Breaking News

సరికొత్తగా బారిష్టర్ పార్వతీశం

barister1 barister2 barister3 barister4 barister5 barister6 barister7 barister8

తెలుగు వారికి నాటకాలు అంటే విపరీతమైన అభిమానం, బళ్ళు కట్టుకొని వెళ్ళి మరీ టికెట్టు నాటకాలను పోషించిన కళాపోషకులు. ఒకప్పుడు నాటకం ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ అటే పరుగెత్తేవి. అలాంటిది గత మూడు దశాబ్దాలుగా ఆదరణ కోల్పోతూ వస్తుంది. టికెట్టు కొని నాటకం చూసే ప్రేక్షకులే కరువయిపోయారు. ఏవో కొన్ని పరిషత్తులు నాటకోత్సవాలు నిర్వహించటం, నాటకాభిమానులు చూసి ప్రశంసించటం తప్ప , సాధారణ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అప్పుడప్పుడు  ` పడమటి గాలి   ` మిస్. మీనా ` లాంటి కొత్త నాటకాలు ఆదరణ పొందినా పూర్తి గా సమ్మోహితులను చెయ్యలేకపోయాయి. మిగతా భాషల్లో ఆదరణ పొందిన సాహిత్యాన్ని ( నవలలు, కథలు, కథానికలు ) నాటకాలుగా మార్చి తద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందే ప్రయత్నాలు సాగి విజయవంతం అయ్యాయి., కానీ తెలుగులో అలాంటి ప్రయోగాలు పెద్దగా జరగలేదు. అలాంటి సమయంలో అత్యంత ప్రజాదరణ పొంది, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న ` బారిష్టర్ పార్వతీశం ` నవలను నాటకంగా మార్చే ప్రయత్నం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం.

1924 లో శ్రీ  మొక్కపాటి నర్సింహ శాస్త్రి  గారు రాసిన ఈ నవల అప్పటి కాలమాన పరిస్త్జితులను మనకు తెలియచేస్తూనే , వ్యంగ్యంగా మొదలయ్యి, విజయవంతమైన ఒక బారిష్టర్ కథ . మూడు భాగాలుగా దాదాపు 800 పేజీల నవలను గంటన్నరలోకి కుదించి అందులో ఉన్న ఆత్మను ప్రేక్షకుల కళ్ళముందుంచటం నిజంగా సాహసమే. కానీ డిల్లీ కి చెందిన ప్రయోగం థియేటర్ గ్రూప్ వారు ఆ సాహాసానికి పూనుకోవటమే కాదు , సాధించి చూపించారు కూడా. ఇది నిజంగా ఒక గొప్ప ప్రయోగమే. పేరులోనే ప్రయోగాన్ని నింపుకున్న సంస్థ ముందుగా ఈ నాటకాన్ని హిందీ లో ప్రదర్శించి అది ప్రేక్షకాదరణ పొందిన తర్వాత, తెలుగులో ప్రదర్శించటం విశేషం .  నాటకం అంటే కేవలం ఒక డ్రాయింగ్ రూమ్ సెట్టింగ్, ఒక కుర్చీ, సోఫాసెట్ కాకుండా, ఈ నాటక ప్రదర్శనకు సాంకేతికత జోడించటంతో ఇది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది , దీనికి చేసిన సౌండ్ డిజైనింగ్, డిజిటల్ తెరల సహాయంతో  బ్యాగ్రౌండ్ దృశ్యాలను  ప్రదర్శించటంతో ప్రేక్షకులకు ఒక రియల్ టైమ్ అనుభవం కళ్ళముందుటుంది.

బారిష్టర్ పార్వతీశం కథే అసలు ఎన్నో సన్నివేశాల సమాహారం. నైసర్గికంగా చూసుకుంటే  ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో ప్రారంభం అయిన ప్రయాణం కొలంబో, మాంచెష్టర్ ,లండన్ మీదుగా తిరిగి చెన్నై చేరుకుంటుంది. ఎన్నో రకాల వాతావరణాలు, విభిన్నమైన బ్యాగ్రౌండ్స్,  భిన్న సంస్కృతులు ఇవన్నీ ఒక నాటక ప్రదర్శనలో ఒకే సారి, చూపించటం సామాన్యమైన విషయం కాదు.  ఇవన్నీ ఒక ఎత్తైతే , బారిష్టర్ పార్వతీశం రైలు లో ప్రయాణం చేస్తున్నప్పుడు , ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాతావరణాన్ని, డయాస్ మీద చూపించటం నిజంగా డిజిటల్ అధ్బుతమే.  దానికి పర్ఫెక్ట్ టైమింగ్, లైటింగ్, డిజిటల్ స్క్రీనింగ్ , వీటన్నిటి మధ్య కో ఆర్డినేషన్ చాలా అవసరం. ఇందులో ఎక్కడ ఏ చిన్నపాటి తేడా వచ్చినా అది రసాభాస గా మారే ప్రమాదం ఉంది.

ఇక కథాంశం విషయానికొస్తే , మొదటి చాలా అమాయకంగా, కనీస లోక జ్ఞానం  కానీ  ఇంగ్లీష్ పరిజ్ఞానం  కానీ  లేని పార్వతీశం. తనకు తానుగా ఒంటరిగా లండన్ వరుకు వెళ్ళి, అక్కడ బారిష్టర్ కోర్స్ చదివి, తిరిగి మొగల్తూరు చేరుకొని, అక్కడనుండి చెన్నై లో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించి, అప్పుడు జరుగుతున్న జాతీయోద్యమానికి మద్దతుగా తన ప్రాక్టీస్ ను కూడా కాదనుకొని, అప్పటి జాతీయనాయకులతో కలిసి ఉద్యమించి, సర్వ స్వతంత్ర భారత్ ని సాధించటంతో కథ ముగుస్తుంది.  ఈ కథలో పార్వతీశం జీవితంలో తారసపడిన వివిధ వ్యక్తులు, విభిన్న సంస్క్రుతుల వాటి మధ్య బేధాలు, దాని ద్వారా పుట్టే హాస్య సన్నివేశాలు ఇవన్నీ డయాస్ మీద ఆవిష్కృతమయ్యాయి.  ఐర్లాండ్ అమ్మాయితో ప్రేమ లో పడిన సందర్భంలో ప్రణయ సన్నివేశాలు , భారతీయుడిగా ఇంగ్లాండ్ లో ఎదుర్కొన్న అవమానాలు  , ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని  డయాస్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. ఇందులో సాంకేతికాంశాలను వినియోగించుకోవటమే కాకుండా, వాటిని వినియోగించుకున్న విధానం కూడా అధ్బుతమే. ఉదాహరణకు పార్వతీశం రైల్లో కూర్చొనే సన్నివేశంలో డిజిటల్ తెరమీద ఉన్న రైలు కిటికీ ఖచ్చితంగా పార్వతీశం కూర్చున్న కుర్చీ దగ్గరకే వస్తుంది, ఆ ఒక్క కుర్చీనే కాదు, మిగతా పాత్రధారులు కూర్చున్న కుర్చీలు కూడా ఖచ్చితమైన కొలతలో సరిపోతాయి, ఇవన్నీ అక్కడ అమర్చటానికి ఏ మాత్రం సమయం కూడా తీసుకోలేదు,. డయాస్ ముందు భాగంలో నాటకం జరుగుతుండగానే వెనక లైటింగ్ లేని భాగంలో వీటి అమరిక క్షణాల్లో జరుగుతుంది. అంటే దీనికోసం వాళ్ళెంత కఠోరశ్రమ చేశారో అర్థం అవుతుంది.  మరో సన్నివేశంలో ఐర్లాండ్ యువతి ని పార్వతీశం కౌగలించున్నప్పుడు వెనుక బ్యాక్ డ్రాప్ లో వాళ్ళిద్దరి నీడ కన్పించే సన్నివేశం అసలు డయాస్ మీద ఎలా సాధ్యం అయ్యింది అనుకోనేంత గొప్పగా ఉంది. ఇది లైటింగ్ ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో సరిగ్గా చెప్పిన దృశ్యం అనుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సన్నివేశం అధ్బుతమే. ఇక నటన విషయంలో అయితే పార్వతీశం గా నటించిన తూము శివప్రసాద్, అసలు పార్వతీశం అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఉన్నాడు, అతని వస్త్ర ధారణ కానీ, వాచకం కానీ అద్భుతంగా ఉన్నాయి, అతనే నాటక సృష్టి కర్త కాబట్టి, పార్వతీశం ఎలా ఉండాలి అని అనుకున్నాడో సరిగ్గా అలాగే  ఉన్నాడు.  ఇక మిగతా పాత్ర ల్లో  ఐర్లాండ్ ప్రియురాలి గా షాపిన్ భాటియా , ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినా కేవలం ఈ నాటకం కోసం తెలుగు నేర్చొకొని మాట్లాడటం ఒక విశేషం, అంతే కాదు, సాధారణంగా హిందీ వారు తెలుగు మాట్లాడే సమయంలో ఉండే యాస కాకుండా ఇంగ్లీష్ వారు తెలుగు మాట్లాడే సమయంలో ఉచ్చరించే యాసలో మాట్లాడటం నిజంగా గొప్ప విషయమే.  ఇక మిగతా పాత్రల్లో నటించిన నవీన్, గోవింద్, ఆషా,  నవ్య ,రామ్మోహన్, కృష్ణ, వీళ్ళ నటన కూడా ఎక్కడా నటించినట్లు కాక, సహజంగా ఉంది.  లైటింగ్ ని పర్వవేక్షించిన నరేష్ గారిని , బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డిజైన్ చేసిన  ప్రవీణ్ కుమార్ , దాన్ని ప్రజెంట్ చేసిన లోహిత్ వ్యాస్ నిజంగా అభినందనీయులు.

నవల లో మొదటి రెండు భాగాలకు పూర్తి న్యాయం చేసినా, మూడవభాగం మాత్రం ఐదు నిమిషాలలోనే ముగించటం కొంచెం నిరాశపరుస్తుంది, బహుశా నాటకంలో బిగువు తగ్గకుండా ఉండటం కోసం అలా చేసారేమో !! ముఖ్యంగా వస్త్రధారణ లో ఆంధ్ర నేటివిటీ ఉంటే ఇంకొంచెం బాగుండేది.  ప్రారంభంలో వచ్చే ఉపనయనం సన్నివేశంలో కానీ, పార్వతీశం లండన్ నుండి తిరిగివచ్చిన తర్వాత ఇంటి దగ్గర స్వాగతం పలికే సన్నివేశాలలో  కానీ ఆంధ్రా సాంప్రదాయం కాకుండా, ఉత్తర భారతీయ సాంప్రదాయాలు ఎక్కువగా కనిపించాయి . ఇలాంటి అతి చిన్న చిన్న లోపాలు వదిలేస్తే మిగతా నాటకం అంతా అమోఘం అనే చెప్పాలి .

ముఖ్యంగా అభినందిచాల్సింది ఈ నాటక సృష్టికర్త, దర్శకుడు, రచయిత, ముఖ్య పాత్రధారి అయిన తూము శివప్రసాద్ తునిలో జన్మించి , డిల్లీ  నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో థియేటర్ ఆర్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇతని కృషి అమోఘం, ప్రస్తుతం జైపూర్ యూనివర్శిటీలో థియేటర్ ఆర్ట్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ముందుగా దీన్ని హిందిలో ప్రదర్శించి అది ఆదరణ పొందిన తర్వాత తిరిగి తెలుగులోకి అనువదించి, అదే స్థాయి ఆదరణ పొందేలా చేశాడు. ఇక దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, హిందీ లో చూసి దాన్ని తెలుగులోకి తీసుకురావాలనే తలంపుతో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారితో కలిసి, దీన్ని తెలుగులోకి అనువదించటంకోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చెయ్యకుండా కష్టపడ్డ దేవరకొండ సుబ్రహ్మణ్యంగారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది . ఇది వైజాగ్ లో ప్రదర్శితమవ్వటానికి కారణం అయిన యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి.  ఇలాంటి నాటకానికి వేదిక అయినందుకు వైజాగ్ వాసులు నిజంగా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఇలాంటి ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతా ప్రదర్శించబడాలి. దీనిద్వారా అయినా మన తెలుగు సాహిత్యంలో ఉన్న మరిన్ని నవలలు నాటకరూపం సంతరించుకుంటాయని అశించవచ్చు.

మోహన్.రావిపాటి

9000864857

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *