నివేదించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారు ఆస్పత్రికి వస్తే… డబ్బుల్లేక వైద్యాన్ని నిరాకరించే పరిస్ధితి ఉండకూడదని, సీఎం స్పష్టంచేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వమే కొంత మొత్తాన్ని వైద్యం కోసం ఇచ్చేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి విధి, విధానాలు ఖరారు చేయాలన్నారు.

 మాతా శిశు సంరణక్షపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం:

మాతా, శిశు మరణాల నివారణకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. దీనికోసం తయారుచేసిన సమగ్ర ప్రణాళికను అధికారులు వివరించారు. 100 ప్రసూతి కేంద్రాలను అధికారులు ప్రతిపాదించగా, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో ప్రసూతి కేంద్రాలను అభివృద్దిచేయాలని, గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం అన్నారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లకాళీకృష్ణ శ్రీనివాస్, చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ.సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు హాజరయ్యారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *