Breaking News

పొగడ చెట్టు అద్భుత గాథ !!

పొగడ చెట్టు అద్భుత గాథ !!by
— ముత్తేవి రవీంద్రనాథ్

ఈ మధ్య ఒక ఫంక్షన్ కి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వెళ్ళినప్పుడు అక్కడి ఒక ఫంక్షన్ హాల్ లో ఒక విరగకాసిన పొగడ చెట్టును చూశాను. ఎర్రటి రత్నాలవంటి కాయలతో చెట్టు బలే అందంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ ఫోటోలు అక్కడ తీసినవే.

88020879_3503837046353668_8781762571767119872_o 88236474_3503844196352953_8993905162728767488_o 88253689_3503836139687092_8495696910672199680_n 88261689_3503844619686244_3176275765914238976_o 88320770_3503836866353686_8818867674705559552_n 89159911_3503844436352929_337015582522081280_o
పొగడ పూల పరిమళం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్నప్పుడు ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ పొగడ చెట్ల నీడలో ఆడుకున్న రోజులు నాకింకా బాగా గుర్తు. మిగిలిన పూలన్నీ ఒక ఎత్తు. పొగడ, పారిజాతం పూలు రెండూ ఒక ఎత్తు. ఎందుకో తెలియదుగానీ, ఆ రెండు పూలకు సంబంధించిన నా చిన్నప్పటి జ్ఞాపకాలు చక్కటి వాటి సుగంధపు అనుభూతులతో కలిసి పెనవేసుకున్నాయి.ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నా, తక్షణం వాటి పరిమళాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతి కూడా తప్పక కలుగుతుంది. ఆ పూలకూ, వాటి పరిమళాలకూ మధ్య బంధం అంతగా విడదీయరానిది మరి !! రాలిన పొగడపూలు వాటి తెల్లదనం కోల్పోయి లేత గోధుమవన్నెకు మారినా, అవి వాటి సువాసనను మాత్రం కోల్పోవు. అప్పట్లో ఆడపిల్లలు రాలిన పొగడ పూలను ఏరుకుని, ఆ పూల మధ్యన ఉండే బొడ్డులోని రంధ్రంగుండా సూది జొనిపి, వాటిని మాలలుగా గుచ్చి, తలలో పెట్టుకునేవారు.కొందరయితే ఆ రాలుపూలను కొబ్బరి నూనెలో వేసుకుని పరిమళభరితమైన ఆ నూనెను తలకి రాసుకునేవారు. పొగడపూల పరిమళాన్ని పొగడుతూ‘ విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ (1861-1941) ఎన్నో కవితలు రాశారు. శాంతి నికేతన్ లో ఒక వీథికి ఇరువైపులా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పొగడచెట్లనే పెంచుకున్నారాయన. ఆ వీథికి ‘బకుల్ బీథి’ (పొగడ వీథి ) అనే పేరుపెట్టుకుని పొగడపూల పరిమళాలను ఆస్వాదిస్తూ, ప్రభాత సమయాల్లో ఆ బాట వెంట గంభీరంగా నడుస్తుండేవారట ఆయన.ఆషాఢ మాసంలో ముచ్చటైన చిట్టి నక్షత్రాలవంటి పొగడపూలు చెట్లనిండా విరగబూయడం, పరిమళాలు వెదజల్లే ఆ పూలు ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా నేలపై రాలిపడడం మొదలైనవన్నీ ఎంతో ఆసక్తిగా వర్ణించారు విశ్వకవి ‘అభినొయ్’ (Abhinoy)అన్న తన బెంగాలీ కవితలో.రవీంద్రుడికి పొగడ పూల పరిమళం గుబాళించే ఏప్రిల్, మే, జూన్ నెలలంటే ఎంతో ఇష్టమట.సంస్కృత భాషలో పొగడను ‘వకుళః ’ అంటారు. ‘రోగాలను పోగొట్టేది’ అని దీని అర్థం.సంస్కృతంలోనే దీనికి ‘కేసరః’ అనే మరో పేరుంది. ‘మంచి ఆకారం, సుగంధం కలిగి శిరస్సున ధరించేది’ అని దీని అర్థం. దీనినే కొందరు ‘సింహ కేసర’ అనీ అంటున్నారు. శ్రీకృష్ణుడికి పొగడ పూలంటే అమిత ఇష్టమట. బృందావనంలోని పొగడ చెట్ల నీడలలోనే గోపికలతో ఆయన ఆటపాటలన్నీ సాగేవట.

వకుళా దేవి ఐతిహ్యం

తిరుమల కొండలపై అనాథ బాలుడైన శ్రీనివాసుడిని తన ఆశ్రమంలో పెంచి, పెద్దచేసి, పద్మావతితో ఆయన వివాహం జరిపించిన వకుళాదేవి తనను తాను శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘వకుళా’ పుష్పం యొక్క మారురూపంగా భావించేదట. రోజూ పొగడపూల మాలలు గుచ్చి కృష్ణుని విగ్రహానికి అలంకరించేదట ఆ భక్తురాలు. కేవలం భక్తురాలిగానే కాక, కృష్ణుడిని పెంచిన తల్లి యశోదగా కూడా తనను తాను ఊహించుకునేదట ఆమె. ద్వాపర యుగంలోని ఆ యశోదే కలియుగంలో వకుళాదేవిగా జన్మించిందని కొందరి విశ్వాసం. శ్రీకృష్ణుడు విదిషను పాలించిన భీష్మకుని కుమార్తె రుక్మిణిని ఎత్తుకెళ్ళి, రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నప్పుడు యశోద కృష్ణుడితో, ‘ నీ పెళ్లి నా చేతులమీదుగా జరిపించాలని నాకు కోరికగా ఉంది,’ అన్నదట. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ యశోదతో, ‘ నీ కోరిక ఈ జన్మలో మాత్రం తీరేది కాదు. వచ్చే జన్మలో నీవు వకుళాదేవిగా జన్మించి, తిరుమల కొండల మీద నివసించేటప్పుడు నేను ఒక అనాథ

బాలుడిగా నీ ఆశ్రమానికి వచ్చి, నీచే చేరదీయబడి, నీ చేతులమీదుగా ( పద్మావతిని) వివాహమాడి, నీ ముచ్చట తీరుస్తాను’, అన్నాడట. శ్రీకృష్ణుని రాకకోసం ఏళ్ళ తరబడి ఎదురుచూసిన ఆమె అనాథ బాలుడైన శ్రీనివాసుడిలోనే శ్రీకృష్ణుడిని చూసుకునేదట. తిరుపతి – చంద్రగిరి మార్గంలోని పేరూరులోని ఒక చిన్న కొండపై కొందరు భక్తులు కట్టించిన వకుళా మాత ఆలయం నేటికీ ఉంది. అయితే ఆ ఆలయంలో పూజా పునస్కారాలేవీ జరగడం లేదు. అక్రమ క్వారీయింగ్ చేసే తవ్వకందారులు పేరూరు బండగా ప్రసిద్ధమైన ఆ చిన్న కొండను గ్రానైట్ కోసం దాదాపుగా పగలగొట్టి ధ్వంసం చేసేసిన కారణంగా ఆ కట్టడం ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. పి. పుల్లయ్యగారి దర్శకత్వంలో పద్మశ్రీ ప్రొడక్షన్స్ వారు యన్టీ ఆర్, సావిత్రి ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన మహత్తర చలనచిత్రం ‘శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం’ లో వకుళాదేవి పాత్రధారి శాంతకుమారి గారు పెండ్యాలగారి సంగీత దర్శకత్వంలో ’ ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురుచూతురా గోపాలా.. ఎంత పిలిచినా, ఎంత వేడినా.. ఈనాటికి దయరాలేదా ?.. గోపాలా.. నందగోపాలా..’ అంటూ తానే స్వయంగా పాడుకున్న అద్భుత గీతాన్ని మనం ఎవరమైనా ఎలా మరచిపోగలం ?
పొగడ తీరూ … పేరూ …

పొగడ చెట్టు పెద్ద సతతహరిత (ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే) వృక్షం. ఇది అరుదుగా 120 అడుగుల ఎత్తువరకూ కూడా పెరుగుతుంది. మొదలు చుట్టుకొలత 9 అడుగులుండే వృక్షాలు కూడా అక్కడక్కడా కనుపిస్తాయి. దీని కాండం ముదురు చాక్లెట్ రంగులో నెర్రెలు విచ్చి ఉంటుంది. చెట్టంతా ఎప్పుడూ ఆకులు ఒత్తుగా ఉంటాయి. అందుకే నీడనిచ్చే వృక్షాలలో పొగడది ఓ ప్రత్యేకమైన స్థానం. పొగడ చెట్లు దక్షిణ భారతదేశమంతటా, ఇంకా అండమాన్ దీవులలోని సతత హరితారణ్యాలలోనూ, బెంగాల్, బర్మా అడవులలోనూ సహజంగా పెరుగుతాయి. సువాసనగల వీటి పుష్పాల కారణంగా పొగడ చెట్లను ఉద్యానవనాలలో అలంకార వృక్షం (Ornamental Tree) గానే కాక, నీడకోసం రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ వృక్షాలు (Avenue Trees)గానూ పెంచుతున్నారు.ఈ ఉష్ణ ప్రాంతపు వృక్షం ఆకులు అండాకారంలో కొంచెం పొడవుగా మొనదేలి ఉంటాయి. ఆకులు పై పక్క ముదురు ఆకుపచ్చగా, నున్నగా మెరుస్తూ, కింది పక్క లేత ఆకుపచ్చ రంగులో, ఈనెలు బయల్పడి ఉంటాయి. పట్టుకుంటే ఆకులు స్పర్శకు తోలులా అనిపిస్తాయి.ఆకుల అంచులు అలలలా ఉంటాయి. పూలు కాండానికీ ఆకుకూ మధ్య (Axils)లో ఒంటరిగానూ లేక గుత్తులుగానూ పూస్తాయి. అవి మీగడ తెలుపు వన్నెలో నక్షత్రాకారంలో పరిమళభరితంగా ఉంటాయి.కాయలు అండాకారంలో పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగానూ,పండితే కాషాయ వర్ణంలోనూ, ఒక్కోసారి పసుపుపచ్చగానూ ఉంటాయి. సపోటా మరియు పాల పళ్ళకున్నట్లే పొగడ పళ్ళకూ పండు చివర సన్నటి రాలిపోయే ముల్లు ఉంటుంది. ఆ చెట్ల లాగే పొగడలోనూ చెట్టంతా పాలుంటాయి. పండులో సాధారణంగా ఒక గింజ లేక అరుదుగా రెండు గింజలుంటాయి. గింజలు అండాకారంలో గోధుమ వన్నెలో మెరుస్తూ, ఒత్తినట్లుగా ఉంటాయి. పొగడ పళ్ళపై గుజ్జు తియ్యగా ఉంటుందిగానీ, దానిలో ఉన్న ‘శాపోనిన్’ అనే రసాయనిక పదార్ధం కారణంగా అవి తింటుంటే కొంచెం వగరుగా, ఏదుగా అనిపించి, మనం ఏదో వికారమైన అనుభూతికి లోనవుతాం. వాటిని ఇష్టంగా తినే పక్షులు, గబ్బిలాలు విత్తన వ్యాప్తికి

తోడ్పడతాయి. మన ప్రాంతంలో మనకి మహావృక్షాలుగా పెరిగిన పొగడ చెట్లు దాదాపు ఎక్కడా కానరావు. అయితే పశ్చిమ కనుమలలోనూ, అండమాన్ దీవులలోనూ మనకు పొగడ మహావృక్షాలు కనుపిస్తాయి.

పొగడను బెంగాలీ భాషలో ‘బకుల్’ అంటారు. దాని సంస్కృత పేరు ‘వకుళః’ లేక ‘బకుళః’ నుంచి ఇది ఏర్పడింది. హిందీలో ఈ చెట్టును ‘మౌల్ సారీ’ లేక ‘మౌల్ సిరీ’ అంటారు.పగడాల (Corals) వంటి దీని కాయలనుబట్టి దీన్నికన్నడ భాషలో ‘పగడె మర’ అంటారు.మలయాళంలో ‘ఇలాంజి’ లేక ‘ఎలాంజి’ అంటారు. తమిళంలో ‘ఇలంచి’ అనీ ‘మగిళం’ అనీ అంటారు. ఆంగ్లంలో దీనిని ‘బుల్లెట్ ఉడ్ ట్రీ’(Bulletwood Tree)అంటారు. వాణిజ్య పరంగా పొగడ కలపను ‘బుల్లెట్ ఉడ్’ అనే వ్యవహరిస్తారు. సపోటా చెట్టు (Achras zapota),పాల చెట్టు (Manilkara hexandra),ఇప్ప లేక విప్ప (Madhuca indica) వగైరాలలాగే పొగడ చెట్టు కూడా ‘సపోటేసీ’ (Sapotaceae) కుటుంబానికి చెందినదే. దీని శాస్త్రీయ నామం ‘మిమ్యూసాప్స్ ఎలెంజి’ ( Mimusops elengi). ‘మిమ్యూసాప్స్’ అనే పదానికి ‘మిమస్’(mimus- mimic) అనే లాటిన్ పదం, ‘ఆప్సిస్’ (opsis-like) అనే గ్రీకు పదం మూలాలు. పొగడ పువ్వు నక్షత్రాన్ని పోలివుండడాన్నిబట్టి దీనికాపేరు. ఇక ‘ఎలెంజి’ అనేది దీని మలయాళీ పేరు యొక్క లాటిన్ రూపం. పోర్చుగీసు భాషలో పొగడ చెట్టును ‘పొమ్మె – డి- ఆడమీ’ అనడాన్నిబట్టి వారి దృష్టిలో ఇది ఆది పురుషుడైన ఆడమ్ అంత ప్రాచీన వృక్షమన్నమాట. కాని ఇది వృక్షం కనుక తొలి మానవుని కంటే కూడా లక్షల ఏండ్ల ముందర ఆవిర్భవించినదే అయి ఉంటుంది.

పెంపకం ఎలా ?

పొగడ చెట్లు చాలా నిదానంగా పెరుగుతాయి. వేర్వేరు చిన్న తట్టలలో పేడ ఎరువు, ఇసుక కలిపిన మట్టిపోసి, ఆ మట్టిలో ఒక్కొక్కటి చొప్పున పొగడ విత్తనాల్ని విత్తుకుని,రోజూ నీళ్ళు పోస్తూ, మొలకెత్తిన తరువాత రెండు సంవత్సరాలకు వాటిని మనకు కావలసిన చోట నాటుకోవాలి. రెండేళ్ళు పెరిగిన మొక్కల్ని నాటుకోవడానికి వర్షాకాలం మాత్రమే అనుకూలమైనది. దీని విలువైన కలపకోసం ఈ చెట్లను పెంచేవారు, ‘ఊండ్ ఫంగస్’ (Wound Fungus- Fomes senex) అనే కలపను దెబ్బతీసే తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకుల మీద వచ్చే బొబ్బలు (leaf galls) కూడా చెట్టు పెరుగుదలకు కీడు చేస్తాయి. కనుక పొగడ చెట్ల పెంపకందారులు వాటిని గమనించిన వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించి సకాలంలో తగు నివారణ చర్యలు చేపట్టాలి.

ప్రయోజనాలు

పొగడ కలప దృఢముగా, మన్నికగా, బరువుగా ఉంటుంది. భూమిలో పాతిపెట్టినా అది పది- పదిహేను సంవత్సరాల పాటు కూడా చెడిపోకుండా ఉంటుంది. అందుకే శవాలను ఖననం చేసేవారు చెక్కపెట్టెల తయారీకి ఈ కలపను ఎక్కువగా ఉపయోగిస్తారు. కలప పచ్చిగా ఉన్నప్పుడు బాగా తెగుతుంది. ఈ కలప పాలిష్ ని బాగా తీసుకుంటుంది కనుక ఫర్నిచర్ తయారీలో కూడా ఎక్కువగా దీనిని

వినియోగిస్తారు. ఫర్నిచర్ తయారీలోనే కాక పొగడ కలపను కాబినెట్ వర్క్ లోనూ, పనిముట్ల పిడుల
తయారీలోనూ, చేతికర్రలు, ఫోటో ఫ్రేములు, సంగీత వాద్యాల తయారీలోనూ కూడా ఉపయోగిస్తారు. భవన నిర్మాణంలోనూ, వంతెనలు, బోట్లు, తెడ్లు, తెరచాప కొయ్యలు, వ్యవసాయ పనిముట్లు, బండ్లు, నూనె గానుగలు వగైరాల తయారీలోనూ కూడా వినియోగిస్తారు.

పొగడ పూలు పెద్ద సంఖ్యలో జలజలా నేలరాలుతుంటాయి. ఎండిన తరువాత కూడా చాలా కాలంపాటు ఈ పూలు తమ పరిమళం కోల్పోవు. ఈ రాలు పూలను ఏరి, మాలలు గుచ్చడం, పరిమళంకోసం
కొబ్బరి నూనెలో వేసుకోవడమే కాక, కొందరు ఈ పూలను దూదికి బదులుగా దిండ్లలో నింపడానికి వాడతారు.

పొగడ ఆకులు, లేత కొమ్మలు కోసి, పశువులకు పచ్చి మేతగా వేస్తారు. అయితే ఈ మేత అంతగా పుష్టికరం కాదు. లేత కొమ్మల్ని విరిచి కొందరు పళ్ళు తోముకునే ( పందుము) పుల్లలుగా వాడతారు. థాయిలాండ్ లో పొగడ పూల గుజ్జును పరిమళం కోసం స్నానానంతరం ఒంటికి రాసుకుంటారు. ఈ పూలనుంచి డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా ఒక అత్తరు (otto) తీస్తారు. దానిని పరిమళ ద్రవ్యాలు, ఉత్ప్రేరకాల తయారీలో ఉపయోగిస్తారు. పొగడ పళ్ళు తింటారు. వాటితో జామ్ లు, ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. పొగడ గింజలనుంచి తీసే కొవ్వును వంటనూనెగానూ, దీపాలు వెలిగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ముడినూనె ఎరుపు – గోధుమ వర్ణాల మిశ్రమంగా, ఏ వాసన లేకుండా ఉంటుంది. దీనిని శుద్ధిచేస్తే లభించే నూనెకు రంగు, వాసన ఉండదు కానీ, గాలి తగిలితే అది లేత పసుపు వన్నెలోకి మారుతుంది.

పచ్చి పొగడ కాయలు స్రావాల్ని ఆపుతాయి. ఈ వృక్షం కాండంపై బెరడు బలవర్ధకమే కాక జ్వరహారిణి (Febrifuge) కూడా. గింజలు విరేచనకారిగా పనిచేస్తాయి. పూలు, పళ్ళ నుంచి తయారుచేసే ఒక లోషన్ గాయాలు, పుళ్ళ నివారణకు ఉపయోగిస్తారు. దీని ఎండు పూలనుంచి తయారుచేసే నస్యాన్ని పీల్చితే ముక్కుల వెంబడి స్రావాలు వెడలి తీవ్రమైన తలనొప్పి కూడా మటుమాయమౌతుంది. పొగడ పండ్ల గింజలను దంచి, నేతితో కలిపి మెత్తటి పేస్టుగా చేసి, పిల్లలకి తినిపిస్తే మొండి మలబద్ధకం కూడా తగ్గి, సాఫీగా విరేచనాలు అవుతాయి. పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, పళ్ళు కదిలినా పచ్చి పొగడ కాయలను నోట్లో వేసుకుని నమిలితే చిగుళ్ళు గట్టిపడి, పళ్ళు దృఢమౌతాయి. పళ్ళు, చిగుళ్ళ వ్యాదులలో పొగడ కాండంపై బెరడును కషాయంగా కాచి, నోటిలో పుక్కిలిస్తే కూడా చిగుళ్ళు గట్టిపడి, పళ్ళు బలపడతాయి. పళ్ళ చిగుళ్ళు వాచి, జిగురు సాగుతూ ఉంటే (Spongy gums) పొగడ చెట్టు కాండం బెరడుతో తయారుచేసిన పండ్ల పొడి వాడతారు. పొగడ కాండంపై బెరడు స్త్రీల వంధ్యత్వాన్ని పోగొట్టి, వారికి సంతాన ప్రాప్తి అవకాశాలను మెరుగుపరుస్తుంది. పొగడ పండ్ల గుజ్జును అతిసార వ్యాధినుంచి కోలుకుంటున్న వారికి ఆహారంగా ఇస్తారు. అలాగే పాముకాటుకు మందుగానూ వాడతారు. ఈ పళ్ళ గుజ్జును నుదురుకు పట్టిస్తే తీవ్రమైన తలనొప్పులు కూడా తగ్గిపోతాయి.

అందమైన ఉద్యానవన వృక్షంగా మనం భావించే పొగడ చెట్టుకు ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో చూశారుగా ! ఇదండీ పొగడ చెట్టు అద్భుత గాథ !!

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *