Breaking News

యాంటీ మోడీ ప‌వ‌నాలే ఆలంబ‌న‌….

సమ‌రం తీరాన సంకీర్ణ జ‌పాలు ఊపందుకున్నాయి.వ్యూహా ప్రతివ్యూహాల్లో బీజీబీజీగా రాష్ట్ర పార్టీల నేత‌లు గడుపుతున్నారు.బీజేపీ మెజారిటీపై ఆశలు స‌డ‌లడంతో ప్రాంతీయ పార్టీలు, ప్ర‌త్యామ్నాయ శ‌క్తుల‌దే పైచేయిగా మారే అవకాశం ఉంది.

సార్వ‌త్రిక క‌ద‌నం కంచికి చేరే త‌రుణంలో సంకీర్ణ కూత‌లు మెండుగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఖాయమని వాద‌న‌లు పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై  దాదాపు అన్ని పార్టీల్లోని నేత‌లు ఒక స్థాయి అవ‌గాహ‌న వ‌స్తున్నారు. దీంతో త‌న‌ను తాను బాహుబ‌లిగా ఊహించుకునే మోడీ స‌ర్కారుకు బీట‌లు వారనుంది. న‌రేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే  ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఎన్డీయే ప‌క్షాలు సైతం భావిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఒక వేళ హంగ్ వంటి పరిస్థితి ఏర్ప‌డితే బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో ప్ర‌తిప‌క్షాలున్నాయి. అందుకే చివరి విడత పోలింగ్ ముగిసిన‌ తర్వాత ప్ర‌తిప‌క్ష పార్టీలు  తమ కార్యాచరణను ఖరారు చేసుకోబోతున్నాయి. అందుకోసం ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత ఏదో ఒక తేదీన ఎన్డీయేత‌ర ప‌క్షాల‌న్నీ దేశ రాజ‌ధానిలో భేటీ కావాల‌ని స‌మాలోచ‌న‌లు  జ‌ర‌పుతున్నాయి. ఇప్ప‌టికే వీవీప్యాట్‌ల విష‌యంలో ఏక‌మైన ప్ర‌తిప‌క్షాలు మ‌రొసారి ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఉన్న అవ‌కాశాల‌పై యోచ‌న జ‌ర‌పాల‌ని చుస్తున్నాయి.

యాంటీ మోడీ ప‌వ‌నాలే ఆలంబ‌న‌….

ప్ర‌జాస్వామ్య సంస్థ‌లు, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను భారీ స్థాయిలో భ్ర‌ష్టు ప‌ట్టించిన మోడీని అధికారం నుంచి దింపేయాల‌ని ఎన్డీయేత‌ర ప‌క్షాల‌న్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందుకోసం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. ఈ మేర‌కు మే 21న కాంగ్రెస్ సహా ఇరవై ఒక్క రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రానున్నాయి. ఇందులో యూపీఏలో భాగస్వామ్య పార్టీలతో ఇత‌ర పార్టీలు సైతం ఉన్నాయి. ఆలిండియా కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రాలలో పోటీ చేసిన పార్టీలు కూడా ఉండ‌టం విశేషం.  కాంగ్రెస్‌ కు ఢిల్లీ స్థాయిలో మద్దతు పలికే పార్టీలు విడిగా పోటీ చేసినప్పటికీ.. ఆవేమీ బీజేపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. మోడీ మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌నుగ‌డ క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ని వారంతా ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఎన్నికల పోటీతో ఎటువంటి సంబంధం లేకుండా విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి. ఆ ఇరవై ఒక్క పార్టీలు వేర్వేరు రూపాల్లో తమ పోరాటాన్ని చేప‌ట్టాయి. ఎన్నికల సంఘం చూపుతున్నవివ‌క్ష, వీవీ ప్యాట్ల లెక్కింపు అంశంపైనా ప్ర‌తిప‌క్షాలు ముక్త‌కంఠంతో పోరాడుతున్న విష‌యం తెలిసిందే. ఇదే స్పూర్తితో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకోవాల‌ని య‌త్నిస్తున్నాయి. మోడీ, షా ద్వ‌యానికి వ్య‌తిరేకంగా పోరాడి తామంతా ఒక్కటే అన్న భావన దేశ ప్ర‌జానీకంలోకి తీసుకెళ్తున్నారు. అయితే, ఎన్నిక‌ల‌ ఫలితాలు రాక ముందే ఏక‌మై, ఫ‌లితాల అనుకూలంగా ఉంటే ప్ర‌భుత్వ ఏర్పాటులో ఎటువంటి సమ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా చూసుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్నాయి. వారంతా కూటమిగా తీర్మానం చేస్తే… భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టువుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, వామ‌ప‌క్షాల‌కు పెద్ద ఎత్తున సీట్లు వ‌స్తే త‌మ‌ను రాష్ట్రప‌తి ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించ‌క‌పోవ‌చ్చ‌ని ఊహాగానాలు ప్ర‌తిప‌క్ష పార్టీల్లో మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల ఢిల్లీలో కొంతమంది నాయ‌కులు స‌మావేశ‌మై ఈ విష‌యంపై చ‌ర్చించారు. సాధార‌ణంగా హంగ్ ప‌రిస్థితి ఏర్ప‌డితే… ప్ర‌భుత్వ ఏర్పాటు సామ‌ర్థ్యమున్న ప‌క్షాలు కాకుండా రాష్ట్రప‌తులు కూడా వ్య‌క్తిగ‌త సంబంధాలు, ప్ర‌యోజ‌నాల ఆధారంగా న‌డుచుకునే అవకాశం రావచ్చని,  రాష్ట్రప‌తి ఒక వేళ బీజేపీనే స‌ర్కారు ఏర్పాటుకు పిలిస్తే…. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న ప‌డుతున్నాయి.  కాంగ్రెస్ కూటమి లేదా ప్రాంతీయ పార్టీల కూటమి ముందుగా రాష్ట్రపతి ఆహ్వానించకపోవచ్చనే అనుమానాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి కోవింద్ ఆ పదవి చేపట్టక ముందు వరకు బీజేపీ నాయకుడ‌ని… అన్నింటికి మించి ఆయ‌న మోడీకి అత్యంత స‌న్నిహితుడ‌ని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. అతి పెద్ద పార్టీ అన్న కారణం చూపి.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీనే ఆహ్వానిస్తారన్న అనుమానం వారిలో బలపడుతోంది. అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చేందుకు 21వ తేదీన పార్టీల భేటీ ఉపయోగపడుతుందన్న అంచనా వేస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌ల పేరిటి సాగిస్తున్న విహారయాత్ర‌ల‌పై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది . మరొ రెండు ద‌శ‌లు ఎన్నిక‌లు ఉండ‌టం,  కౌంటింగ్ కు ముందే  ఈ భేటీ జ‌ర‌గ‌డం వెన‌క రాజ‌కీయ ఉద్ధేశ్యాలున్నాయ‌ని జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెసేతర పార్టీల మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నాలు సైతం జ‌రుగుతున్నాయ‌ని అంశం తెర‌పైకి వ‌స్తుంది.  కేసీఆర్ ఇప్పటికే.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పర్యటనలు చేస్తున్నాయి. అయితే, ఆయన కేవలం కాంగ్రెస్ మిత్రపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటాయనుకుంటున్న పార్టీలను మాత్రమే క‌లుస్తుండ‌టం కూడా అనుమానాల‌కు తావిస్తోంది.  ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్తకూటమికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు కానీ  అసలు లక్ష్యం మాత్రం బీజేపీ ల‌బ్ధి చేకూర్చ‌డ‌మేన‌ని బ‌హిరంగంగా చ‌ర్చ జ‌రుగుతంది. ఆయా పార్టీల‌ నేతలతో భేటీ కావడం వల్ల వారిపై ఇతర పార్టీల్లో అపనమ్మకం వస్తుందని భావిస్తున్నారు. అంతిమంగా ఆ అంశం కాస్త కూటమి నుంచి బయటకు రావడానికి కారణమవుతుంద‌ని…. అదంతా మోడీకే ఉప‌యోగ‌మ‌న్న‌ వ్యూహంతో భేటీలు జరుపుతున్నార‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. అందువ‌ల్లే డీఎంకే నేత స్టాలిన్ కేసీఆర్‌ను క‌లిసేందుకు ఒప్పుకోలేద‌ని తెలిసింది. అయితే, డీఎంకే, జేడీఎస్‌, ఆర్జెడీ, టీడీపీ వంటి ప‌క్షాలు ఎట్టి ప‌రిస్థితిలో తాము మోడీకి మ‌ద్ధ‌తు ఇచ్చే అవ‌కాశం లేద‌ని చెబుతుండ‌టం ఆశించ‌ద‌గ్గ ప‌రిణామం.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *