Breaking News

క్షమా గుణం – మాతృ ప్రేమ

క్షమా గుణం – మాతృ ప్రేమ
భూమికి ‘క్షమా’ అని మరోపేరు. ‘క్ష్మా’ అనికూడా దీనిని అంటారు.సంస్కృతంలో భూమికున్న 27 పేర్లలో ఇది ఒకటి. క్షమా గుణం కలిగినది కనుక భూమికి ఆ పేరు వచ్చింది. ‘క్షమతే భారం క్ష్మా’
అని నిర్వచనం. ‘భారమును ఓర్చేది’ అంటే భారాన్ని మోసేది అని అర్థం. ‘ధరణీ’ అన్నా మోసేది (భూమి) అనే అర్థమే.
ధరణికి గిరి భారమా ..
గిరికి తరువు భారమా ..
తరువుకు కాయ భారమా ..
కని పెంచే తల్లికి పిల్ల భారమా ..
అన్న చక్కటి సినీ గీతం సుప్రసిద్ధం.
భూమిపుత్రులుగా, భూమిపుత్రికలుగా మనందరిలోనూ క్షమా గుణం (భరించే, సహించే గుణం) తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని మనం మన తల్లి భూమి నుంచే పుణికిపుచ్చుకున్నాం. అయితే భూమికి చైతన్యపూరితమైన విచక్షణ లేదు. భరించడం అంటే మోయడం దానికి తప్పనిసరి. క్షమించడం దాని సహజ గుణం. కానీ మానవులకున్న విచక్షణ కారణంగా మన క్షమాగుణం సాపేక్షం అయిపోయింది. మనం చేసే ఎంతెంత తప్పులనైనా మనం క్షమించేసుకుంటాం. ఇతరుల తప్పుల్ని మాత్రం భూతద్దంలో చూస్తాం. మనందరం మానవులం.లోపాలుండడం మానవ సహజం. ఏ లోపమూ లేని వ్యక్తి ఎక్కడా కనిపించరని మనకి బాగా తెలుసు. అయినా మన పొరుగువాడికి మానవ సహజమైన బలహీనతలు (Human Frailties) ఏవైనా ఉంటే మాత్రం మనం సహించలేము. విమర్శిస్తాం. అవే బలహీనతలు మనకి ఉంటాయి. మనం మనవారనుకునే వారికీ ఉంటాయి. వాటిని మాత్రం మనం క్షమించేస్తాం. తల్లిదండ్రులు తమ కొడుకులూ, కూతుళ్ళూ చేసే తప్పుల్ని క్షమిస్తారు. బాహాటంగా వారిని వెనకేసుకొస్తారు కూడా. తరవాత ఇంట్లో చీవాట్లు పెడతారు.అదే వేరే విషయం.అయితే తప్పుచేసిన తమ పిల్లల్ని ఇతరుల ఎదుట విమర్శించడానికీ, ఖండించడానికీ వారికి మాతృప్రేమతో కూడుకున్న అహం అడ్డువస్తుంది. ప్రతి స్త్రీ తన కుమార్తె ఎంత తప్పు చేసినా ధరిత్రి లాగే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. అదే తన కోడలు చిన్న తప్పు చేసినా కడిగిపారేస్తుంది. (అక్కడక్కడా అరుదుగా దీనికి కొన్ని మినహాయింపులూ ఉంటాయి ) తన కొడుకు తాగుబోతు, తిరుగుబోతు అయినా సహించే స్త్రీ తమ అల్లుడు అలాంటి పనిచేస్తే క్షమించలేదు. పురుషులూ అంతే. అందుకే మానవుల క్షమాగుణం భూమి యొక్క క్షమాగుణం లాగా నిరపేక్షమైనది కాదు. అది సాపేక్షం.
మమకారంతో పాటు భూమికున్న నిరపేక్షమైన క్షమా గుణం మనందరికీ కూడా ఉంటే వేరే స్వర్గం గురించి ఆలోచన ఎందుకు ? ఈ భూమే స్వర్గం !
— మీ..రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *