మా తెనాలివాళ్లకి సాధారణంగా ప్రాంతీయాభిమానం ఎక్కువ. దానికెన్నెన్నో కారణాలు. ఆ విషయాన్ని అటుంచి తమ జన్మస్థలి తెనాలి రూపురేఖలు గతంలో ఎలా ఉండేవో తెలుసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. 48 ఏళ్ళ క్రితం 1972 లో తెనాలి పట్టణం ఎలా ఉందో రేఖామాత్రంగా తెలిపే ఈ అరుదైన విడియో చూసి తెలుసుకోండి. ఈ విడియో చిత్రీకరించిన సందర్భం తెనాలి ముత్తెంశెట్టి పాలెం లో వైకుంఠపురం పేరిట తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ అనే ఒక భక్తుడు శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించి, ఒకప్పటి రాష్ట్ర మంత్రి అనగాని భగవంతరావు చేత ఆవిష్కరణ జరిపించటం. గతంలో ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్న బాలనరసింహరావు గౌడ కు జిల్లా కోర్టులో యావజ్జీవ శిక్ష పడగా, తనకు ఆ కేసునుంచివిముక్తి లభిస్తే ఆలయం కట్టిస్తానని ఆయన వేంకటేశ్వర స్వామి కి మొక్కుకున్నాడట. హైకోర్టులో సరైన సాక్ష్యాధారాలు దొరకక ఆ హత్య కేసునుంచి ఆయనకు విముక్తి లభించిన కారణంగానే ఈ దేవస్థానం నిర్మాణం జరిగింది. ఇక ఆ విషయం అలా ఉంచితే ఈ ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వాహకులు ఈ నలుపు- తెలుపు విడియో చిత్రీకరణ కోసం అప్పటి మద్రాసు నగరం నుంచి ప్రత్యేకంగా ఓ విడియోగ్రాఫర్ ని రప్పించారట. ఈ విడియోలో అప్పటి తెనాలి రైల్వే స్టేషన్సౌత్ కాబిన్, ఓవర్ బ్రిడ్జి, పాత బస్ స్టాండ్, రణరంగచౌక్ లోని 1942 క్విట్ ఇండియా ఉద్యమ మృతవీరుల స్తూపాలు, పాతవంతెన దగ్గర ఆలపాటి వెంకట్రామయ్య మునిసిపల్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన మునిసిపల్ ఆఫీసు మరియు షాపింగ్ సముదాయం, మార్కెట్ ఏరియా, గాడిబావి వద్ద గల రామాలయం ( దొంగరాముడి గుడి), మెయిన్ రోడ్, గాంధీచౌక్, బోస్ రోడ్, కోతులచెట్టు సెంటర్, వీనస్ టాకీస్, దాని ఎదురుగా నవయుగ హోటల్, బోస్ రోడ్ లోని గుంటూరుజిల్లా కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ప్రధాన కార్యాలయం, దాని పక్కనే ఉన్న రామాలయం, చిట్టి ఆంజనేయస్వామి ఆలయం వంటివన్నీ 1972 లో ఎలా ఉండేవో రేఖామాత్రంగా చూపిన ఈ విడియోలో, ఆ తరువాత వైకుంఠపురం ఆలయ ప్రారంభోత్సవం దృశ్యాలు చిత్రీకరించారు. చిత్రీకరణ తీరులో కొంత నాణ్యత లోపించినా 1972 లో మన తెనాలి ఎలావుంటుందో తెలుసుకునేందుకు ఈ విడియో చూడటం తప్ప మరో మార్గం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం? చూసెయ్యండి త్వరగా !!!
–మీ..ముత్తేవి రవీంద్రనాథ్
https://www.youtube.com/watch?v=7-HDkJpp2ZI