Breaking News

దేవుని బిడ్డ..జగన్‌

సాధారణంగా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పైవారిని కింది స్థాయి నాయకులు ఒకరితో పోటీ పడి.. వారిని ఇంద్రుడితోనో, చంద్రుడితోనో పోల్చడం చూస్తుంటాం. అయితే ప్రభుత్వ కార్యక్రమంలో సీనియర్‌ ఐఏఎస్‌లు అలా చేయడం అత్యంత అరుదు. సోమవారం విజయవాడలో గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో.. రాష్ట్ర పురపాలక కమిషనర్‌ జేఎస్సార్కేఆర్‌ విజయకుమార్‌ సీఎం జగన్‌ను వేదికపై స్తుతించిన తీరు సభికులను విస్మయానికి గురిచేసింది! ‘‘ఇప్పటి వరకూ మనకు ‘ఫ్రెంచ్‌ రివల్యూషన్‌, అక్టోబరు విప్లవం’ లాంటివి మాత్రమే తెలుసు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయ వ్యవస్థను సంకల్పించడం ద్వారా స్థానిక పరిపాలనా వ్యవస్థలో ‘సెప్టెంబరు రివల్యూషన్‌ను తీసుకొచ్చారు. అత్యంత గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన అశోకుడికి ‘దేవతలు మెచ్చిన రాజు’ అనే బిరుదు ఉండేది. ఆయన మాదిరిగానే సకల జనరంజకంగా పాలన, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జగన్‌ కూడా ‘దేవుని బిడ్డ’ అయ్యారు’’ అని వ్యాఖ్యానించారు.

గత టీడీపీ సర్కారు హయాంలో ఉద్యోగాలు పొందడం కలగా మారిందని, యువత ఉపాధిని వెదుక్కుంటూ వలసలు పోవడం సర్వసాధారణమైందని చెప్పారు. ఈ తరుణంలో ‘కారుచీకట్లో కాంతి రేఖ’ మాదిరిగా వైసీపీ ప్రభుత్వం వచ్చి.. లక్షలాది ఉద్యోగాల భర్తీ చేపట్టి, యువతను ప్రభుత్వోద్యోగులను చేసిందన్నారు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిన గుప్తుల స్వర్ణయుగాన్ని.. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా జగన్‌ స్థానిక సుపరిపాలనలో ‘స్వర్ణయుగా’న్ని తెస్తున్నారని కొనియాడారు. పనిలో పనిగా.. మంత్రి బొత్సనూ ‘సునిశిత మేధావిగా, ఏకసంథాగ్రాహి’గా అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *