Breaking News

సన్యాసి జీవనం నుంచి కేంద్రమంత్రి వరకు

సన్యాసి జీవనం నుంచి కేంద్రమంత్రి వరకు……..షడంగి వాహనమీ సైకిల్‌

సన్యాసి.. ఆయనను అందరూ పిలుచుకునే నామం… ఆయనకూ అదే ఇష్టం. నిరాడంబరతకు ప్రతిరూపం… ప్రజాసేవే ఆయన స్వభావం.. రాజకీయాల్లో పదవులు అలంకరించినా తన నడత, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన తపన.. ఆయనను ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు తెచ్చాయి. పదేళ్లు శాసనసభ్యునిగా కొనసాగినా పక్కా ఇల్లుగానీ, వాహనం గానీ లేకపోవడమే ఆయన నిజాయతీకి, నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యాలు. తాటి ఆకులతో వేసిన ఇంట్లో ఉంటూ పాతకాలపు సైకిల్‌పై ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ ప్రత్యేకత చాటుకున్న ఆయనే ప్రతాప్‌ చంద్ర షడంగి. బాలేశ్వర్‌ నుంచి లోక్‌సభకు భాజపా అభ్యర్థి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేత.

బాలేశ్వర్‌ జిల్లా నీలగిరికి చెందిన ప్రతాప్‌చంద్ర షడంగి ఉన్నత విద్యావంతుడు. వేదపఠనం, సత్సంగతం, ప్రవచనంలో దిట్టగా మన్ననలందుకున్నారు. బ్రహ్మచర్యాన్ని స్వీకరించిన ఆయన సన్యాసిగా అందరిచే పిలిపించుకుంటారు. షడంగి రాజకీయాల్లోనూ మేధావిగా ముద్రపడ్డారు. సంఘ్‌ పరివార్‌(ఆరెస్సెస్‌) అడుగు జాడల్లో నడిచిన ఆయన ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ నేపథ్యంలో 2000, 2004లలో నీలగిరి స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీలో తన వాగ్ధాటితో అన్నిపక్షాల నేతల మెప్పు పొందారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన షడంగికి పక్కా ఇల్లు లేదు. తాటాకు గుడిసె ఆయన నివాసం. కారు కూడా లేదు. పాతకాలం నాటి సైకిలే ఆయన వాహనం. సమస్యలు ఎదుర్కొనే జనానికి అండగా ఉంటారు. వారి సేవలకే ప్రాధాన్యమిస్తారు.

తన నివాసంలో ప్రతాప్‌

ప్రధాని మెచ్చిన నేత

ప్రధాని నరేంద్రమోదీకి షడంగి అంటే అభిమానం. ఇద్దరి మధ్య ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే మోదీ కోరుకుని బాలేశ్వర్‌ వచ్చారు. షడంగిని గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. గతంలో రెండుసార్లు బాలేశ్వర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రవీంద్ర జెనా ఈసారి కూడా బిజద అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్నాయి. ఈ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ కుమారుడు నవజ్యోతి పట్నాయక్‌ కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగి సర్వశక్తులు ఒడ్డారు. ఈ ముక్కోణ పోరులో ప్రజలు సన్యాసికే పట్టం కట్టారు.

ఈ విజయం ప్రజలది

గెలుపొందిన షడంగి విలేకరులతో మాట్లాడుతూ తన విజయం ప్రజలదని, తాను నిమిత్తమాత్రున్నని చెప్పారు. ధనబలం, అధికారబలం లేని తాను సేవలకే అన్నివేళలా ప్రాధాన్యమిచ్చానని, తాను పార్లమెంటుకు ఎన్నికైనా జీవనసరళిలో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. మంచి పనులు చేయడం, రాష్ట్ర ప్రజల వాణి చట్టసభలో వినిపించడం ధ్యేయంగా పనిచేస్తానన్నారు. బాలేశ్వర్‌ ప్రాంతాభివృద్ధికి ప్రాధాన్యమిస్తానని, రాజకీయాలకు అతీతంగా సేవలకు పెద్దపీట వేస్తానని తెలిపారు.

సైకిల్‌ సవారీలో ప్రచారం

భాజపా నాయకత్వం ఈసారి ఎన్నికల్లో బాలేశ్వర్‌ లోక్‌సభ స్థానానికి షడంగిని అభ్యర్థిగా చేసింది. ఇతర నేతల మాదిరిగా ఆయన అట్టహాసంగా ప్రచారం చేయలేదు. గొప్ప హామీలివ్వలేదు. తన సైకిల్‌పైనే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి జనాలను కలిశారు. తనను ఆశీర్వాదించాలని విన్నవించారు. ఒకసారి కేంద్ర ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలసి రోడ్‌షోలో పాల్గొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *