Breaking News

శ్రీశైల శిఖరదర్శనం

శ్రీశైల శిఖరదర్శనం

18010655_1399556086781785_5373823562281312040_n 18010889_1399557720114955_2530711811414776464_n 18033943_1399556260115101_885595772413272782_n 18034223_1399557316781662_620402378397764827_n 18057700_1399556580115069_4488363197777301290_n 18118868_1399557033448357_7383059761855500630_n 18119386_1399556413448419_6716969446132109539_n

శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు చిట్టచివరి మజిలీ శిఖరదర్శనం. ఇక్కడ శిఖరదర్శనం అంటే శ్రీశైల శిఖరాన్ని దర్శించడం అని కాదు. శ్రీశైల పర్వతం మీది ఒక ఉన్నత శిఖరం నుంచి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయ గోపురాన్ని దర్శించడం.

కేదారేహ్యుదకం పీత్వా 
వారణాస్యాం మృతం తథా 
శ్రీశైల శిఖరం దృష్ట్వా 
పునర్జన్మ న విద్యతే || – అని సంప్రదాయం.

కేదార్ నాథ్ క్షేత్రంలో నీళ్ళు తాగినా, వారణాసి (కాశి ) లో మరణించినా, శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నా అలాంటివారికిక పునర్జన్మ ఉండదని దీని అర్థం. సనాతనులు ఈ నమ్మకం కారణంగానే జన్మరాహిత్యం (ముక్తి) కోసం తమ అవసాన దశలో కాశి చేరుకొని అక్కడే మరణిస్తూ ఉండేవారు. శివభక్తులు ముక్తికోసమే జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునేవారు. ప్రయాణ సౌకర్యాలు లేనిరోజుల్లో ఘోరమైన అటవీ మార్గంలో, క్రూర జంతువుల దాడులనుంచి తమనుతాము కాపాడుకుంటూ ‘హరహర మహాదేవ’ అని నినదిస్తూ శివభక్తులు వనయాత్ర చేసేవారు. ప్రాణాలపై ఆశ వదలుకొని శివభక్తులు శ్రీగిరి అటవీమార్గంలో చేసే వనయాత్రను పాలకురికి సోమనాథ కవి తన 
‘ మల్లికార్జున పండితారాధ్య చరిత్ర’ అనే ద్విపద కావ్యంలో అద్భుతంగా వర్ణించాడు.

శివాచారపరాయణులు అనాది నుంచీ ఇలాంటి శివక్షేత్రాలలో ముక్తిని పొందగోరి తమ కాళ్ళు, చేతులు, నాలుక నరుకుకుని వాటిని శివుడికి కానుకగా సమర్పించేవారట. ‘కాళహస్తి మాహాత్మ్యము’ కావ్యంలో శివునికోసం తన రెండు కళ్ళూ పీకి ఇచ్చిన తిన్నడు (కన్నప్ప) అనే బోయ యువకుడిని ఆదర్శంగా తీసుకుని కొందరు శివాచారులు తమ కనుగుడ్లు పెకలించి మల్లికార్జునుడికి నైవేద్యంగా సమర్పించేవారట. ఇంకొందరైతే జీవన్ముక్తిని కోరుకుంటూ శిఖర దర్శన క్షేత్రంలోని ఒక సమున్నత ప్రదేశం నుంచీ లోతుతెలియని ఒక లోయలోకి ‘హరహర మహాదేవ’ అంటూ పెద్దగా నినదిస్తూ దూకేవారట. అలా చేస్తే కర్మ నశించి జన్మరాహిత్యం పొందగలమని వారి ఆశ. శివభక్తులైన అరవై ముగ్గురు నాయనార్లను ఆదర్శంగా తీసుకుని శివాచారులు ఇలాంటి ఆత్మ హింసలకూ, ఆత్మ హత్యలకూ పాల్పడేవారు. ప్రాచీనకాలంలో కొందరు శివభక్తులు శివుడి మీద తమకున్న అపారమైన భక్తిని నిరూపించుకొనడానికి, శివుడి మహిమను లోకానికి చాటడానికి తలలు నరుకుకుని శివుడికి సమర్పించి, శివుని మహిమ కారణంగా తిరిగి పునరుజ్జీవితులైనట్లు శైవ సాహిత్యంలో పలు కథలున్నాయి. వీటిని అమాయకంగా నమ్మిన కొందరు అనంతరకాలంలో తమ జీవితాలను వృథా చేసుకున్నారు. కర్మ నశించి జన్మరాహిత్యం పొందడం మాట అటుంచి, జీవితాంతం కళ్ళు లేని, కాళ్ళూ చేతులూ లేని అవిటి బతుకు బతకాల్సి రావడం మాత్రం తథ్యం. కర్మను నశింపజేసి, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది కనుక ఈ ప్రదేశాన్ని కర్మారి లేక కర్మారేశ్వరం అనికూడా అంటారు. దీనినే కొందరు కరుమారి అని కూడా అంటారు. శైవాచారుల ఆత్మహింస, ఆత్మహత్యల మాట అటుంచి, ‘ఆత్మహత్య మహాపాపం’ అనే సనాతన విశ్వాసం మాటేమిటి ? ఈ రెంటికీ పొసగదే మరి ! తమ భక్తిని నిరూపించుకొనడం కోసం కడుపుకోసుకుని పేగులు బయటికి తీసి శివుడిని మెప్పించాలని శివభక్తులు చేసే చర్య జపాన్ లో మరణదండన విధించబడిన ఉన్నత సైనికాధికారులు తమ పరువు కాపాడుకొనడం కోసం చేసే కుక్షిచ్చేదనము (Harakiri) వంటిదే. బహుశా భారతదేశంలోని శివాచారపరాయణుల నుంచే ఈ ఆచారం జపాన్ కి వ్యాపించి ఉంటుంది.

ఆ ఉన్నత శిఖరం మీద ప్రతిష్ఠించబడిన ఒక ముచ్చటైన నంది విగ్రహం కొమ్ముల మధ్య నుంచీ శ్రీశైల దేవస్థానం గాలిగోపురాన్ని చూసి దానివల్ల ముక్తి వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. గాలిగోపురాన్ని అతి దగ్గర నుంచీ చూసినవారు, ఆలయం గర్భగుడిలోకి కూడా వెళ్లి శివలింగాన్ని చూసి, తాకి, అభిషేకం, అర్చన చేయించినవారు కూడా ఈ శిఖరం నుంచి, నంది విగ్రహం కొమ్ముల మధ్యనుంచి ఆలయ గోపురాన్ని చూసి, అదే ముక్తినిస్తుందని భావించడమేమిటో నాకైతే బోధపడలేదు. నాకు మాత్రం శిఖర దర్శనం కారణంగా ఒక సమున్నత ప్రదేశం నుంచీ అద్భుతమైన దృశ్యాలు చూడగలిగాననే తృప్తి మిగిలింది. శిఖరదర్శనం పాయింట్ కి మెట్లెక్కి వెళ్ళేటప్పుడు మధ్యలో శిఖరేశ్వరుని చిన్న ఆలయం ఉంది.

శిఖరదర్శనం ముగించుకుని అక్కడికి సమీపంలో ఉన్న ఒక ప్రాచీనమైన పాడుబడిన కోనేరు, దాని మధ్యలో ఉన్న రెండు నీరులేని బావులు చూశాం. శిఖర దర్శన ప్రదేశం అంతా కోతులదే పెత్తనం. సందర్శకులు వాటితో చాలా జాగ్రత్తగా మెలగాలి. మన బ్యాగులు, ఇతర విలువైన వస్తువులు, తినుబండారాలు – ఇలా ఒకటనేమిటి ? ఏవి దొరికినా మీదబడి లాగేసుకుంటున్నాయవి. తస్మాత్ జాగ్రత !!

— మీ.. రవీంద్రనాథ్.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *