“సైరా.. నర్సింహారెడ్డి” కావాలనే లేట్ గా చూశాను. విపరీతమైన పాజిటివ్స్, నెగటివ్స్ అన్నీ సినిమా కోణంలో కాకుండా వ్యక్తిగత అభిమాన, దురభిమానం ప్రామాణికంగా జరిగే చర్చ అంతా అయ్యాకే చూద్దామని. ఇప్పుడు ఈ సినిమా మీద రివ్యూ కాదు కానీ, నా అభిప్రాయం చెప్తాను.
సినిమా లో ఆహార్యం గురించి, యధాతధ చరిత్ర గురించి పెద్దగా కామెంట్ చేయను కానీ, సినిమా ఒక లోపాల పుట్ట అని మాత్రం చెప్పగలను.
1) సినిమాలో నర్సింహ స్వామికి పూజ జరుగుతూ ఉంటుంది, గ్రూప్ డాన్సర్స్ బూడిదపూసుకోని, రుద్రాక్షలు వేసుకోని నాట్యం చేస్తుంటారు. నర్సింహస్వామి ఉగ్రరూపం కావచ్చు కానీ, వైష్ణవ అంశ, శైవాంశ కాదు, బూడిద, రుద్రాక్ష ఉండవు
2) ఆహోబిలంలో లో విగ్రహాల ధ్వంసం చేసినట్లు చూపించి, రాముడి విగ్రహం చూపించారు అహోబిలం లో ఉంది లక్ష్మీనరసింహస్వామి
3) డల్హోసీ దత్తత రద్దు చట్టం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సమయానికి లేదు.
సరే, ఇలాంటి లోపాలు విషయం వదిలేసినా, కొన్ని విషయాలలో అసలు క్షమించలేము.
కరువు తో అల్లాడుతున్న ప్రాంతం అని చెప్తూ , ఉత్సవం అంత ఘనంగా జరుగింది అని చూపటం చాలా అసహజంగా ఉంది. అంత ఘనంగా చూపించటం, సినిమా కి మనం పెట్టిన ఖర్చు ని చూపించొచ్చు కానీ ఆ ఎమోషన్ కి మ్యాచ్ అవ్వలేదు. సరి, అప్పటికి ప్రేక్షకుడికి కరువు అనే విషయం తెలియదు అని సరిపెట్టుకున్నా, తర్వాత వర్షం కోసం యజ్ఞం అన్నప్పుడైనా అక్కడ కనిపించే విజువల్ లో ఆ కరువు తాలూకు చాయలు, భీబత్సం ,ప్రజల మొహాల్లో ఆ దైన్యం, కరువు బాధ…ఇవన్నీ కనిపించాలి. అవేవీ కనిపించకుండా, చిరంజీవి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను అనే ఉత్సాహం తెర మీద పాత్రల్లో కన్పిస్తే ఎలా ? చిరంజీవి కన్పించే ఫ్రేమ్ కాబట్టి గ్రాండ్ గా ఉండాలి అనుకుంటే ఎలా ??
అసలు పాలెగాళ్ళ తో కోట ను ముట్టడించే యుద్దాలు జరగనే లేదు, నిజానికి పాలెగాళ్ళకు పెద్ద పెద్ద కోటలు లేనేలేవు. ఉయ్యాలవాడ లాంటి వాళ్ళు చేసింది గెరిల్లా యుద్దం, అలాంటిది కోట ముట్టడి చేసినట్లు చూపించటం, సినిమాకి మేము డబ్బులు ఖర్చు పెట్టాం అనే విషయం ప్రేక్షకుడికి తెలియజేస్తుంది కానీ, కథకి ఉపయోగపడదు.
ఇక డైలాగ్స్ విషయానికొస్తే ఇలాంటి సినిమాలకు మంచి పదునైన సంభాషణలు రాసే బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా లో మాత్రం ఇది చిరంజీవి సినిమా అనే విషయం ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని రాసినట్లున్నాడు.
క్లైమాక్స్ లో “నా ఉరి మీ అందరి స్వేచ్చ కోసం , స్వాతంత్రం కోసం ఉత్తేజం తేవాలి..” అంటూ ఒక డైలాగ్ ఉంది. కానీ, ఉయ్యాలవాడ ఉరి నుండి తప్పించుకోని, కొంతమంది తెల్లవాళ్ళని నరుకుతుంటే, ఈయన తల నరుకుతారు, ఆ మొండెం కూడా మరో ఇద్దరిని నరికి నేల కూలుతుంది ( ఇందులో విజువల గా పెద్ద అభ్యంతరం లేదు, సినిమా అంటేనే మోర్ దాన్ ఎ లైఫ్ కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు), కానీ డైలాగ్ పరంగా చూస్తే తప్పు నా ఉరి మీ అందరికి స్వేచ్చా పిపాస రగిలించాలి అన్నతర్వాత , ఉరితో చనిపోకపోతే ఆ డైలాగ్ కి అర్ధం లేదు, ఆ డైలాగ్ నా మరణం అని వస్తే కానీ అది సరిపోదు, ఇది టెక్నికల్ గా హీరో తను చెప్పింది చెయ్యలేదు, హీరో క్లైమాక్స్ లో ఏదైతే చెప్తాడో అది తప్పకుండా చెయ్యాలి, అది హీరో కు తప్పకుండా ఉండాల్సిన లక్షణం, హీరో కి ఉండాల్సిన లక్షణాల గురించి థీసిస్ రాసిన పరుచూరి వారి కథలో ఇలాంటి తప్పు ఎలా జరిగిందో అర్థం కాలేదు
ఏమైనా సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమా మొత్తం మేము చిరంజీవి తో గ్రాండ్ గా సినిమా చేస్తున్నాం, భయభక్తులతో చెయ్యాలి అనే ఆలోచనతో అందరూ శ్రద్దగా చేసినట్లు కన్పించింది. ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి కథ అని ఎవరూ చేసినట్లు లేరు.
ప్రతి సినిమాకి ఇంత ఎకడమిక్ గా రాయాల్సిన పని లేదు. ఈ సినిమా తెలుగు సినిమాని మరో మెట్టు పైకెక్కిస్తుందని నమ్మాను కాబట్టి, అది సాధించటంలో విఫలం అయ్యింది కాబట్టి నేను రాశాను.
బాహుబలి లో తప్పులు లేవా అని అడక్కండి, అందులో చాలా ఉన్నాయి, కానీ అది జానపద సినిమా..అందులో ఏదైనా జరగొచ్చు.. ఇందులో అలా జరగకూడదు
(పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం… , దురభిమానులు, ద్వేషాభిమానులు నాకు సలహాలు ఇవ్వకండి)
mohan ravipati
8047232502