Breaking News

ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే…….

 

        ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వస్తుంది. ఆయా పార్టీల ప్రచారం నుంచి పోలింగ్ వరకు జరుగుతున్న అనేక అక్రమాలకు విరుగుడుగా ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమల్లోకి తెచ్చింది. క్రమశిక్షణాహితంగా ఎన్నికలు జరిగేలా చూడటానికి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ నియమావళిని రూపొందించింది. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎలా వ్యవహారించాలనే దానిపై విధి నిషేధాలను పొందుపరిచింది. ఎన్నికల ప్రణాళికలు, ప్రసంగాలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు ఇలా అన్నింట్లో ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

        రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమలు చేస్తోంది. నియమావళి ఉల్లంఘన జరిగినట్టు ఎవరైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే కోర్టును ఆశ్రయించవచ్చు. వివిధ యంత్రాంగాల ద్వారా ఎన్నికల సంఘం నిబంధనల అమలును పరిశీలిస్తోంది. వివిధ విభాగాలతో ఉమ్మడి కార్యాచరణ బృందాలను, ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా సి-విజిల్ మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. దీనిద్వారా అక్రమాలపై ఆడియో, వీడియోల రూపంలో ఫిర్యాదు చేయవచ్చు.

        ఎన్నికల సంఘం వివిధ అంశాలను నేరాలుగా పరిగణిస్తోంది. కులం, మతం, భాష ఆధారంగా విభజన, విభేదాలు, ఘర్షణలు సృష్టించడం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. వీటి ఆధారంగా ఓట్లు అడగడం, ప్రార్థనా స్థలాలను ప్రచారానికి వాడుకోవడం కూడా నేరంగానే గుర్తిస్తారు. ఓటర్లకు లంచాలు ఇవ్వడం, అవినీతి వ్యవహారంగానే కాకుండా ఎన్నికల నేరంగా కూడా పరిగణిస్తారు. ఓటర్లను భయపెట్టడం, మద్యం పంపిణీ చేయడం ఎన్నికల నేరం కిందకే వస్తుంది. పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలి. ఆ సమయంలో సభలు నిర్వహించడం కూడా ఎన్నికల నేరమే. నియమావళిని ఉల్లంఘినవారికి ఈసీ నోటీస్ పంపుతుంది. కొన్ని విషయాల్లో వారు క్షమాపణ చెబితే దాంతో సరిపెడుతుంది. మరికొన్ని సమయాల్లో నాయకులను మందలించడం, ప్రచారానికి వెళ్లకుండా నిలిపివేయడం వంటి చర్యలను కూడా తీసుకుంటుంది. ఇంకొన్ని అంశాల్లో కేసులు పెట్టాలని సూచిస్తుంది.

        పార్టీలు చేసే విమర్శలు, విధానాలు, కార్యక్రమాలు, ప్రస్తుతం, గత పనితీరుకే పరిమితం కావాలి. ఓట్లు పొందడానికి కులం, మతం వంటి భావాలను ప్రచారం చేయకూడదు. ఆధారాలు లేని అంశాలను ప్రాతిపదికగా చేసుకొని అభ్యర్థులను విమర్శించకూడదు. ఓటర్లకు లంచాలు ఇవ్వడం, ప్రలోభపెట్టడం నిషేధం. తమకు ఇష్టంలేని అభిప్రాయం చెప్పారనే కారణంతో ఏ వ్యక్తుల ఇంటెదుట కూడా ధర్నాలు, పికెటింగ్ లు చేయకూడదు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయడానికి వీలుగా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలు, సమయం వంటి వివరాలను స్థానిక పోలీసులకు ముందుగానే తెలియచేయాలి. ఇద్దరుకన్నా ఎక్కువమంది అభ్యర్థులు ఒకేమార్గంలో ప్రదర్శన జరపాలని భావిస్తే సంబంధిత నిర్వాహకులు ముందుగానే సంప్రదింపులు జరుపుకోవాలి. ఎలాంటి ఘర్షణకు అవకాశం ఇవ్వకూడదు. పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వర్తించడం కోసం అన్ని పార్టీల ధ్రువీకరణ పొందిన కార్యకర్తలకు గుర్తింపు బ్యాడ్జీలు ఇస్తారు. వీటిపై పార్టీ పేరు, గుర్తు, అభ్యర్థి పేరు ఉండకూడదు. ప్రభుత్వం నడుపుతున్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా కఠిన చర్యలను రూపొందించింది. మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల వ్యవహారాలతో ముడిపెట్టకూడదు. అధికార యంత్రాంగాన్ని వినియోగించకూడదు. ఎన్నికల్లో విజయాలు మెరుగయ్యేలా ప్రభుత్వ విజయాలపై ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వ ప్రసారసాధనాలను, వాహనాలను వినియోగించకూడదు.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *