Breaking News

కోవిడ్-19 – వదంతులు,వాస్తవాలు

కోవిడ్-19 – వదంతులు,వాస్తవాలు
++++++++++++++++++++++++
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారిపై చేసే యుద్ధంలో ప్రజలు గెలవాలి అంటే ముఖ్యంగా వారికి వ్యాధి పట్ల పూర్తి అవగాహన పెంచి, పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను తెలియజేయడం ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)కోవిడ్-19పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించింది.

ఈ నేపథ్యంలో కోవిడ్-19 పై ఉన్న వదంతులు, వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) అపోహ: దగ్గు, తుమ్ములు, ముక్కుకారుతూ ఉంటే అది కరోనా అయి ఉండొచ్చా? వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందేనా?

వాస్తవం: దగ్గు, తుమ్ములూ, ముక్కుకారడం వంటి లక్షణాలు ఉంటే మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు మనకు దగ్గు, తుమ్ములతో పాటు ముక్కు కారడం అనేది బయటి వాతావరణంలో ఏవైనా కాలుష్య కణాలు ముక్కులోకి వెళ్లడం అయి ఉండొచ్చు. ఒకవేళ దగ్గు, తుమ్ములూ, ఒళ్లునొప్పులు, తీవ్రమైన నిస్సత్తువ/నీరసంతో పాటు 101.5 లేదా 102 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతతో జ్వరం ఉండి, ఊపిరి అందకుండా ఆయాసం వస్తుంటే వెంటనే ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలి.

వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే… కుటుంబ సభ్యులందరిని నుంచి దూరంగా ఉంటూ, మీ వస్తువులను ఎవరూ వాడకుండా చూసుకుంటూ, ఇంట్లోనే ఐసోలేషన్‌ పాటించాలి. బయటకు ఏమాత్రం రాకూడదు.

అప్రమత్తత అవసరమే గానీ… ఆందోళన పడాల్సిన అవసరం లేదని గుర్తించండి. పైగా ఆందోళన వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గవచ్చు.

2) అపోహ: కరోనా వైరస్ సోకితే మనిషి చనిపోతారు?

వాస్తవం: లేదు. ఈ వైరస్ వల్ల సంభవించే మరణాలు రేటు కేవలం 2 నుంచి 3శాతం మాత్రమే. దాదాపు 80శాతం మంది తేలికపాటి లక్షణాలు కలిగి రెండు వారాల్లోనే కోలుకుంటారు. కేవలం వృద్ధులు (60ఏళ్లకు పైబడ్డవారు) మరియు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైరస్ సోకితే ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంది.

3) అపోహ: కరోనా వైరస్ వేడి ప్రాంతంలో ఉన్న వారికి సంక్రమించదు.

వాస్తవం: కరోనా వైరస్ వేడి ప్రాంతంలో ఉన్న వారికి సంప్రమించదు అనేది అపోహ మాత్రమే. ఈ వైరస్ వాతావరణంతో సంబంధం లేకుండా తిష్టవేసి ఒకరినుంచి ఇంకొకరికి సంక్రమిస్తాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాత్రమే వైరస్ ను ఎదుర్కొనగలం.

4) అపోహ: థర్మల్ స్కానర్స్ ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చు.

వాస్తవం: థర్మల్ స్కానర్స్ ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చు అనేది అవాస్తవం. థర్మల్ స్కానర్స్ మనిషి ఒంటిలో జ్వరాన్ని మాత్రమే గుర్తిస్తుంది. కరోనా వైరస్ కి ఉన్న లక్షణాలలో అతి ముఖ్యమైనది జ్వరం కాబట్టి అనేక చోట్ల థర్మల్ స్కానర్స్ ని వాడుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు బయటపడాలి అంటే వ్యాధి సోకిన రోజు నుంచి సుమారు 14 రోజుల సమయం పడుతుంది.

5) అపోహ: మనం రోజూ అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మజాతికి చెందిన పండ్లు తింటే ఈ జబ్బు దరిచేరదు.

వాస్తవం: అల్లం, వెల్లుల్లి, ఉల్లి విషయానికి వస్తే వీటిల్లో చాలా ఔషధ గుణాలున్నమాట నిజమే. అలాగే నిమ్మజాతి పండ్లలోని విటమిన్‌ ‘సి’ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతమాత్రాన వీటిని తీసుకుంటే కరోనా వైరస్‌ రాదు అన్నది పూర్తి వాస్తవం కాదు. మనలో వ్యాధి నిరోధక శక్తి ద్వారా పరోక్షంగా మాత్రమే వ్యాధిని నిలువరించేందుకు దోహదపడతాయి. ఇవి తీసుకున్నంత మాత్రాన జాగ్రత్తగా ఉండకపోతే… వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వంటింటి చిట్కా వైద్యాలపై ఆధారపడి నిర్లక్ష్యంగా ఉండకూడదు.

6) అపోహ: శానిటైజర్‌ పూసుకుని వంటింట్లో స్టవ్‌ దగ్గరకు వెళ్లకూడదు. వెళ్తే చేతులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

వాస్తవం: శానిటైజర్‌లో ఆల్కహాల్‌ శాతం దాదాపు 70 నుంచి 80 శాతం వరకు ఉంటాయి. ఆల్కహాల్‌కు చాలా త్వరగా ఆవిరైపోయి, ఆరిపోయే గుణం ఉంటుంది. కాబట్టి వెంటనే అరిపోతుంది. అలా ఆరిపోగానే ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా వంట చేసుకోవచ్చు. అది ఆరిపోయాక నిస్సందేహంగా స్టవ్‌ దగ్గరకు వెళ్లి వంట చేసుకోవచ్చు.

ఇలాంటివి కాకుండా మరికొన్ని అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి అపోహలు వీడి మన జాగ్రత్తల్లో మనం ఉందాం.

1) ముక్కును సెలైన్‌తో క్రమం తప్పకుండా కడగడం వల్ల కరోనా వైరస్ రాకుండా ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు

2) యాంటీబయోటిక్స్ వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేయవు.
యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి

3) ఇప్పటి వరకు, కరోనా వైరస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్టమైన మెడిసిన్ ఏదీ సిఫార్సు చేయలేదు

4) హ్యాండ్ డ్రైయర్స్ కరోనా వైరస్ ను చంపడంలో ప్రభావవంతంగా పనిచేయలేవు

5) అతినీలలోహిత కాంతిని స్టెరిలైజేషన్ కోసం ఉపయోగించరాదు. అలా చేస్తే చర్మంపై చికాకు కలిగిస్తుంది.

6) ఆల్కహాల్ లేదా క్లోరిన్ ను శరీరంపై చల్లడం వల్ల లోపలికి ప్రవేశించిన వైరస్ ను చంపలేరు

7) న్యుమోనియా వ్యాక్సిన్ మరియు హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్-బి(హిబ్) వంటి టీకాలు కరోనావైరస్ నుండి రక్షణను అందించవు

8) చల్లని వాతావరణం మరియు మంచు ప్రదేశాలు కరోనా వైరస్ ను చంపలేవు

9) వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలోనూ కరోనావైరస్ వ్యాప్తి చెందుతుంది

10) దోమ కాటు ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందదు

11) పెంపుడు జంతువులు కరోనా వైరస్ ను వ్యాప్తి చేస్తాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

12) వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా వైరస్ ను నిరోధించలేము.
=======================
రెడ్ జోన్ లేదు..
గ్రీన్ జోన్ లేదు..
ఆరెంజ్ జోన్ లేదు..

అందరం ఉన్నది ఒకటే జోన్..
అదే ‘డేంజర్ జోన్’..!

జాగ్రత్త గా ఉంటే జనాభా లెక్కల్లో ఉంటాం..!
కేర్లెస్ గా ఉంటే కరోనా లెక్కల్లో ఉంటాం..!!
=========================
డాక్టర్ అర్జా శ్రీకాంత్
స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *