Breaking News

మన అజాగ్రత్త ఇతరులకు ఇబ్బంది కావొచ్చు

*మన అజాగ్రత్త ఇతరులకు ఇబ్బంది కావొచ్చు –

ఇది తిరిగి మనకే ముప్పులా రావొచ్చు!!*

కోవిడ్-19 వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మే నెలలో కేసుల వేగం కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వడంతో జూన్‌ లో కోవిడ్-19 ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం దాని ఉద్ధృతి పెరుగుతోంది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ వేలసంఖ్యలో ఆస్పత్రులకు చికిత్స కోసం వస్తున్నవారితోపాటు, కోవిడ్-19 లక్షణాలతో టెస్ట్ ల కోసం వస్తున్నవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మన వైద్య సిబ్బంది వైరస్ బాధితులకు చికిత్స చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటే, ప్రజలు మాత్రం ఇప్పటికీ బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీనివల్ల మనం రిస్కులో పడడంతోపాటు వైద్యసిబ్బందిని కూడా మరింత ఇబ్బందికి గురిచేస్తున్నాము.

కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వారు నిత్యం అప్రమత్తతంగా వ్యవహించాలి. జనతా కర్ఫ్యూ సమయంలో చూపించిన స్ఫూర్తి కరోనా అదుపులోకి వచ్చేవరకూ ప్రదర్శించాలి.

స్వీయ నిర్బంధం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే వైరస్‌ను కట్టడి చేయటం సాధ్యమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయినా ప్రజలు ఇప్పటికీ మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దీనివల్ల కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే మాస్క్‌ ధరించటం తప్పనిసరి చేసినా చాలామంది పోలీసులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మాస్క్‌లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు లేనిదే బయటకు రాకూడదు. అధికారులు సూచనలను తప్పక పాటించాలి.

వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కోవిడ్-19 కేసులు పెరుగిపోతున్న కొద్దీ వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే వారు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే చికిత్స చేస్తూ కుటుంబాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కోవిడ్-19 సోకిన పేషెంట్ కు వైద్యం అందించే వైద్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం.

కోవిడ్-19 రోగులకు వైద్య చికిత్స అందించే వైద్య సిబ్బందికి రోగుల ద్వారా వైరస్ సోకకుండా తీసుకునే రక్షణ చర్యలలో భాగంగా వ్యక్తిగత సంరక్షణ పరికరము (Personal Protective Equipment – PPEs) ను ధరిస్తారు.

ఈ పీపీఈ(PPE) కిట్ ధరించి మనం అయితే కనీసం గంటసేపు కూడా ఉండలేము. మరి వైద్యులు కనీసం 6 గంటల పాటు ఆ కిట్ ధరించే ఉంటారంటే వారు ఎంత ఓపికగా చికిత్స అందిస్తున్నారో మనందరం గుర్తించాలి.
ఈ సమయంలో వారి వ్యక్తిగత వస్తువులైన చేతి గడియారం, ఉంగరాలు, చైన్లు, పెన్నులు, మరియు మొబైల్ లాంటి వస్తువులు కూడా దగ్గర ఉండవు.

ఒక్కసారి PPE ధరించిన తర్వాత సుమారు 6 గంటల వరకూ లేదా నిర్ణయించిన పని గంటలు ముగిసే వరకూ తొలగించే అవకాశం ఉండదు.

పీపీఈ కిట్ ధరించడం దగ్గర్నుంచి దాన్ని తొలగించడం వరకు వారు తీసుకునే జాగ్రత్తల్లో (ఈ వీడియోలో చూపిస్తున్నాము) మనం కొంతైనా జాగ్రత్తలు తీసుకున్నా కోవిడ్-19 వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోగలం.

అదే సమయంలో ప్రజలు కూడా వారి జీవన శైలిని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

మొదట్లో కోవిడ్-19 బారిన పడిన వారికి దగ్గు, జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన తెలియకపోవడం లాంటి లక్షణాలు ఉండేవి. ఇప్పుడు వైరస్ సోకిన వారికి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించటం లేదు.

ఈ నేపథ్యంలో విటమిన్‌ సీ ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ, బత్తాయి వంటి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గుడ్డులోని పచ్చసొన తినాలి. ఇందులో విటమిన్‌ డీ ఉంటుంది. చేపలు, ఆకు కూరలు తీసుకోవాలి. కాలుష్యరహితంగా జీవించాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా మంచిది.

ఇలా ఎప్పటికప్పుడు స్వీయ జాగ్రత్తలు తీసుకుందాం.

వైద్యులపై ఒత్తిడి పెంచకుండా జాగ్రత్త పడదాం.

ఇప్పటికే మనందరి ఆరోగ్యాల గురించి ఎంతో కష్టపడుతున్న వైద్యులకు , వైద్య సిబ్బందికి మరింత ఇబ్బంది కలుగ చేయకుండా జాగ్రత్తగా ఉందాం!!!

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *