ఉమ్మి టపాకాయల మొక్క
ఇటీవల విశాఖ నుంచి వచ్చిన ముఖపుస్తక నేస్తం శ్రీమతి తాళ్లూరి సుగుణ, రాజ్యలక్ష్మి, నేను కలిసి గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పలు చూడదగిన ప్రదేశాలలో పర్యటించాం. దానిలో భాగంగా మేము
బట్టిప్రోలులోని అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపాన్ని సందర్శించాము. ( అందరూ ప్రస్తుతం పలుకుతున్నట్లు అది భట్టిప్రోలు కాదు – బట్టిప్రోలు అనే విషయం మరో టపాలో వివరిస్తాను)
స్తూపం ఆవరణ అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పురావస్తు శాఖ ( ఆర్కియలజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ASI) వారి సంరక్షణలో ఉంది. అప్పటికే ధ్వంసమైన ఈ స్తూపానికి సంబంధించిన ఇటుకలు, పాలాస్త్రి పెంకులవంటి చారిత్రక అవశేషాలు పరిరక్షించడం కోసం ఈ ఆవరణ చుట్టూ బలమైన కంచెతో పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేసి, చుట్టూ ఉద్యానవనాన్ని పెంచుతున్నారు. అది మినహా అక్కడ శిల్పసంపద ఏమీ మిగలలేదు.
అయితే అక్కడికి వెళ్లడం వల్ల నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఉమ్మి టపాకాయల మొక్కల్ని చాలా ఏళ్లకు తిరిగి చూడగలిగాను. నా చిన్నతనంలో ఖాళీ స్థలాలలో ఆ మొక్కలు చాలా ఎక్కువగా కనపడేవి. నీలం/ వయొలెట్ వర్ణపు గొట్టం పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ మొక్కకు మరో విశేషముంది. దాదాపు అంగుళం పొడవుండే వీటి ఎండు కాయలను నోట్లో పెట్టుకుంటే ఠాప్
మంటూ నోట్లోనే పేలి గింజలను వెదజల్లుతాయి. ఎండి నల్లగా అయిన కాయలు తడి తగిలితే టపాకాయలలా పేలి గింజలను వెదజల్లుతాయి కనుక ఈ మొక్కలను చిన్నప్పుడు ఉమ్మి టపాకాయల మొక్కలు అనేవాళ్లం. మధ్య అమెరికా దేశాలు, కరీబియన్ దీవుల్లో జన్మించిన ఈ మొక్కలను ప్రపంచవ్యాప్తంగా ఉద్యానవనాలలో పెంచుతున్నారు. ఈ మొక్కకి ఆంగ్లంలో ఉన్నన్ని సామాన్య నామాలు మరే మొక్కకూ లేవు. కొన్నింటిని మాత్రమే చెప్పుకుందాం. ఎండుకాయలు పేలడాన్ని బట్టి
Cracker Plant, Popping Pod Plant, Daniel’s Great Gun వంటి పేర్లు వచ్చాయి. దీని వేర్లు బలంగా ఊరతాయి. వీటిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. అందుకే ఈ మొక్కని Sheep Potato అంటారు. ఈ వేర్లు జ్వరనివారణకు పనిచేసేవిగా ( Febrifuge) పేరొందాయి కనుక ఈ మొక్కను Fever Root Plant అంటారు. దీనిని Iron Root, Minnie Root, Minnier Root, Snap Dragon Root అనే పేర్లతోనూ పిలుస్తారు. గంట ఆకారంలో ఉండే నీల వర్ణపు దీని పూలనుబట్టి దీన్ని Blue Bell Plant అనీ అంటారు. బల్లెం ఆకారంలో ఉండే కాయలనుబట్టి ఈ మొక్కను Spear Pod Plant అని కూడా అంటారు. వర్షాకాలం ఆరంభంలో గంట ఆకారంలో నీలి – ఊదా రంగుల సమ్మేళనంలో ఉండే పూలు విరగబూస్తాయి. ఎకాంతేసీ ( Acanthaceae) కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం Ruellia tuberosa.
— మీ..రవీంద్రనాథ్.