Breaking News

అబద్ధం వందసార్లు చెబితే నిజమైపోదు:జగన్‌

ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష తెదేపా నాయకులు తమపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. అనవసర చర్చలతో సభాసమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ లేవనెత్తిన ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం చెప్పారని, కానీ స్పీకర్‌ పెద్దమనసుతో మళ్లీ సత్యప్రసాద్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. మంత్రి సమాధానం చెప్పిన తర్వాత మళ్లీ అవకాశం అడగడమేంటని ప్రశ్నించారు. సభ ప్రారంభమై దాదాపు గంటసేపైనా ఇప్పటి వరకు కేవలం 3 ప్రశ్నలకే సమాధానం చెప్పగలిగామని, మిగతా వాటికి కూడా బదులిచ్చేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.

సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

తెదేపా శాసనసభపక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటూ సభప్రారంభానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. సభాహక్కులు కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *