హైదరాబాద్:
ఐటీ.. మళ్లీ ఇంటి నుంచే పని
‘ఒమిక్రాన్’ ముప్పుతో పూర్తిస్థాయిలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలు
కంపెనీల కార్యాచరణ
ఐటీ ఉద్యోగులు మళ్లీ పూర్తి స్థాయిలో ‘ఇంటి నుంచి పని’ (వర్క్ ఫ్రమ్ హోమ్) పద్ధతికి మారిపోతున్నారు. కొవిడ్ రెండో దశ కేసులు తగ్గాక, కార్యాలయాలకు కొద్దిమంది ఐటీ ఉద్యోగులు వస్తున్నారు. కొవిడ్ ‘ఒమిక్రాన్’ ముప్పు పెరుగుతున్నందున వీరినీ ఇంటి నుంచే పనిచేయాలని సంబంధిత సంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. సోమవారం నుంచే కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పనిచేయటం ప్రారంభించగా, బుధవారం నుంచి మరికొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇదే విధంగా సూచించినట్లు స్థానిక ఐటీ పరిశ్రమ వర్గాలు వివరించాయి. ‘ఒమిక్రాన్’ ముప్పు ఇంకా పెరిగితే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో కంపెనీలు, సిబ్బందికి ఏడాదిన్నర అనుభవం ఉంది. ఐటీ ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు, ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనువైన సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నందున, కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు