Breaking News

ప్రాణనష్టం నివారించగలిగాం: సుచరిత

గోదావరి వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగామని ఏపీ హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అమరావతిలో ఆమె విలేకరులతో మాట్లాడారు.. వరద ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయని వివరించారు. సహాయ శిబిరాల్లో బాధితులకు అవసరమైన ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు సుచరిత చెప్పారు. ఆయా జిల్లాల మంత్రులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరిలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పథకాలను ప్రజలకు చేర్చే బాధ్యత వాలంటీర్లదే

నవరత్నాలతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్ని ప్రజల ముంగిట చేర్చే బాధ్యత గ్రామవాలంటీర్లదేనని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం పరిధిలో వాలంటీర్ల పోస్టులకు ఎంపికైన వారికి మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ..ప్రజల అవసరాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వాటిని నెరవేర్చే బాధ్యతను వాలంటీర్లు తీసుకోవాలన్నారు. గతంలో జన్మభూమి కమిటీల మాదిరిగా ప్రవర్తిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. కులమతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరీకీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. నవరత్నాలతో పాటు గ్రామంలోని ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జెడ్పీ సీఈవో సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *