సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగి , దేశంలో అనేక రాష్ట్రాలను , దేశాన్ని అనేక సంవత్సరాలు అప్రహతితంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి… ఈరోజు చాలా దయనీయ స్థితిలో వుందని చెప్పక తప్పదు . నెహ్రూ, ఇందిర, రాజీవ్, పి వి లాంటి ఉద్దండులను ప్రధానులుగా అందించిన పార్టీ ,నేడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది … 2004 నుండి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ….రాష్ట్రాల్లో బలమైన నాయత్వాన్ని తయారు చేసుకోవడంలో వెనుకబడిపోవటం వల్ల ఈ దుస్థితి దాపురించింది …అప్పటివరకూ బలమైన నాయకులు అనుకున్నవారు వయస్సు రీత్యా వృద్ధులు అయ్యి క్రియాశీలంగా వుండలేకపోవటమూ, కొంతమంది అవినీతి లో కూరుకొని పోవటం వల్ల రోజు రోజుకూ ప్రజాదరణ వున్న నాయకులు కరువయ్యారు అని చెప్పకతప్పదు … ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధినాయకత్వం 2013 లో ఎన్నో మల్లగుల్లాల తరువాత రాహుల్ గాంధీని యువనాయకుడు అంటూ దేశానికి పరిచయం చేసే పనిలో పడ్డారు…రాహుల్ ఉపాద్యక్ష పదవి చేపట్టగానే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కోవలసివచ్చింది ..2013లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ , ఢిల్లీ ల ఎన్నికలతో మొదలుపెట్టి ఆ తరువాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పరాజయమే…2014 లో లోకసభ ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధానిగా ప్రమోట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ ఆశలన్నీ అడియాశలవ్వటమేకాక ,దేశ చరిత్రలో మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేనంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది …వరుసగా ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో చతికలపడుతూ వచ్చింది …చావుతప్పి కన్నులొట్టపోయిన్నట్లు గా ఒక్క బీహార్లో లాలూప్రసాద్ , నితీష్ లతో కలసి ప్రభుత్వంలో చేరింది… మళ్ళీ ఈరోజు పంజాబ్ పగ్గాలు చేతికొచ్చాయి … మునుపెన్నడూ లేని విధంగా ఘోరమైన ఓటమి పొందుతున్నప్పటికినీ ….. ఏ ఒక్క ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఎక్కడా కనిపించటం లేదు ..ఇప్పటికీ ఏ అంశం మీద ప్రభుత్వాన్ని సభల్లో నిలదీయాలి అనే దానిమీద స్పష్టత లేదు …ప్రతి విషయంలో గందరగోళం ,అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది ….. ఈ కాంగ్రెస్ పార్టీయేనా దేశాన్ని దీర్ఘకాలం పాలించింది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి … రాష్ట్రాల్లో కూడా బలమైన నాయకత్వం లేక క్యాడర్ అంతా చెల్లాచెదురు అవుతున్నట్లుగా వార్తలందుతున్నాయి . ఇప్పటినుండీ పార్టీని ప్రక్షాళన చేసుకోకపోతే 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పటం దుస్సాధ్యమే అవుతుంది . సాధారణ ఎన్నికలకు ముందే గుజరాత్ ,చత్తీస్ ఘడ్, కర్నాటక ,మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికలున్నాయి . ఇవి 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటివి .ఈ రాష్ట్రాల్లో ఒక్క కర్నాటకలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో లేదు … మరొక వైపు 2014 నుండీ ప్రధాని మోడీ , బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయం ముందుకు దూసుకెళ్తూనే ఉంది … కర్నాటక ప్రభుత్వం పై ఇప్పటికే అనేక ఆరోపణలు వున్నాయి .తీవ్రమైన ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి . పైపెచ్చు రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ పార్టీ ఓడిపోతుందని సంకేతాలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విజయం సాధించాయి . రాహుల్ స్థానంలో సోనియా స్టార్ క్యాంపెయినర్ గా ముందుండి నడిపించాలన్నా,ఆవిడ ఆరోగ్యం అంతంతమాత్రమే . సోనియా కూడా 70 సంవత్సరాలు దాటేశారు . ఇక ప్రియాంక ను రంగంలోకి తీసుకొద్దామా అంటే ఆవిడ భర్త రాభర్ట్ వాద్రా మీద అనేక అవినీతి ఆరోపణలు వున్నాయి . దీనివల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం వుంది . కేవలం గాంధీ కుటుంబం అనే చరిష్మాతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందా లేదా పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్తుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు … నాయకత్వాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలనుకున్నా… సార్వత్రిక ఎన్నికలకు వున్న సమయం సరిపోతుందా అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న … పరిస్థితి ఇలాగే వుంటే 2019 లో మళ్ళీ 2014 ఫలితాలే పునరావృతం అవుతాయేమో ..ఈరోజు జమ్మూ కశ్మీర్ నేత ఒమర్ అబ్దులా నర్మగర్భంగా మాట్లాడినా ( మోడీ హవా ముందు 2019 లో ప్రతిపక్షానికి అవకాశం లేదు 2024 లోనే చూసుకోవాలి అని ) అది వాస్తవం అవ్వటానికే అవకాశాలు వుంటాయి ..కాంగ్రెస్ నాయకత్వం ఈ వైఫల్యాలనుండి తేరుకొని ముందుకెళ్ళకపోయినట్లైతే , భవిష్యత్తులో ……కాంగ్రెస్ అనే పార్టీ ఒకటి ఉండేది అని చరిత్రలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో !!!
భవిష్యత్తులో ……కాంగ్రెస్????
మోహన్.రావిపాటి
9000864857