రాజనీతి కోవిదుడు చంద్రబాబు
ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదినం. 1950 ఏప్రిల్ 20 న జన్మించిన ఆయన ఈరోజు 65 సంవత్సరాలు నిండి 66 వ ఏట ప్రవేశించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలోని నారా వారి పల్లి లో ఒక రైతు కుటుంబంలో జన్మించారాయన. ఆయన తండ్రి ఖర్జూర నాయుడు. తల్లి అమ్మణ్ణమ్మ.
ఎవరికైనా ఈ రెండుపేర్లూ కొంచెం వింతగా ధ్వనిస్తాయి. ‘ఖర్జూరమ్’ అనే సంస్కృత పదానికి ‘ఖర్జూరపండు’ అనే అర్థం మాత్రమే కాక ‘వెండి’ అనే అర్థమూ ఉంది. ‘అమరకోశమ్’ అనే సంస్కృత నిఘంటువు వెండికి గల రజతము, రూప్యము, ఖర్జూరము, శ్వేతము వంటి పలు ఇతర పేర్లను పేర్కొంది. బంగారయ్య, బంగారమ్మ, కనకయ్య, కనకమ్మ, సువర్ణ, కాంచన, హేమ అనే బంగారాన్నిసూచించే పేర్లలాగే ఖర్జూర నాయుడు అనేది వెండిని సూచించే పేరు. రజత, శ్వేత వంటి పేర్లు కూడా ఇలా వెండిని సూచించేవే. ఇకపోతే అమ్మణి లేక అమ్మణ్ణమ్మ అనేది ‘భగవతి’ కి మరోపేరు. ఉత్తర కేరళ ప్రాంతంలో, పశ్చిమ కర్ణాటకలోని తుళునాడు ప్రాంతంలో ఈ భగవతి ఆరాధన చాలా ఎక్కువ. తుళునాడు నుంచి చంద్రగిరి ప్రాంతాలకు వలసవచ్చిన శ్రీకృష్ణదేవరాయల పూర్వుల కారణంగా ఈ పేరు ఆంధ్ర ప్రాంతంలోనూ విస్తరించి ఉంటుంది.
చంద్రబాబు బాల్యం నుంచీ చాలా చురుకుగా ఉండేవారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో ఎం.ఏ. చదివే రోజుల్లోనే ఆయన విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడం, యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు కావడం విశేషం. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేసిన ఆయన ఇక ఆ తరువాత రాజకీయాలకు పూర్తిగా అంకితమయ్యారు. 1974 లోఅప్పటి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్న డి.యల్. నారాయణ గైడ్ గా పిహెచ్. డి. కోసం అధ్యయనం చేస్తూ కూడా పూర్తికాలపు రాజకీయ కార్యకలాపాలలో మునిగితేలడం కారణంగా ఆ కృషికి అర్ధాంతరంగా స్వస్తి పలికారు. భారత జాతీయ కాంగ్రెస్, యువతకు కేటాయించే 20 శాతం కోటాలో ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. అతి చిన్న వయస్సులో తన 28వ ఏట చిత్తూరుజిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికైన చంద్రబాబును అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య తన మంత్రివర్గంలో సాంకేతిక విద్య మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కాబినెట్ లోకి తీసుకున్నారు. అలా ఆయన అతి పిన్న వయస్కుడైన యం.యల్.ఏ.గానే కాక అతి పిన్న వయస్కుడైన మంత్రిగానూ రికార్డులకెక్కారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండగానే ఆయనకు యన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది. ప్రతిభావంతుడైన ఈ యువకుడికి యన్టీఆర్ తన మూడవ కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహంచేశారు. 1982 లో యన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 1983 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం జరిగాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు తరువాత కొద్ది రోజుల్లోనే తెదేపాలో చేరారు. 1984 ఆగస్టులోనాదెండ్ల భాస్కరరావు తదితరులు యన్టీఆర్ ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చిన సందర్భంలో చంద్రబాబుకు తన సామర్థ్యాన్ని ప్రదర్శించే చక్కటి అవకాశం లభించింది. ఆ సమయంలో చంద్రబాబు చూపిన తెగువ, పార్టీ యం.యల్.ఏ. లను కాపాడుకోవడంలో ఆయన చూపిన చొరవ, ఎన్టీఆర్ విధేయులైన ఎం.యల్.ఏ.లతో న్యూఢిల్లీ లో రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించడంలో చంద్రబాబు ప్రదర్శించిన అసమానమైన రాజనీతి చాతుర్యం పట్ల యన్టీఆర్ సమ్మోహితులయ్యారు. ఎన్టీఆర్ ఆయన్ని వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, పార్టీలో నెంబర్ 2 స్థానాన్నిచ్చారు. 1989 లో కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు నాటినుంచి ఇక ఓటమి ఎరుగరు. అయితే 1989 లో తాను గెలిచినా తమ పార్టీ అధికారం చేజిక్కించుకోవడంలో విఫలమైన కారణంగా ఆయన 1989- 94 మధ్యకాలంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సి వచ్చింది. అప్పట్లో సమర్థుడైన ప్రతిపక్ష నేతగా సభలోపల, పార్టీ ప్రధాన కార్యదర్శిగా సభ వెలుపల మంచి పేరు తెచ్చుకున్నారాయన. 1994 లో తిరిగి కుప్పం నుంచి ఎన్నికైన బాబు యన్టీఆర్ మంత్రివర్గంలో కీలకమైన ఆర్ధిక, రెవెన్యూ శాఖలు చేపట్టారు. రోజురోజుకూ శారీరకంగా, మానసికంగా బలహీనపడుతున్నయన్టీఆర్ క్రమంగా అన్ని విషయాలలో లక్ష్మీపార్వతి పై ఆధారపడడం ఎక్కువైంది. ప్రతి చిన్న విషయానికీ పార్టీ కార్యకర్తలు మొదలు మంత్రుల వరకూ ఆవిడ ఎదుట మోకరిల్లాల్సిన స్థితి ఏర్పడింది. ఇన్నేళ్ళ తమ సేవలకు ఫలితం లేకుండా పోయిందనీ, తమ భవితవ్యం ఏమైపోతుందోననీ ఆందోళన అందరిలో మొదలైంది. పార్టీకి జరుగుతున్న నష్టం గురించి యన్టీఆర్ కి ఎవరూ విపులంగా వివరించి చెప్పగలిగే స్థితి లేదు. అధినేతతో గట్టిగా మాట్లాడితే వచ్చే ఎన్నికలలో తమకు సీటు వస్తుందో రాదోనన్న భయం అందరినీ వెన్నాడేది. ఓ దశలో ఆయన దగ్గరకు వెళ్ళగలగడం కూడా ఎవరో ఒకరిద్దరు ముఖ్యనేతలకు తప్ప సాధ్యపడేది కాదు.రేణుకా చౌదరి సస్పెన్షన్ ను ఎత్తివేయమని కోరేందుకు, ఆ విషయంలో నిజానిజాలు అధినేతకు వివరించడానికి ఆయన్ని కలిసిన ముగ్గురు సీనియర్ తెదేపా నేతల మీద ఎన్టీఆర్ విరుచుకుపడిన తీరు చూసిన తరువాత అందరిలోనూ తమ రాజకీయ భవితవ్యంపై గుబులు పట్టుకుంది. దానికితోడు ‘ఇది నేను స్థాపించిన పార్టీ. ఇది నాతోనే పోతుంది. నేను ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తా,’ అంటూ యన్టీఆర్ తరచు చేసే ప్రకటనలు కూడా ఎమ్మెల్యేల మనసులలో అభద్రతాభావం ఏర్పడడానికి కారణమయ్యాయి. ఆ దశలో పార్టీని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకునే లక్ష్యంతో పార్టీలోని అధికసంఖ్యాకులు అధినేత యన్టీఆర్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేయక తప్పింది కాదు. 1995 ఆగస్టు లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని వైస్ రాయ్ హోటల్ లో సమావేశమైన తెదేపా యం యల్ ఏ లు ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నారు. అలా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత కొద్ది కాలానికే యన్టీఆర్ మృతి చెందారు. యన్టీఆర్ ఇమేజ్ తో, మరణానంతరం ఆయనపట్ల వెల్లువెత్తే సానుభూతితో వచ్చే ఎన్నికలలో సులువుగా నెగ్గగలమనే ఆశతో పార్టీలోని కొందరు నేతలు లక్ష్మీ పార్వతి వెనుక సమీకృతులవడం మొదలైంది. అయితే అదెంతో కాలం కొనసాగలేదు. నట్టనడి సంద్రంలో ఉన్న నావలాంటి పార్టీని సమర్థుడైన చంద్రబాబు భద్రంగా దరిచేర్చగలడని దాదాపు పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ క్రమంగా నమ్మకం కుదిరింది. వారంతా చంద్రబాబు వెనకనే నిలిచి, పార్టీ, ప్రభుత్వ నిర్వహణలో ఆయనకు సహకరించారు. అప్పటిదాకా ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, ప్రజాకర్షక పథకాల ఆధారంగానే నడిచిన పార్టీని యథాతథంగా సంరక్షించుకుని, ప్రభుత్వాన్ని మరింత మెరుగైన పనితీరుతో నిలబెట్టుకోవాల్సి రావడం నిజంగా చంద్రబాబుకు పెనుసవాలుగా మారింది. అయితే ధైర్యంగా ఆ సవాలును స్వీకరించిన చంద్రబాబు ఆ కృషిలో కృతకృత్యుడు కాగలిగారు.తనది పనిచేసే ప్రభుత్వమని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు బాబు. ఒక దశలోతేదేపాకు బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ వంటి పలువురు నేతలు సైతం చంద్రబాబు కార్యదీక్షను, దక్షతనూ పొగిడారు. ఎన్టీఆర్ ఆశయాలపట్ల విధేయంగా ఉంటూనే నిరర్దకమైన, ప్రజాకర్షక పథకాలను ఎత్తివేయడమో లేక పాక్షికంగా కుదించి, కొనసాగించడమో చేశారు. ఎన్టీఆర్ ఇమేజ్ స్థానంలో తన కృషితో సాధించిన పనుల సాఫల్యాల ఇమేజ్ ని కొంతమేర చొప్పించ గలిగారు. ఆర్ధిక సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు చేశారు. తాను కష్టపడి పనిచేస్తూ, అధికారులు, ఉద్యోగులలో కూడా జవాబుదారీతనం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అలా ప్రధానంగా ఆయన కృషి, ప్రభుత్వ పనితీరులో మెరుగుదల కారణంగా 1999 శాసన సభ ఎన్నికలలో తెదేపా మొత్తం 294 సీట్లకు గాను 185 సీట్లు గెల్చుకుని అఖండ విజయం సాధించింది. రాష్ట్రంలోని 42 పార్లమెంటు సీట్లకుగాను తెదేపా 29 సీట్లు సాధించింది. ఈ విజయంలో ఎన్నటికీ వన్నెతరగని యన్టీఆర్ ఇమేజ్ కూడా ఆయనకు కొంత మేరకు తోడ్పడింది. యన్. డి. ఏ. కూటమిలో భాజపా తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా తెదేపా అవతరించింది. తన కనుసన్నలతో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగల స్థాయికి చంద్రబాబు చేరుకున్నారు. అయినా కేంద్రంలో ఏ పదవినీ ఆశించక తాను ముఖ్యమంత్రిగానే కొనసాగారు. ఆ దశలో కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి చేయగలిగినంత మేలు చేసే ప్రయత్నం చేశారాయన. ‘డిపెప్’ పథకం కింద వేలాది గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలకు పక్కా భవనాలు ఏర్పడ్డాయి. గ్రామీణ మంచినీటి సరఫరా కార్యక్రమాలకు ఆ దశలో గొప్ప పురోగతి లభించింది.రాష్ట్రంలోని రహదారులన్నీ ఆధునీకరించబడి ప్రయాణ సమయాలు బాగా తగ్గాయి. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఏర్పడ్డాయి. ఇది మనందరికీ స్వీయానుభవంలో తెలిసిన విషయమే ! ఇక అక్కడి నుంచీ చంద్రబాబు సంస్కరణల బాటలో మరింత వేగంగా పురోగమించారు. రోడ్డు రవాణా, విద్య, వైద్య సేవల మెరుగుదలపై ఆయన ప్రధానంగా దృష్టిపెట్టారు. తెలంగాణలోని కొన్ని వెనుకబడిన జిల్లాలు సైతం టెన్త్, ఇంటర్ ఫలితాల విషయంలో పలు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిచెందిన జిల్లాలను కూడా అధిగమించి ముందడుగేశాయి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. అందుకు రికార్డులే సాక్ష్యం. చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కేంద్రీకరించి హైదరాబాద్ ను ఐ.టి. హబ్ గా మార్చి, హైదరాబాద్ కు ప్రపంచపటం మీద ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించారు. ఆయన కారణంగానే
ఐ టి రంగానికి ఒక గొప్ప ఊపు వచ్చింది. దీనివల్ల ఎందఱో విద్యాధిక నిరుద్యోగులకు మేలు జరిగింది.ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. సంస్కరణలు పటిష్ఠంగా అమలు పరచి, విద్యుదుత్పత్తి పెంచి, విద్యుత్ సరఫరా నష్టాలను తగ్గించి, రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేశారు చంద్రబాబు. విద్యుత్ బకాయిలు సమర్థవంతంగా వసూలు చేయించి, విద్యుత్ వ్యవస్థను లాభాల బాటకు మళ్ళించే ప్రయత్నంలో టారిఫ్ పెంచక తప్పింది కాదు. ఆ దశలోనే రైతు వ్యతిరేకిగా ఆయన మీద ముద్ర పడింది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనే అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారాయన. వాస్తవానికి చంద్రబాబు వ్యవసాయదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలనీ, డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులు పాటిస్తూ, పంట మార్పిడితో అధిక ఆదాయాన్నిచ్చే వాణిజ్య పంటలు కూడా సాగుచేయడం అలవరచుకుంటే రైతుకు వ్యవసాయంలో నష్టమనే మాటే ఉండదని ఆయన తరచు సభలలో చెప్పేవారు. కానీ కాంగ్రెస్ ఆయనపై రైతు వ్యతిరేకి అనే ముద్రవేసి, బలంగా ప్రచారం చేసింది. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లల్లా నడుచుకుంటూ, సాంఘిక సంక్షేమానికి వెచ్చించే నిధులలో కోత విధించారనే దుష్కీర్తి కూడా చంద్రబాబు పొందారు. అనుత్పాదక వ్యయం మీద కోత విధించి, తాను ‘వర్క్ హాలిక్’ గా పనిచేస్తూ అధికారులు, ఉద్యోగులు అందరినీ పని విషయంలో వెంటబడడం వారికి నచ్చలేదు. ‘పెడితే తింటాం గానీ, తిడితే పడతామా ?’ అన్నట్లు ఆయన ఉద్యోగుల సంక్షేమానికి ఎంత చేసినా, ఎందుకోగానీ ఆయన పట్ల అప్పట్లో వారు వ్యతిరేకతనే పెంచుకున్నారు. ఆయన దేశంలోకెల్లా తొలిసారిగా మన రాష్ట్రంలో బదిలీలను సమర్థత ప్రాతిపదికగా కౌన్సెలింగు ద్వారా చేపట్టి, బదిలీ వ్యవహారాలలో అవినీతికి తావులేకుండా చేశారు. అయితే అవినీతికీ, పని ఎగగొట్టే స్వభావానికి అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఆయన్ని తమకు అడ్డుగా భావించి, ఆయన ఎంత త్వరగా ముఖ్యమంత్రి పదవి నుంచి నిష్క్రమిస్తాడా ? – అని ఎదురు చూశారు. ఎల్ నినో, లా నినా వంటి పసిఫిక్ మహాసముద్రంలో తలయెత్తే వాతావరణ ఉపద్రవాల కారణంగా ఏటికేడు అనుకోని రీతిలో అనావృష్టి , తీవ్రమైన కరవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుసగా మూడేళ్ళు వెంటాడాయి. కాంగ్రెస్ నైరాశ్యంతో ఇంకేమీ పాలుపోక తెదేపాని ఎలాగైనా ఓడించాలని, చంద్రబాబు అధికారానికొస్తే వానలు పడవనీ, ప్రకృతి కూడా ఆయనకు సహకరించదనీ అసత్య ప్రచారం చేసింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై హైదరాబాద్ లోని బషీర్ బాగ్ దగ్గర జరిగిన పోలీసు కాల్పులు చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకతను మరింత పెంచాయి. (2000 ఆగస్టు 28 వ తేదీన జరిగిన ఈ కాల్పులలో బాలస్వామి, రామకృష్ణ అనే ఇరువురు ఆందోళనకారులు పోలీసులు కాల్చిన బులెట్ గాయాలకు మృతి చెందగా, కిసారీ అనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసలో తీవ్రంగానూ, 119 మంది ఇతర పోలీస్ సిబ్బంది స్వల్పంగానూ గాయపడ్డారు.) ఆ తరువాత 2004 లోజరిగిన ఎన్నికలలో ఈ ఘటన ప్రతిపక్షాల చేతిలో ఒక ఆయుధంగా ఉపయోగపడింది. గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల’ అనే పాటను కాంగ్రెస్ తన ప్రచారాస్త్రంగా మలచుకుంది. ఆ పాటలో రైతుల, చేతి వృత్తుల వారి దుస్థితిని హృదయ విదారకంగా వర్ణించిన కారణంగా సహజంగానే ఎన్నికలకు ముందు అప్పటి తెదేపా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. మిగిలిన కారణాలనటుంచి ప్రధానంగా విద్యుత్ టారిఫ్ పెంపుదల, బకాయిల బలవంతపు వసూళ్ళ కారణంగా తెదేపా ఓటమి పాలయితే, విద్యుత్ బకాయిల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి జనాకర్షక నినాదాలతో వై యస్ నేతృత్వం లోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలా రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు సుదీర్ఘ కాలంపాటు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు 2004 ఎన్నికలలో వ్యక్తిగతంగా తాను కుప్పంలో గెలిచినా, తెదేపా ఓటమి కారణంగా అధికారం కోల్పోయి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 2014 వరకు కొనసాగాల్సి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గానే కాదు; ప్రతిపక్ష నేతగానూ సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ఘనత కూడా చంద్రబాబుదే. ఎన్నికలలో గెలుపోటములు అప్పటి స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా, అర్థ రహితంగా విభజించిన తరువాత దిక్కూమొక్కూ లేని ఈ రాష్ట్రానికి చిత్తశుద్ధితో పనిచేసే సమర్థుడైన ఒక నేత అవసరమని గుర్తించిన విజ్ఞతగల ఓటర్లు తెదేపాని గెలిపించి, ఆ బాధ్యతను చంద్రబాబు భుజస్కంధాలపై పెట్టారు. రాష్ట్రానికి ఆయన పాలనలో మంచే జరుగుతుందని ప్రజలంతా ఇప్పటికీ ఆశిస్తున్నారు.
‘ఆయన ఏ పని తలపెట్టినా, పని రాక్షసునిలా, తాను స్వయంగా కష్టపడతారు ; లక్ష్యాల సాధనకోసం అందరినీ వెంటబడి పరుగులు పెట్టిస్తారు’ అని జనం అనుకునేది నిజం కాబట్టే ఆయన గత పాలనాకాలంలో విద్యుత్, ఐటి, రహదారులు, విద్య, వైద్య సేవల వంటి రంగాలలో రాష్ట్రాన్ని యావద్దేశంలో అత్యున్నత స్థాయిలో నిలపగలిగారు. అప్పట్లో ఆయన వస్తున్నారంటే పంచాయత్, మునిసిపల్, రెవెన్యూ అధికారులు, వైద్యశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ మొదలైన విద్యాధికారులు భయంతో గడగడలాడేవారు. ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేవి. ఉపాధ్యాయులు బోధనకు సకాలంలో క్లాసులకు హాజరయ్యేవారు. అయితే ప్రస్తుతం గత రెండేళ్ళ చంద్రబాబు పాలన చూస్తే ఉద్యోగులు, అధికారులలో జవాబుదారీతనం ఆ స్థాయిలో లేదు. గతకాలపు బాబు పాలనలోలాగా అధికారులు, ఉద్యోగులలో జవాబుదారీతనం కొట్టవచ్చినట్లు కనిపించడం లేదనేది వాస్తవం. బహుశా ఇది పదేళ్ళ కాంగ్రెస్ పాలన దుష్ఫలితమేమో ! ‘ముఖ్యమంత్రిగారు తిరిగి మునుపటిలా కొరడా ఝళిపిస్తే పోయేదేమీ లేద’ ని సామాన్యజనం అనుకుంటున్నారు. ఉద్యోగుల జీవన స్థితిగతుల మెరుగుదల విషయంలో వారి పట్ల సుహృద్భావంతో వ్యవహరిస్తూనే ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యతారాహిత్యాన్ని మాత్రం ఆయన తీవ్రమైన విషయంగా భావించి, అదుపుచేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశిస్తున్నారు. ఇప్పుడున్న స్థితిలో ప్రజలంతా ఆయన తీసుకునే ప్రతి క్రమశిక్షణా చర్యనూ, అధికార కార్య నిర్వహణలో చేసే ప్రతి దిద్దుబాటు చర్యనూ పూర్తిగా సమర్థిస్తారు కూడా. రాజధాని నిర్మాణం, పోలవరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం మీద తాను వ్యక్తిగత శ్రద్ధతో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినా, విద్య, వైద్యం, నీటి సరఫరా, హౌసింగ్ వంటి ముఖ్యమైన శాఖల రోజువారీ కార్యనిర్వహణలో, నిర్దేశిత లక్ష్యాల సాధనలో ఆ యా శాఖల మంత్రులు, కలెక్టర్లు మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజలు ఆయనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రస్తుతం ఆయనొక్కరే అహర్నిశలూ కష్టపడుతున్నట్లు మనందరికీ తెలుసు. ఇదే తరహా జవాబుదారీ తనాన్ని రానున్నకాలంలో తన మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఉద్యోగుల నుంచి కూడా చంద్రబాబు రాబట్టగలిగితే ఆయన తన లక్ష్య సాధనలో కృతకృత్యులయినట్లే ! అలాచేస్తే ఆయనకి ఇక ఇప్పట్లో రాజకీయంగా ఎదురే ఉండబోదు. అయితే మంత్రులు, అధికార యంత్రాంగం పనితీరులో ఏ కొద్ది అలసత్వం పొడచూపినా ప్రతిపక్షం దానిని మొత్తం రాష్ట్రప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే ప్రమాదముంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ‘స్విమ్ ఆర్ సింక్ టుగెదర్’ అన్నసూత్రం మొత్తం కాబినెట్ కి వర్తిస్తుంది కనుక మంత్రుల పనితీరులో లోపాలకూ, ఇతర వైఫల్యాలకూ కాబినెట్ ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతటినీ తనలా లక్ష్యసాధన దిశగా వడివడిగా అడుగులు వేయించే పనిలో పడ్డారాయన. లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది మరి !! ఈ కృషిలో ఆయన కృతకృత్యులు కావాలని మనసారా కోరుకుందాం.
మీకు తెలుసా? ఒరాకిల్ కార్పొరేషన్ వారి ‘ప్రాఫిట్’ అనే మాసపత్రిక చంద్రబాబును ప్రపంచంలోని ఏడు ‘హిడెన్ వర్కింగ్ వండర్స్’ లో ఒకరిగా అభివర్ణించింది. ‘ఇండియా టుడే’ పత్రిక ‘ ఇండియన్ ఆఫ్ ది మిల్లెన్నియం’ (వెయ్యేళ్ళలో ప్రముఖ భారతీయుడు) అవార్డుకు ఎంపిక చేసింది. ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక ఆయన్ని’బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంచుకుంది. ‘టైం ఏషియా’ పత్రిక చంద్రబాబును ఒక ఏడాదికి ‘ దక్షిణ ఆశియా దేశాలలోకెల్లా అత్యుత్తమ నేత’ గా అభివర్ణించింది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తులతో రూపొందించిన ‘డ్రీమ్ కాబినెట్’ లో చంద్రబాబు స్థానం పొందడం విశేషం. యన్ డి ఏ హయాంలో చంద్రబాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై వేసిన జాతీయ స్థాయి పానెల్ కి అధ్యక్షత వహించడం మరో విశేషం.
బహుశా .. ఇది మీకు తెలియదేమో ! 2000 సంవత్సరంలో అమెరికాలోని ఇల్లినాయి (Illinois) రాష్ట్రంలోని ఎవాన్ స్టన్ లో ఉన్న కెలోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ (Kellogg School of Management) చంద్రబాబుకు గౌరవ ప్రొఫెసర్ పదవిని ఇవ్వజూపింది.
రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ఇంతటి అంకితభావం గల మేధావికి నవ్యాంధ్ర నిర్మాణంలో తగిన చేయూతనిచ్చి మనమంతా ఆయన చేస్తున్న కృషికి సహకరిద్దాం. కుంభకోణాలకూ, అవినీతికీ ఆస్కారంలేని విధంగా ఆయన తన పాలన సాగించగలరనీ, అభివృద్ధి లక్ష్యాలనన్నింటినీ ఆయన అవలీలగా చేదించగలరనీ ఆశిద్దాం. ఆయనకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.
— మీ.. రవీంద్రనాథ్.
9849131029