Breaking News

ఆరోగ్య భద్రత – ప్రభుత్వం బాధ్యత: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

అమరావతి, అక్టోబర్ 18: రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో విలేఖర్లతో మాట్లాడుతూ, ప్రభుత్వం నాలుగు నెలల్లో చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. మహిళా పక్షపాతిగా పేరొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అధిగమించి రాష్ట్రంలో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారంతో పాటు ప్రాథమిక విద్యను అందించే చర్యలను పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో కోడిగుడ్ల కుంభకోణం, పౌష్ఠికాహారం పేరుతో పాడైన ఆహార పదార్థాలను అందించి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితుల నుంచి విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వృద్ధులు, మహిళలు, పిల్లలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల రక్తహీనతతో 53 శాతం మంది ప్రజలు బాధపడుతున్నట్లు నీతిఆయోగ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దాని నుంచి బయటపడేందుకు పౌష్ఠికాహారాన్ని మరింత సమర్థవంతంగా వారికి అందించి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇందుకోసం క్షుణ్ణంగా పౌష్ఠికాహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే తమకు సంబంధించిన శాఖలపై రెండు సార్లు సమీక్ష జరిపారని, వచ్చే వారంలో మరోసారి గర్భవతులు, బాలింతలు, అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణపై తుది సమీక్ష జరపనున్నట్లు మంత్రి వెల్లడించారు. రక్తహీనత నుండి మహిళలను, చిన్నారులను కాపాడేందుకు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో భవిష్యత్ లో మరిన్ని రకాల పౌష్ఠికాహార పదార్థాలు అందించే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో మౌలికవసతులు సరిగా లేవని తక్షణమే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి సంకల్పించారని మంత్రి అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చిన్నతనం నుండే అలవడేలా అంగన్ వాడీ కేంద్రాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో గత ప్రభుత్వ పథకాలను నిలుపుదల చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, అది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా మెరుగైన విధానాలతో పాటు సమర్థవంతమైన పౌష్ఠికాహారం అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పథకాల రూపకల్పనలో ప్రజా ప్రతినిధులు బాధ్యత, సూచనలను గౌరవిస్తూ రాష్ట్రస్థాయి అధికారులు వీటిని సమర్థవంతంగా అమలు చేస్తారని పేర్కొన్నారు.

మద్యం ధరలు పెంచడం ద్వారా సంబంధిత బీర్ల ఫ్యాక్టరీలకు లబ్ధి చేకూరుతుందని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు సరికావని మంత్రి హితువు పలికారు. తద్వారా వస్తున్న ఆదాయం ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేశారు. మద్యపాన నిషేదంపై యావత్ మహిళా లోకం సంతోషంగా ఉందని తమ విచారణలో వెల్లడైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతించాల్సింది పోయి అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన, శ్రామిక, రైతు పార్టీ అని ఆ పేరును సార్థకం చేసుకుంటూ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు, శ్రామికులైన ఆటో డ్రైవర్లకు 10వేల ఆర్థిక సాయం, రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడిసాయం వంటి పథకాలను ఇప్పటికే అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులతో పాటు రక్తహీనత కలిగిన వారి బరువులు చూసి పౌష్టికాహారం అందించడంతో పాటు బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించడం సక్రమంగా నిధులు ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్న మంత్రి ఇక నుంచి అన్ని అంగన్ వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని ఆదేశాలిచ్చామన్నారు. దీంతోపాటు అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ ప్రాంతాల్లోనే మండల స్థాయి అధికారుల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు రాత్రి బస చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా స్థానికులకు తమ ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, సమస్యలను తెలుసుకొని స్పందించడానికి వీలుకలుగుతుందన్నారు. గతంలో రికార్డుల మార్పులు చేసి అనేక తప్పులు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అధికారులు ఆ తరహా తప్పులు చేయకుండా అభివృద్ధి వైపు అడుగులు వేసే విధంగా ఆదేశించామని పేర్కొన్నారు. ఉద్యోగాన్ని బరువులా కాకుండా బాధ్యతగా చూడాలని మంత్రి కోరారు. నెలరోజుల్లో అంగన్ వాడీ సెంటర్ లలో మార్పులు ప్రజలు గమనించాలని అందుకోసం అందరం కలిసి పని చేద్దామన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రతినెలా 25వ తేదీనాటికి అందాల్సిన పౌష్ఠికాహారం, బాలసంజీవని, బాలామృతం, పాలు,గుడ్లు వంటివి సక్రమంగా అందడం లేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. వాటిపై పరిశీలన చేసి సక్రమంగా అందేలా చూస్తామన్నారు.

 

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *