యన్.టి.ఆర్ అంటే కేవలం మూడు అక్షరాలు కాదు. మూడు కాలాలు. భూత, వర్తమాన , భవిష్యత్తు కాలాలు. చరిత్ర అంటే ఆయనదే ! వర్తమానం ఆయనదే ! భవిషత్తు ఆయనదే. యన్.టి.ఆర్ అంటే మూడు ప్రాంతాలు తెలంగాణా, రాయలసీమ, కోస్తాంద్ర. యన్.టి.ఆర్ అంటే ఇంకా చాలా . చాలా ..చాలా. ఒక్క మాటలో చెప్పాలంటే అక్షరాలు మూడే కావచ్చు, కానీ వాటి శక్తి ఏడు సముద్రాలంత..
మూర్తీభవించిన తెలుగుదనం, ఉప్పొంగిన ఆత్మవిశ్వాసం, తెలుగు’వాడి’ వేడి , తెగువ, ధైర్యం, నవ్వు, అందం అన్ని కలగలపి తెలుగుదనాని కి ఒక రూపం పోసి, దేవుళ్ళకు దీటుగా ఒక ఆకారాన్ని సృష్టించి, దేవుడి రూపం ఎలా ఉంటుందో తెలియని ప్రజలకు అతని రూపాన్ని చూపించాలి అనే ఆలోచనతో , మన తెలుగు నేల పై ప్రత్యేక అభిమానంతో బ్రహ్మ సృష్టించిన రూపం,
అందుకే ఈ రోజు గుర్తు వస్తే చాలు, తెలుగు వాడి ఛాతీ ఆరంగుళాలు పెరుగుతుంది, పౌరుషం తో చెయ్యి మీసం మీదకు వెళ్తుంది . వాడు మన సాటి తెలుగువాడు అనే గర్వం కళ్ళల్లో కనిపిస్తుంది.
చిన్నప్పుడు ఏ సినిమా లో అయినా కొట్టేది ఎన్టిఆర్, కొట్టించుకొనేది దొంగోడు, ఆయన ముఖం కూడా గుర్తు తెలియక ముందే ఆయన పేరు గుర్తిండి పోయింది. మాకు తెలిసిందంతే., మాకు హీరో అంటే NTR, సరిగ్గా చెప్తున్నా NTR అంటే హీరో కాదు, హీరో అంటే ఎన్టిఆర్. మాకు బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, శక్తి మాన్, అన్నీ ఎన్టిఆర్. ఈ మాన్ లు అన్నిటినీ మించిన హి-మాన్ NTR..
“నిజం ! చెప్పమంటారా ! అబద్దం చెప్పమంటారా” అని రాజు గారినే గడుసు గా అడిగే తెగువున్న తోటరాముడు. దేవుడు కి కూడా దుఃఖం ఉంటుంది , అని దేవుడిని కూడా మనిషిని చేసి, ఆ దేవుడి మీద మనిషికి మరింత దగ్గర చేసిన రాముడు, తిడుతున్నా సహనంతో ఉండాలి, అని వక్క పలుకులు లెక్క పెడుతూ పక్కన పెట్టుకుంటూ లౌక్యం ప్రదర్శిస్తూనే, సమయం వచ్చినప్పుడు లెక్క సరిచేసిన కృష్ణుడు. ఆత్మాభిమానంలో ఎవ్వరికీ అందనంత ఎత్తు ఉండాలి, మన ఆత్మాభిమానం కోసం యోధుడులా పోరాడాలన్న సుయోధన సార్వభౌముడు .
వెెండితెర మీద బొమ్మలా కాకుండా, తానే వెండితెరై నిర్మాతలు కనకవర్షాన్ని, ప్రేక్షకులకు ఆనందామృతాన్ని పంచిన తారకరాముడు, సినిమా తెర ఉన్నంత కాలం, తెలుగువాడున్నంత కాలం అలా ప్రకాశించే అత్యంత ఎత్తున ఉన్న వెండితార
అందుకే నా పరిపూర్ణ పరిశుద్ద హృదయంతో నిన్ను కొలుచు భాగ్యం నాకెప్పుడూ … ఉండాలని ఆశిస్తూ. మీ అసంఖ్యాక అభిమానులలో ఒకడు
……..మోహన్ రావిపాటి………….