Breaking News

ఎన్టీఆర్ కి కులపిచ్చి ఉందా ?

ఎన్టీఆర్ కి కులపిచ్చి ఉందా ?

ఎన్.టి.ఆర్. కులతత్వ వాది అని ఇంతవరకూ ఏ రాజకీయ నేతగానీ, పాత్రికేయుడు గానీ విమర్శించడానికి సాహసించలేదు. అలాంటిది శేఖర్ కొట్టు గారు ఆయనకు కూడా కుల ముద్ర వేస్తున్నారు. సినిమాలలో ఉండగా ఆయనకు శాశ్వత సంగీత దర్శకుడు టి.వి. రాజు అనేది అందరికీ తెలుసు. పాటల రచయితగా సి. నారాయణ రెడ్డి ని తన ‘గులేబకావళి కథ’ లో తెలుగుతెరకి పరిచయం చేసింది ఎన్ఠీఆర్. అధికారంలోకి రాగానే ఆ కవి ఔన్నత్యాన్ని, భాషా పాటవాన్ని గుర్తించి సినారెకి ఎంతో ప్రాముఖ్యమిచ్చి, ఆయన్ని ఎన్నెన్నో పదవులలో నియమించింది ఎన్ఠీఆర్ కాదా ? తనతో కలిసి ‘రాజు- పేద’, ‘జయసింహ’, ‘తెనాలి రామకృష్ణ’ వంటి కొన్ని సినిమాలలో నటించిన 
డా. కామరాజు నరసింహారావుని తాను అధికారంలోకి రాగానే వైద్య ఆరోగ్య శాఖకు డైరెక్టర్ గా నియమించాడు ఎన్ఠీఆర్. తన కమ్మ కులంలో ఉద్దండులైన ప్రభుత్వ డాక్టర్లు ఎందరో ఉన్నత స్థానాలలో ఉన్నా వారందరినీ కాదని ఆయన ఒక బ్రాహ్మణ డాక్టర్ అయిన 
డా. నరసింహారావునే ఆ పదవికి ఎంపిక చేయడంలో ఎన్ఠీఆర్ కులపిచ్చి మీకు కనిపించిందా Sekhar Kottu గారూ ? ఇక ఆయన సినీ అభిమానులలో కమ్మేతరులకే ఆయన ఎప్పుడూ పెద్ద పీట వేయడం మీకు తెలియనిదా ? ఆయన వీరాభిమానులైన కారణంగానే టికెట్స్ దక్కించుకుని గెలిచిన బుడే ఖాన్ (గుంటూరు), జంటనగరాలలోని శ్రీపతి రాజేశ్వర్,డా. అల్లాడి రాజకుమార్ వంటి ముస్లిం, మున్నూరు కాపు వర్గాల వారిని అడిగి చూడండి రామారావుకి కులపిచ్చి ఉందో లేదో ? తాను ముఖ్యమంత్రిగా ఉండగా బిసిలకు, యస్సీ, ఎస్టీలకు, కాపులకు, ముస్లిం లకు మంత్రివర్గంలో వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు, మహిళలకు తగినంత ప్రాముఖ్యం లభించగా తన స్వకులం నుంచి ఎందరో ఔత్సాహికులు మంత్రులయ్యేందుకు పోటీపడినా, వారందరినీ కట్టడి చేసి, పార్టీకి కుల ముద్ర పడకుండా ఎంతగానో జాగ్రత్తలు తీసుకున్న ఎన్ఠీఆర్ నా మీరు కులవాది అంటున్నది ? ఎన్టీఆర్ అలా పక్కాగా వ్యవహరించినందుకు కాదా టీడీపీ నేటికీ కాపులు, బిసిలు, అణగారిన వర్గాల పార్టీగా గుర్తింపబడుతున్నది ? సాధారణంగా అన్ని పార్టీల నేతలు ఆ యా నియోజక వర్గాలలో గెలిచే అవకాశమున్న కులాల వారికి, బాగా డబ్బు పెట్టుబడి పెట్టగల వారికి టికెట్లు కేటాయిస్తారు. దీనికి భిన్నంగా ఎన్ఠీఆర్ అణగారిన వర్గాలవారిని, బిసిలను, ఎస్సీలను జనరల్ నియోజక వర్గాలలో పోటీ చేయించి గెలిపించుకోవడం విశేషం కాదా ? తెనాలి పార్లమెంటుకు బిసి మహిళ ‘ఊర్వశి’ శారదకు టికెట్ ఇఛ్చి గెలిపించుకోవడం చెప్పుకోదగినది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ఠీఆర్ కి కులపిచ్చి లేదనీ, టిడిపిని దెబ్బతీసే ఉద్దేశంతో ప్రత్యర్థులు ఆయనపై కులపిచ్చి ముద్ర వేశారని రుజువు చేయగల సమాచారం ఎంతైనా ఇవ్వవచ్చు. ఇంతెందుకు ? రామారావుకి కులపిచ్చి ఉన్నదనే వాళ్ళు ఒక్కటి ఆలోచించండి. రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా తాను కాక మరో కమ్మ మంత్రి, నలుగురు రెడ్లు మంత్రులుగా ఉండి, కాబినెట్ లో ముస్లిం, దళిత, బిసిలకు వారి జనాభాకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. 1989 లో టిడిపి ఓడిపోగానే డా. మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని అంతకు ముందరి ఎన్ఠీఆర్ మంత్రివర్గ నిర్మాణంతో పోల్చి చూడండి. ఎవరికి కులపిచ్చి ఉన్నదో మీకే అర్థం అవుతుంది. కాబినెట్ ని మొత్తం దాదాపుగా రెడ్లతో నింపేశారాయన. కాబినెట్ లో ఉండేందుకు అర్హుడైన ఒక్క దళితుడూ దొరకలేదాయనకి. పేరుకే ఒకరిద్దరు బిసిలు. అదీ కులపిచ్చి అంటే ! మీరు అబద్ధాలను నిజాలు చేయాలన్నా సాధ్యం కాదు. చరిత్ర చింపి వేస్తే చిరిగిపోదు. చెరిపేస్తే చెరిగిపోదు Sekhar Kottu గారూ ! మీరు రామారావుకి లేని గజ్జి అంటగడితే బాధకలిగి ఇదంతా రాశాను. ఆయనేం పరమ పవిత్రుడని నేననను. నేటి రాజకీయ నేతలతో పోలిస్తే ఆయన వెయ్యిరెట్లు మెరుగు. కనుక మీరు ఆయనకు లేని కుల తత్త్వాన్ని ఆయనకి అంటగట్టవద్దు. తన కులంపై అభిమానం ఉండడం వేరు. కుల తత్త్వం ఉండడం వేరు.గమనించ గోర్తాను. ” Most importantly NTR was Casteist ” అని మీరు రాయడం తప్పు.

— మీ.. రవీంద్రనాథ్.

9849131029

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *