Breaking News

బీజేపీలో అయోమయం

బీజేపీలో అయోమయం

  • ముందే వచ్చిన ఎన్నికల ప్రకటన
  • రాష్ట్ర బీజేపీ ప్లాన్ తారుమారు
  • ఇంకా పూర్తికాని అభ్యర్థుల అన్వేషణ
  • బస్ యాత్ర రద్దు..?, బయోడేటాలపైనే దృష్టి

        రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 30న ప్రకటన వస్తుందని భావించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారు అయింది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎవరితో పొత్తులేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని ఆ పార్టీ నిర్ణయించింది. కాని అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కిరాలేదు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత తీవ్రంగా పీడిస్తోంది. దీంతో ఏం చేయాలో తోచని అయోమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పడిపోయింది.

        దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా, రాష్ట్రంలో మాత్రం బీజేపీది చాలా దయనీయమైన పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది. కాని 4 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రత్యేక హోదా కీలకమైంది. కాని హోదా ఇవ్వలేదు. ఇతర విభజన హామీలను కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని టీడీపీ, ఇతర విపక్షాలతోపాటు ప్రజాసంఘాలు సైతం బీజేపీని టార్గెట్ చేశాయి. దీంతో బీజేపీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇటీవల గుంటూరు, విశాఖలో సభలు ఏర్పాటుచేసి ప్రధానిని రప్పించగల కమళదళం ఎలాగైనా అభ్యర్థులను బరిలోకి దించాలని చూసింది. దీనికనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని మార్చి నెలాఖరులోపు అన్ని చక్కదిద్దాలని, అంతకుముందు బస్ యాత్రను తిరిగి ప్రారంభించాలని చూసింది. కాని ఏప్రిల్ 11నే రాష్ట్రంలో ఒకేదశలో ఎన్నికలు పూర్తిచేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీజేపీ నేతలకు ఒక విధంగా షాక్ ఇచ్చినట్లయింది. వీలైనంత త్వరగా అభ్యర్థుల వివరాలు తీసుకుని ఢిల్లీకి పంపే కసరత్తు చేపట్టింది.

        రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చిందో వివరిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి బస్ యాత్ర చేపట్టిన బీజేపీ నేతలకు ఆదినుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి పలాసలో బస్ యాత్రకు జెండా ఊపారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జనం లేకపోవడంతో సభ రద్దైంది. అక్కడ్నుంచి శ్రీకాకుళం వరకు వచ్చిన బస్ యాత్ర, ఆ తర్వాత గుంటూరులో ప్రధానమంత్రి మోడీ సభ నేపథ్యంలో ఆగింది. ఆ తర్వాత విశాఖపట్నంలో సభకు ఏర్పాట్లు, ఇతరత్రా కార్యక్రమాల వల్ల బస్ యాత్ర శ్రీకాకుళం నుంచి ముందుకు కదల్లేదు. ఎన్నికల షెడ్యూల్ తో బస్ యాత్ర ఇక రద్దైయినట్లేనని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.

        రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎంపీ అభ్యర్థులను నిలపగలిగేందుకు రాష్ట్ర బీజేపీకి అవకాశం ఉన్నా ఎమ్మెల్యే స్థానాలకు మాత్రం అసాధ్యంగా కనిపిస్తోంది. జిల్లాకు ఒకరిద్దరైనా 10 వేల ఓట్లైనా తెచ్చుకునే వ్యక్తులే లేరని భావిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలజడి చెందుతోంది.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *