Breaking News

లాల్ సలామ్ టూ ఎ గ్రేట్ వారియర్ మాదాల రంగారావు….

అందరు స్టార్ల మధ్య వెలిగిన రెడ్ స్టార్, అవును ఆయనొక ఎర్రనక్షత్రం. తెలుగు సినిమాలలో రంగు మారని నక్షత్రం . మా ప్రకాశం జిల్లాకు సినిమాను పరిచయం చేసిన వాడు. ప్రజానాట్యమండలి నుండి ఎదిగిఎదిగి ఆకాశాన్నంటిన హీరో. అయన సినిమా పేర్లలో ఒక ఉద్విగ్నత ఒక ఉత్సాహం ఉంటుంది, యువతరం కదిలింది, ఎంత ఉత్తేజకరమైన టైటిల్ ! ధవళ సత్యం దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ . దాదాపు 15 నిమిషాల పాటు సాగే బుర్ర కథ ఈ సినిమాకే హైలైట్. “యువతరం కదిలింది..” పాటతో ఆనాటి యువతను కదిలించాడు. 
ఆ తర్వాత ఎర్ర మల్లెలు, అసలు ఎంత అధ్బుతమైన అధివాస్తవికత, మల్లెలు అంటేనే తెలుపు , అదీ కాక మల్లెపూలను మనం శృంగారానికి గుర్తు గా వాడుతుంటాం. అలాంటి మల్లెలను ఎర్రగా మార్చి (ఎరుపు చైతన్యానికి గుర్తు) యువతలో సామాజిక చైతన్యాన్ని రగిల్చిన ధీరుడు. ” నాంపల్లి టేసన్ కాడి రాజాలింగో….రాజాలింగా ” ఎప్పటికీ నిలిచిపోయే వ్యంగ్య రచన ” ఓ లగిజిగి లగిజిగి … తాళం వేస్తూ తిరగబడరా అన్నా ! నువ్వు తిరగబడరా అన్నా .. ” అంటూ సాగే పాట అప్పట్లో గ్రామాల్లో ఉన్న మోతుబరి రైతు వ్యవస్థ మీద బక్క రైతు కి దైర్యాన్నిచ్చింది . ” అన్యాయాలు.. అక్రమాలు, దోపిడీలు.. దురంతాలు .. నిలదీసినది ఈ రోజు ” అంటూ మేడే గొప్పతనాన్ని వివరించే పాట, ఇప్పటికీ మేడే రోజు వినిపించాల్సిందే. ఇక “బంగారు మా తల్లి .భూమి మాలచ్మి ” అంటూ నేలతల్లి కి రైతుకు ఉండే పేగుబంధం వివరించే పాట ఒక అద్భుతం. ఇక ఈ సినిమాలో అంతర్బాగంగా వచ్చే నాటకంలో పాట అప్పటి పల్లెటూర్లను పీల్చుకు తింటున్న కరణాలు, మునుసుబులను ఎండగట్టాడు. ఈ ఒక్క పాట చూస్తే చాలు, ఆ కరణీక వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం ఎంత మంచిపని చేసిందో ప్రజలకు అర్దం అవుతుంది

ఆ తర్వాత మహాప్రస్థానం, అసలు ఈ టైటిల్ అప్పటికే శ్రీశ్రీ రచనగా తెలుగునేలంతా పరిచయం, అలాంటి టైటిల్ తో సినిమా తీయటమంటే చాలా సాహసం, కానీ ఈ వీరుడు ఆ పని చేశాడు. ” శక్తి కోసమే నడు.. ముక్తి కోసమే నిలు, విముక్తి కోసమే నడు.. నడు, నడు, నడు.. భయం విడు..” ఇది విప్లవ గీతం అందామా ఒక మోటివేషనల్ సాంగ్ అందమా ! ” నందమయా, గురుడ నందమయా, చందాలు పోగేసి తిందామయా ” మరో వ్యంగ్య గీతం . “జాగోరే..జాగోరే… జాగ్ రహోరే. దేఖోరే దేఖో.. తూరుపు తెల్లారే ” ఈ పాత కూదా నాకు నిద్దురపోతూ, నీరసంగా ఉన్న సమాజాన్ని నిద్దుర లేపుతున్నట్లుంటుంది తప్ప విప్లవ గీతంలా ఉండదు. ఇక ఈ సినిమాలో నే మరో అధ్బుతమైన పాట ” మరో ప్రపంచం.. మరో ప్రపంచం. మరో ప్రపంచం పిలిచింది” ఈ పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచుకుంటాయి, ఆ పాట చిత్రీకరణ కూడా వందల మంది జనాల మధ్య చిత్రీకరించాడు. కె. హేమాంబరధర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి మాటలు, పాటలు రెండూ శ్రీశ్రీ గారే సమకూర్చటం విశేషం

ఇక ఆ తర్వాత వచ్చిన స్వరాజ్యం . ఈ సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట ” కాలేజ్ కుర్రవాడా.. కులాసాగా తిరిగెటోడా” పాట ఒక వైపు వ్యంగ్యంగా అప్పటి మన విద్యావ్యవస్థలో ఉన్న లొసుగులను ఎండగడుతూనే మరో వైపు యువతకు ఏం చేయాలో ఒక స్పష్టమైన సందేశాన్నిస్తుంది. ” అమరవీరులెందరో ఆశించిన స్వరాజ్యం ఇదేనా ” ఈ పాట సీతారామశాస్త్రి గారు సింధూరంలో రాసిన “అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందమా ” పాటకు ముందు వర్షన్ అనుకోవచ్చు.. ఇక ఇదే సినిమాలోని ” అప్పారావు .. ” పాట అప్పుడు ( ఇప్పుడు కూడా ఉన్న) దళారీ వ్యవస్థను, రాజకీయ పైరవీలను ఎండగడుతూ వచ్చిన ఒక వ్యంగ్య గీతం,

మారిన పరిస్థితుల్లో మనదేశం తొలినాళ్ళలో అనుసరించిన సామ్యవాద విధనాలనొదిలేసి పెట్టుబడిదారి వ్యవస్థ వైపు వడివడిగా అడుగులేసిన క్రమంలో మనం ఈ ప్రస్థానాలను మరిచిపోయి పూర్తి వినోదాల బాట పట్టినా ఆ పాటలు ఆ సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము

మా ఒంగోలు నుండి వచ్చిన మా ఎర్రనక్షత్రం ఇప్పడు మరో ప్రపంచానికి వెళ్ళినా అయన నడిచిన బాట ఎర్రమల్లెలు పరిచిన మహాప్రస్థానం . ఆయన పూరించిన విప్లవశంఖానికి యువతరం కదిలింది

లాల్ సలామ్ టూ ఎ గ్రేట్ వారియర్ మాదాల రంగారావు

——mohan ravipati—–

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *