Breaking News

సంక్షేమ పథకాల అమలులో సరికొత్త రికార్డు

 

• టమాటా, శనగలు, మినుములు, పెసర, మొక్కజొన్న, కందులు తదితర ఆహర పంటలకు గిట్టుబాటు ధర

• శనగలు, మొక్క జొన్న తదితర పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటన

• రైతు బజార్ల ద్వారా టమాటాల విక్రయం – ప్రతి రోజూ అన్ని మార్కెట్లలో ధరల పరిశీలన

• మార్కెట్లను ఆధునీకరించాలని నిర్ణయం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి, 2 మార్చి : రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కొత్త రికార్డును నమోదు చేసిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెంటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సచివాలయం నాల్గవ బ్లాకు లోని ప్రచార విభాగంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈరోజు వ్యవసాయ అనుబంధ, మార్కెటింగ్ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు రైతుకు లబ్ది చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రధానంగా టమాటా, శనగలు, మినుములు, పెసర, మొక్కజొన్న, కందులు తదితర ఆహర పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కందుల కొనుగోలుకు 98 కేంద్రాలు, శనగలకు 101, పసుపుకు 26, మినుములు 109, పెసరకు 67 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పంట ఉత్పత్తుల దిగుబడి పెరిగితే మరిన్ని కేంద్రాలు పెంచేందుకు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అవసరమైతే మార్కెట్‌యార్డ్‌ లను సబ్‌మార్కెట్‌ యార్డ్‌ లను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. గతంలో శనగల్లో ఉన్న దేశీ, కాబులీ రకాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం కేవలం దేశీ రకానికి మాత్రమే మద్దతు ధర ప్రకటించేది కానీ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రకం శనగలకైనా తమ ప్రభుత్వం ఒకే మద్దతు ధర ఇవ్వనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే శనగలకు మద్దతు ధర రూ.4,875లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. అధికంగా టమాటా పండే ప్రాంతాలైన చిత్తూరు, అనంతపురం, కడప ప్రాంతాల్లో ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే తమ ప్రభుత్వం స్పందించి టమాటా, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా, రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తామన్నారు. వీటితో పాటు తొలిసారిగా అరటి, బత్తాయి పంటలకు క్వింటాకు రూ.800లు, రూ.1400లుగా గిట్టుబాటు ధర నిర్ణయించామని వెల్లడించారు. టమాటను మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఎక్కడైతే ధరలు తక్కువగా ఉన్నాయో నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుబజార్లలో విక్రయిస్తుందన్నారు. రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వమే జోక్యం చేసుకుని వినియోగదారులకు అందించేలా చర్యలు ఉంటాయన్నారు స్ధానిక మార్కెట్‌ పరిస్ధితులను బట్టి ధరలు నిర్ణయిస్తామన్నారు.

మొక్కజొన్న దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించామని మంత్రి తెలిపారు. ప్రతి రోజూ అన్ని మార్కెట్లలో ధరల పరిశీలన జరిపి సమన్వయ పరిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రొక్యూర్ మెంట్, మార్కెట్ ఇంటలిజెన్సీ కోసం ప్రభుత్వం మూడు సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ మూడు సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ధరలు పడిపోయేవరకు ఎదురుచూసే పరిస్థితి రాకుండానే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించి పండిన పంటలకు అధిక ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. అనుకున్న దానికన్నా ఈ ఏడాది అధిక మొత్తంలో ధాన్యం దిగుబడి రావడం జరిగిందని, ఈ క్రమంలో రైతులకు కొన్ని చోట్ల చెల్లించాల్సిన బకాయిలతో పాటు ధాన్యం నిల్వలకు ఇబ్బంది ఏర్పడి సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమేనని కానీ కొందరు గోరంతను కొండంతగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రెండురోజుల్లో రైతులకు బకాయిలు చెల్లిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

రైతుల కోసం వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి రైతుల సంక్షేమం కోసం ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగపడేలా చేస్తున్నామన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతుల కోసం ఇంత చేస్తున్న తమ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదన్నారు. తమ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకి ప్రభుత్వం అని విమర్శించే వాళ్లకు ఉచిత పంటల భీమా, వడ్డీలేని రుణాలు, ధరల స్ధిరీకరణ నిధి, రైతుభరోసా కేంద్రాలు కళ్ళకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

రైతులు ఏ దశలోనూ నష్ట పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే తాను మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో కలిసి పలు జిల్లాల్లోని మార్కెట్లను పరిశీలించడం జరిగందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ఇకపై దళారుల ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కేవలం 450 మందికి మాత్రమే గతంలో సాయం చేస్తే నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో లెక్కలు తీసి తమ ప్రభుత్వం అన్నీ పరిశీలన చేయించి మరో 417 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇంటికి తీసుకెళ్ళి మరీ పరిహారం అందించామని తెలిపారు. గడిచిన తొమ్మిది నెలల్లో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కొందరు అంటున్నారని అందులో వాస్తవం లేదన్నారు. గతంలో రుణమాఫీ హమీని కూడా అమలుచేయలేని కొందరు ఇప్పుడు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

రాష్ట్రసంక్షేమ పథకాల అమలులో రికార్డు నమోదయిందని మంత్రి వెల్లడించారు. మారుమూల గ్రామాల్లో కనివినీ ఎరుగని రీతిలో తెల్లవారక ముందే ఇంటితలుపు తట్టి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక బాధ్యతగా తమ వాలంటీర్లు పెన్షన్స్‌ పంపిణీ చేసిన విధానం చూస్తే నిజమైన సంక్షేమ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, నిజమైన నాయకుడి ఆలోచన ఏ విధంగా అమలయిందనే విషయం అర్ధమైందని మంత్రి కొనియాడారు. కేవలం ఒక్క రోజులోనే 51 లక్షల 50 వేల మందికి పైగా పెన్షన్లు గుమ్మం వద్దకే పంపిణీ చేసి రికార్డు సృష్టించామన్నారు. గతంలో కంటే అదనంగా కొన్ని లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని సుమారు 59 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు.

గతంలో పెన్షన్స్‌ ఇవ్వాలంటే మరొకరు చనిపోతే కానీ ఇవ్వని పరిస్ధితి నుంచి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అర్హత ఉంటే చాలు పెన్షన్‌ ఇచ్చే పరిస్ధితి తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సంతకం పెన్షన్ల పథకంపైనే చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో కంటే లక్షల సంఖ్యలో పెన్షన్స్‌, రేషన్‌ కార్డులు పెంచుకుంటూ పోతే మేం తగ్గిస్తున్నామంటూ కొందరు చేస్తున్న అబద్దపు ప్రచారం వాస్తవం కాదని ఖండించారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూ ముందుకెళతామని మంత్రి స్పష్టం చేశారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *