Breaking News

ఇస్తావా..చస్తావా

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తన సహజ సిద్ధ లక్షణాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా చీరాలలో రెచ్చిపోయారు. ప్రభుత్వం ఇంటర్వ్యూల ద్వారా నియమించిన గ్రామ వలంటీర్లను కాదని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి తనను గెలిపించిన టీడీపీ కార్యకర్తలకు పోస్టులు ఇవ్వాలంటూ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా తాను వెంట తెచ్చిన లిస్టులోని పేర్లున్న వారికి పోస్టులు ఇవ్వకుంటే అంతు చూస్తానంటూ ఇన్‌చార్జి ఎంపీడీఓను బెదిరించినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంపీడీఓ కార్యాలయంలోనే బలరాం తిష్ట వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు.

అంతా ఎమ్మెల్యే హోదాలో అధికారులతో చర్చించేందుకు మండల పరిషథ్‌ కార్యాలయానికి వచ్చారని భావించారు. కానీ ఆయన తన మందీ మార్బలం వెంట తెచ్చుకుని నిబంధనలకు విరుద్ధంగా గ్రామ వలంటీర్ల పోస్టులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని హంగామా సృష్టించారు. ఒకదశలో భయపడిన అధికారులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎంపీడీఓను నిర్బంధించి తాము చెప్పిన వారికి ఇస్తావా.. చస్తావా..అంటూ బెదిరించడంతో పాటు దుర్బాషలాషలాడినట్లు తెలిసింది. చీరాలకు తాను ఎమ్మెల్యేనని, తాను చెప్పింది వినాలంటూ… లేకుంటే ఏ మవుతారో తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.

తనపై ఓడిన వ్యక్తి చెప్పిన వారికి ఎలా పోస్టులు ఇస్తారంటూ, అతని మాట ఎందుకు వింటున్నారంటూ ఆమంచిని ఉద్దేశించి పరుష పదజాలం వాడినట్లు సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసిన వారి పేర్లు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఒక దశలో ఎంపికలో తమ వారి పేర్లు లేకపోతే చీరాలలో ఏం చేస్తామో చూడాల్సి వస్తుందంటూ బెదిరించడంతో అధికారులు దిక్కు తోచక తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామన్నారు. మీరు ఇచ్చిన లిస్టు కూడా ఉన్నతాధికారులకు పంపిస్తామని బలరాంతో చెప్పారు. ఆయన వెంట వచ్చిన టీడీపీ నాయకులు..అధికారులు చెప్పింది వినకపోగా అంతు చూస్తామంటూ హెచ్చరించారు.

ఇదీ..జరిగింది
ప్రభుత్వం చీరాల మండలానికి కేటాయించిన 449 వలంటీర్‌ పోస్టులకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 1789 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఈ నెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్వ్యూ చేసి అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి ఈ పాటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించారు. దాదాపు ప్రక్రియ పూర్తయింది. మంగళవారం నుంచి వలంటీర్లుగా ఎంపికైన వారికి శిక్షణ అందించనున్నారు. ఈ దశలో టీడీపీ నాయకులు మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చి హల్‌చల్‌ చేశారు. కేవలం ఉనికి కోసమే ఈ హంగామా..అని చీరాలలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు వలంటీర్లను నియమించగా చివరి నిమిషంలో వచ్చిన ఎమ్మెల్యే బలరాం కనీసం వంద గ్రామ వలంటీర్ల పోస్టులనైనా టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని పట్టుబట్టారు.

తమ చేతుల్లో లేని వ్యవహారం.. అని అధికారులు చెబుతున్నా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బలరాం పక్కన ఉన్న టీడీపీ నాయకులు అధికారులపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. వలంటీర్లుగా ఎంపికైన వారు తమ అనుకూలమైన గ్రామాల్లో ఎలా పనిచేస్తారో చూస్తామని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. తమ వారు కాకుండా మరొకరు వలంటీర్‌గా వస్తే చూస్తూ ఊరుకోమని బహిరంగంగానే బెదిరింపులు పాల్పడటం గమనార్హం. రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలోనే బలరాంతో పాటు టీడీపీ నాయకులు తిష్ట వేసినట్లు సమాచారం. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం టీడీపీ కార్యకర్తలు లోపలకు అనుమతించకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *