Breaking News

కరోనాకాలం…

కరోనాకాలం…

ఒక ఉపద్రవం ముంచుకొచ్చింది…ఒక మహమ్మారి విజృంభిస్తోంది.. ఇప్పుడు ప్రపంచం కరోనా వైరస్ కు వణికిపోతోంది. ఎక్కడో చైనా నుంచి ప్రపంచ దేశాలను దాటుకుంటూ ఇండియాకు వచ్చేసింది..ఇదొక విపత్కర పరిస్థితి..కేవలం ప్రభుత్వాల మీద వదిలేయకుండా ప్రతిఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిన సమయం.. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు చేయగలిగింది కొంతమేర మాత్రమే.. మిగిలినదంతా చేయాల్సింది మనమే..మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలి.. అప్రమత్తం కండి.. ఇంకొకరికి జాగ్రత్తలు చెప్పండి..తప్పేమీ లేదు..నామోషీగా ఫీలవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు.

మనషుల ప్రాణాలు తీస్తున్న వైరస్ ను ఎదుర్కునే క్రమంలో అనేక ఇబ్బందులూ మనం పడాల్సి ఉంటుంది.. విదేశాల నుంచి వస్తువుల దిగుమతులు చాలా వరకూ ఆగిపోయాయి.ఇండియా నుంచి ఎగుమతులూ నిలిచిపోయాయి.. మరోవైపు కరోనా భయంతో చాలామంది పని చేయడానికి సంస్థలకు వెళ్లడం లేదు. కొన్ని సంస్థలను స్వచ్ఛందంగానే మూసేస్తున్నారు. దీంతో సమాజం అనేక అంశాల్లో ప్రభావం చూపిస్తుంది. వ్యాపారాలు నడవనప్పుడు చాలామంది ఉపాధి కోల్పోతారు. అలాగే సరుకుల రేట్లు విపరీతంగా పెంచేస్తారు. కొన్నివస్తువులు దొరక్కపోవచ్చు కూడా.. ఒక విధంగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడవచ్చు..ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు కొంతమంది వ్యాపారస్తులకు అవకాశంగా తీసుకుంటారు. అందుకే వస్తువులను దాచేసి కృత్రిమ కొరత సృష్టిస్తారు. ఇలాంటి సమయాల్లోనే సంపాదించేలాయనే కక్కుర్తి అంతా చూపిస్తుంటారు. అలాగే ప్రజలందరి మధ్యా సహకారం అవసరం..ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపించాలి..లేకపోతే ఈ పరిస్తితుల్లో మరిన్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు..

చైనాలోచాలారోజులు ఇళ్లల్లోంచి జనాలు ఎవరూ బయటకు కూడా రాలేకపోయారు..కానీ అక్కడి ప్రభుత్వాలు చాలా చొరవ తీసుకుని వారికి ఇళ్లల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేశాయి.. అలాగే రాబోయే ఈ పరిస్థితిని మనమంతా మానసికంగా సిద్ధంగా ఉండాలి.. అందరూ పరిశుభ్రత పాటించగలిగితే ఎలాంటి వైరస్ లు మనల్ని ఏమీ చేయలేవు..కానీ నేను మాత్రమే బాగుంటే సరిపోతుందనే మన స్వార్థం వైరస్ తోస్నేహం చేయిస్తుంది. జలుబు చేస్తే సిట్రిజన్ లాంటి టాబ్లెట్లు వేసుకుని తగ్గిపోతుందిలే అనుకోకుండా ఆసుపత్రికి వెళ్లి చెక్ చేసుకోగలిగితే దాన్ని మిగిలిన కుటుంబసభ్యులకు అంటించకుండా ఉండగలుగుతాం.. అలాగే తుమ్మినపుడు, చీదినపుడు కచ్చితంగా కర్చీఫ్ వాడగలిగితే పక్కనవారికి వైరస్ ను వ్యాపింపచేయకుండా చూడగలుగుతాం.ఇప్పటికీ చాలామంది కనీసం చేతిని అడ్డుపెట్టుకోకుండా తుమ్మడం మనం గమనిస్తూనే ఉంటాం.. అలాగే చేతులు కడుక్కోవడం అనేది చాలామందికి పెద్దగా అలవాటు లేని పని.. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా రోజుకు ఐదారుసార్లైనా కడిగితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

అలాగే మన ఇళ్లల్లో మన పిల్లలకు చేతులు కడగడంపై అవగాహన కల్పించాలి.. కొన్నిరోజుల పాటు పిల్లలను ఎక్కువమందిపిల్లలు ఉన్నచోటికి ఆడుకోవడానికి పంపకుండా ఉంటే మంచిది.. అలాగే మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.. నా ఇంటి లోపల అంతా బాగుంటే చాలనుకుంటే వైరస్ ను ఇం టి ముందు పెట్టుకున్నట్టే..

ఇది మనకోసం..మన జీవితాల కోసం…మన భవిష్యత్ కోసం..రోగం ముదిరాక నానా ఇబ్బందులూ పడేకంటే ముందుగానే అప్రమత్తమైతే.. అందరూ కుటుంబంతో కలిసి నవ్వుతూ బతకొచ్చు..ఏదీ శాశ్వతం కాదు..అలాగే వైరస్ కూడా శాశ్వతం కాదు..కానీ ఉన్న అన్నిరోజులూ అది సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ..

అశోక్ వేముల పల్లి, జర్నలిస్టు

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *