Breaking News

ఐస్ క్రీం బీన్ వృక్షం

ఐస్ క్రీం బీన్ వృక్షం
icecream bean tree icecream bean tree02
మా 2018 అమెరికా పర్యటన సందర్భంగా కొందరు మిత్రులతో కలిసి నేను మధ్య అమెరికా దేశమైన పనామా దేశంలోనూ కొన్నాళ్ళు పర్యటించాను. గత కొన్నేళ్ళుగా ఆ దేశంలో భూములు కొనుగోలు చేసి ఆసక్తితో వ్యవసాయం
చేస్తున్న ఆ మిత్రులు అక్కడ సహజంగా పెరుగుతున్న చెట్టు చేమలలో ఉపయోగితా విలువలు కలిగిన వృక్షాలు ఏవి? వాటిని తమ వ్యవసాయ క్షేత్రాలలో పెంచేటందుకు ఏ మేరకు వీలుంది? వంటి విషయాలపై నా సలహాలు కోరారు. అప్పటికే వారు తమ భూములలో కాఫీ తోటలువేసి పెంచుతున్నారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న వృక్షజాలాన్ని నేను పరిశీలించిన తరువాత ఇప్ప, పసుపు, పచ్చిరొట్టగా పనికొచ్చే ఎలుకచంపు చెట్లు ( Gliricidia sepium), టేకు ( Tectona grandis), సుగంధ ద్రవ్యమైన జాజికాయ ( Myristica fragrans) వంటి కొన్నింటిని వారి క్షేత్రాలలో పెంచుకోవచ్చునని సూచించాను.
అలా వారి క్షేత్రాలలో కంచెలపక్కన, ఖాళీ స్థలాలలో పెంచుకోదగిన వృక్షాలలో ఇది మరొకటి. చిక్కుడు జాతి (Fabaceae) కి చెందిన ఈ వృక్షాన్ని
ఐస్ క్రీం బీన్ ( Ice Cream Bean) అంటారు. దీని శాస్త్రీయ నామం ఇంగా ఎడ్యులిస్ ( Inga edulis). పనామా దేశంలోని పర్వత సానువులు, అటవీ ప్రాంతాలలో విస్తారంగా కనిపించిన ఈ వృక్షాలు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాలన్నిటిలో సామాన్య వృక్షాలే. లాటిన్ అమెరికా దేశాలలో నివసించే తుపి ( Tupi) ప్రజలు ఈ వృక్షాన్ని తమ భాషలో ఇంగా అంటారు. ఎడ్యులిస్ ( edulis) అంటే లాటిన్ భాషలో
తినదగినది ( edible) అని అర్థం. ఈ వృక్షం 100 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. వీటి పూలు సుగంధభరితంగా, కుచ్చు వంటి తెల్లని స్టేమెన్స్ ( Stamens) తో తెల్లని పౌడర్ పఫ్ ( Powder Puff)
లాగా ఉంటాయి. ఒక మీటరు వరకు పొడవు పెరిగే వీటి కాయలలో 10 నుంచి 20 వరకూ ఉండే విత్తనాలను చుట్టి ఉండే తియ్యటి, మెత్తటి గుజ్జు కారణంగా ఈ వృక్షానికి ఐస్ క్రీం బీన్ అనే పేరు వచ్చింది. మెత్తటి సుగంధభరితమైన జెల్లీ లాగా ఉండే ఈ గుజ్జు కారణంగా ఈ వృక్షం పండ్లకు స్థానిక మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.
ఈ వృక్షం గురించి చెప్పుకోదగిన మరో విషయముంది. ఒక రకం చీమలతో ఈ వృక్షాలు సహజీవనం ( Symbiosis) చేస్తాయి. తన నుంచి వచ్చే
తియ్యని స్రావాన్ని స్వీకరించే ఆ చీమలు అందుకు బదులుగా కొన్ని రకాల శాకాహార జంతువుల నుంచి ఈ వృక్షానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఈ వృక్షంతో కొన్ని రకాల గొంగళి పురుగులు కూడా చీమలతో కలిసి సహజీవనం చేస్తూ ఈ వృక్షాన్ని ఇతర జంతుజాలం నుంచి కాపాడతాయి. ఈ చెట్టు ఆకులు తిని ఆ గొంగళి
పురుగులు తేనె వంటి తియ్యని బిందువులను స్రవిస్తాయి. చీమలు వాటిని స్వీకరించి ఈ వృక్షానికి కొన్ని జంతుజాతుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
వైద్యపరంగా కూడా ఈ వృక్షానికి విలువ ఉంది. దీని ఆకులను గుజ్జు చేసి, దానితో కషాయం కాచుకు తాగితే మొండి దగ్గు తగ్గిపోతుంది. అలాగే ఆకుల పసరు
రాస్తే సర్పి ( Herpes zoster) వంటివి నయమౌతాయి.
— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *