Breaking News

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిది

•    సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలి

•    కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్వించదగ్గ విషయం

•    అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలి: రాష్ర్బ  స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి శ్రీమతి తానేటి వనిత

అమరావతి, సెప్టెంబర్ 20: సమాజంలోని కడుపేద వ్యక్తి సైతం సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని, అందుకనుగుణంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలని  స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంధ సేవా సంస్థలనుద్దేశించి మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జాతి పునర్నిర్మాణంలో సేవ ఒక భాగం కావాలని, సేవా భావం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సేవా భావం ప్రతి ఒక్కరిలో పెరిగిందని ఆమె వెల్లడించారు.  పలు స్వచ్ఛంధ సంస్థలు వృద్ధాశ్రమాలు, వికలాంగుల నిలయాలు, అనాధ శరణాలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, కోచింగ్‌ సెంటర్లు ఇలా ప్రతీది నడుపుతూ సమాజాభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు.  దుఖితులు, పీడితులు, అణగారిన వర్గాలు కోసం ప్రతి స్వచ్ఛంధ సంస్థ పనిచేయాలని సూచించారు. మన సమాజంలో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, మూగ, బధిర అలాగే చలన సంబంధమయిన లోపం కలవారు అనేక మంది ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చారు మరి వాళ్ల సంగతి ఏమిటి? అని  ప్రశ్నించి ఆలోచింపజేశారు.  వీళ్లందరిలో ఆత్మన్యూనతా భావం లేకుండా చేయాలని ఎన్జీవోలకు దిశానిర్ధేశం చేశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వారు తమ అంగవైకల్యాలను జయించి జీవితంలో ముందుకు సాగేలా చేయాలని కోరారు. సేవను పొందేవారు సైతం సేవ చేసేవారిగా మార్చాలని అందుకు తగిన ప్రేరణ నింపాలన్నారు. ఏ రక్తసంబంధం లేని వారిని స్వచ్ఛంధ సంస్థలు చేరదీయడం గొప్ప విషయమని అభినందించారు. అయితే సామాజికబాధ్యత పేరుతో  ఒకట్రెండు స్వచ్ఛంధ సంస్థలు చేస్తున్న తప్పులు, పొరపాట్ల వల్ల మిగతా సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. సంపాదించేదాంట్లో కొంత సేవ చేయాలనుకోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో పలువురు ఏదో ఒక రూపంలో సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు.  కష్టాలను దూరం చేసేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి తోడు నీడగా, ఆపన్నహస్తం అందించే విధంగా పలు స్వచ్ఛంధ సంస్థలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందజేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున చేయగలిగింది ఏది ఉన్నా అది చేస్తామని సీఎం పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.  మంచి చేయడానికి ముందుకొచ్చే స్వచ్ఛంధ సంస్థలకు అవసరమైతే నిధులు అందజేస్తామని మంత్రి అన్నారు. సామాజిక బాధ్యత పేరుతో నిధులు పక్కదోవ పట్టినా, దుర్వినియోగం చేసినా సదరు సంస్థలపై, కారణమైన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వమిచ్చే సహాయంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్హనీయమన్నారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె. దమయంతి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని స్వచ్ఛంధ సంస్థలను కలిపించే ప్రయత్నం చేశామన్నారు. సుమారు 117 ఎన్జీవోలు మీటింగ్ కు హాజరవటం మంచి పరిణామమన్నారు. రాష్ట్రంలోని పలు స్వచ్ఛంధ సంస్థలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు. మత్తుపానియాలు మాన్పించేలా, చెడు అలవాట్లు తగ్గించేలా మరికొన్ని ఎన్జీవోలు ఆ దిశగా అవగాహన సదస్సులు కల్పించడంతో పాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రక్తసంబంధం లేని వ్యక్తుల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారిని చేరదీస్తున్న స్వచ్ఛంధ సంస్థలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరే విధంగా చూడాలని తెలిపారు.

కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు డా.కిషోర్ కుమార్, జనరల్ మేనేజర్ రవిప్రకాష్, 13 జిల్లాల శాఖాధికారులు,  రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 117 స్వచ్ఛంధ సేవా సంస్థలు, రాష్ట్రీయ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *