Breaking News

వెంకయ్య లేని ఆంధ్రా బిజెపి

New Delhi: Minister of Urban Development M.Venkaiah Naidu addresses newsmen to announce third list of Smart Cities, in New Delhi on Tuesday.   PTI Photo by Kamal Kishore (PTI9_20_2016_000132B)

 

 

 

 

 

వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఖచ్చితంగా దక్షిణభారతదేశమ్లో కొన్ని రాజకీయ సమీకరణాల మార్పు కి దారి తీస్తుంది. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో ఇంకా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి లో చాలా మార్పులు సంభవించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటివరకు అన్నీతానై నడిపించిన బిజెపి పార్టిని ఇప్పుడు మరొకరి భుజాల మీద పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిజెపి అంటే వెంకయ్యనాయుడే, ఇంకా చెప్పాలంటే ఆంధ్రాలో బిజెపి అంటే తెలియనివాళ్ళున్నారేమో కానీ, వెంకయ్యనాయుడు అంటే తెలియనివారు లేరు. ఇప్పటివరకు బిజెపి ఆంధ్రాలో ఏదైనా బలం పెంచుకుంది అంటే అది కేవలం వెంకయ్యనాయుడు వల్లే. పార్టీ కోసం అంతగా కష్టపడ్డాడు వెంకయ్య నాయుడు. పార్టి లో వెంకయ్యనాయుడు కు తిరుగులేదు.

2014 లో బిజెపి పరిస్థితుల్లో మార్పు వచ్చింది . జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ని మట్టి కరిపించి, మొదటిసారిగా ఒంటరిగా మెజారిటీకి కావాల్సిన స్థానాలు దక్కించుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితులవల్ల అప్పటివరకు కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా, బిజెపిలో చేరారు. దీనితో బిజెపి లో ఉన్న నిఖార్సైన బిజెపి నాయకులకు, అరువు తెచ్చుకున్న కాంగ్రెస్ నాయకులకు మధ్య భావ సంఘర్షణ ఏర్పడింది. అంధ్రప్రదేశ్ లో ఉన్న నిఖార్సైన నాయకులు పదవులనాశించకుండా కేవలం పార్టీ కోసమే నిబద్దతతో పనిచేస్తే, పదవుల కోసమే బిజెపిలో చేరిన కాంగ్రెస్ నాయకులు స్వంత ఎజెండా కోసం పార్టీ ని బలోపేతం చేస్తామని బయల్దేరారు. పార్టీని బలోపేతం చెయ్యటంలో తప్పు లేదు, ఏ  పార్టీ అయినా బలం పుంజుకోవాలనే చూస్తుంది. బిజెపి కూడా అదే భావించింది.

బిజెపి ఉత్తరాదిలో ఉన్నంత బలంగా దక్షిణాది లో ఉండకపోవటానికి చారిత్రక కారణాలున్నాయి. ఎవరు , ఎన్ని, ఎలా చెప్పినా బిజెపి ది హిందూత్వవైపు మొగ్గు చూపే పార్టీ అనటంలో సందేహం లేదు, దానికి జాతీయవాదం అనే పేరు పెట్టుకోవచ్చు దేశభక్తి అని పేరు పెట్టుకోవచ్చు, గోసంరక్షణ అని పెట్టుకోవచ్చు, పేరు ఏదైనా అది మరో మతం పట్ల ద్వేషంగా ఉంది అనే విమర్శచేయలేము, కానీ హిందూ మతం పట్ల అభిమానం ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.  ఆ కారణంతోనే దక్షిణాదిన బిజెపి బలం పుంజుకోలేదు. ముఖ్యంగా పెరియార్ ప్రవచిత ద్రవిడ సిద్దాంత ప్రభావానికి , లెఫ్టిస్ట్ భావజాలానికి లోనైన ప్రాంతం కావటంతో , బిజెపి హిందూతత్వ ప్రభావం పెద్దగా పనిచేయలేదు. కర్నాటకలో బిజెపి బలంగా ఉంది అన్నమాట వాస్తవం, నిజానికి అక్కడ మొదటినుండి కూడా ద్రవిడ సిద్దాంతాలు కానీ, కమ్యూనిశ్ట్ సిద్దంతాల ప్రభావం కానీ తక్కువ. దానికి తోడు అక్కడి రాజకీయాల్లో మఠాధిపతుల ప్రాబల్యం ఎక్కువ. ఇక లెఫ్ట్ ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళలో కానీ, ద్రావిడ సిద్దాంత ప్రభావం ఎక్కువగా ఉన్న తమిళనాడులోకానీ బిజెపి బలంగా లేదు. ఇక ఆంద్రప్రదేశ్ లో అటు లెఫ్ట్ ప్రభావం, ఇటు ద్రావిడ సిద్దాంత ప్రభావం రెండూ ఉన్నాయి, అందుకే బిజెపి పెద్దగా ఎదగలేదు. ఇక మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాలో బిజెపి కి  కొంచెం మద్దతు ఉన్న మాట వాస్తవం, దానికి కారణం అక్కడ నైజాం పాలనలో హిందువులలో నెలకొన్న ఒక చిన్న అభద్రతాభావం వారిని బిజెపి వైపు చూసేలా చేసింది. అక్కడకూడా కమ్యూనిష్ట్ ప్రభావం ఉన్నా, కనీసం సైద్దాంతిక మద్దతు అయినా బిజెపి కి లభించింది. ఆంద్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎప్పుడైనా కుల విభేధాలున్నాయి కానీ, మతపర విభేదాల ఆనవాళ్ళు కూడా లేవు. అందువల్ల బిజెపి కి ఇక్కడ చోటు లేకుండా పోయింది. అయినప్పటికీ ఇక్కడ బిజెపి  కి కొద్దో, గొప్పో బలం ఉంది అంటే అది కేవలం వెంకయ్యనాయుడు వల్ల మాత్రమే. ఆయనకి స్పష్టంగా ఇక్కడి సామాజిక,రాజకీయ పరిస్థితులు తెలుసు. బిజెపి కి ఎంత బలముందో, ఎంత బలం సాధిస్తుందో కూడా స్పష్టంగా తెలుసు. అందుకే తెదేపా తో పొత్తుతో బిజెపి ని ఇక్కడ పూర్తిగా అడుగంటకుండా కాపాడుతున్నాడు.

ఇప్పుడు కొంతమంది బిజెపి నాయకులు ప్రధానమంత్రిగా మోదీ, అమిత్ షా బలం పుంజుకోవటం చూసి, మొన్న ఉత్తరప్రదేశ్ లో లభించిన ఘన విజయాన్ని చూసి, ఆంద్రప్రదేశ్ లో కూడా బలం పుంజుకుంది అన్న ఊహతో  మేడలు కట్టుకుంటున్నారు. నిజమే , కొంత మేర మోదీ మీద అభిమానంతో కొంతమంది విద్యావంతులైన న్యూట్రల్ ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపించవచ్చు కూడా, కానీ అది వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల్లో ఉంటే మాత్రమే సాధ్యం అవుతుంది. మోదిని వెంకయ్యనాయుడు ద్వారా నమ్ముతారు, వెంకయ్య నాయుడు లేనప్పుడు మోదీ ఈ ఆంధ్ర విద్యావంతులైన న్యూట్రల్ ఓటర్లకి ఒక అందని ద్రాక్ష. వారు దానికోసం ఆశ పడరు.

కాంగ్రెస్ నుండి బిజెపిలోకి చెందిన వలసనాయకులు, వారికి తెదేపా అంటే నచ్చదు కాబట్టి. కాంగ్రెస్ వృక్షానికి పుట్టిన మరో కాంగ్రెస్ అయిన వైకాపా తో పొత్తుకు ఉవ్విళూరుతున్నాయి.  కానీ, దీని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని వారి వ్యక్తిగత స్వార్ధం కోసం మర్చిపోతున్నారు. ఇప్పుడు బిజెపి, తెదేపాను వీడి, వైకాపా తో పొత్తు పెట్టుకుంటే అసలు ముందుగా ఎందుకు విడిపోయిందో చెప్పగలగాలి, అది చెప్పకుండా వైకాపా తో పొత్తు పెట్టుకుంటే జనాలు చీ కొడతారు. ఇక ఒంటరిగా పోటి చేయాలన్న ఆలోచన కూడా కొంతమంది అత్యుత్సాహవంతులు చేస్తున్నారు. కానీ, రాష్ట్రవిభజనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కార్యంలో బిజెపిది కూడా ప్రధానపాత్రే. ఆ సమయంలో అంటిన బురదను కడుక్కొనే ప్రయత్నం చేయకుండా ఆ బురదతోనే కౌగిలించుకుంటా అంటే ఆంద్రాప్రజలు సిద్దంగా లేరు. అందులోనూ  వెంకయ్యనాయుడు కూడా లేని బిజెపి ని అస్సలు నమ్మరు. బిజెపి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా అవినీతి ఆరోపణలు తక్కువే, అలాంటి పార్టీ అవినీతి సమస్య కాదు అని భావించే వైకాపా తో పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు బీహార్ లో నితీష్ పరిస్థితి చూస్తూ…చూస్తూ.. బిజెపి అలాంటి పరిస్థితి తెచ్చుకుంటుంది అనుకోవటం లేదు.  ఇది బిజెపి లో ఉన్న కాంగ్రెస్ వారికి, మరో కాంగ్రెస్ వైకాపా మీద అభిమానం ఉన్నవారికి కటువుగా ఉన్న నిజం

నిజానికి బిజెపి ఆంధ్రాలో అభివృద్ది చెందాలంటే ఒకటే మార్గం, 2019 ఎన్నికలలో కూడా తెదేపాతో నే కలిసి నఢిచి, వైకాపా ని మట్టి కరిపింఛాలి., తద్వారా 2024 వచ్చేసరికి వైకాపా కోలుకోలేని దెబ్బతీసి, ఒక రాజకీయ శూన్యత సృష్టించాలి, అప్పుడు బిజెపి- తెదేపా కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అంతే కానీ, ఇప్పుడు ఒంటరిగా పోటి చేసినా, వైకాపా తో పొత్తు పెట్టుకున్నా బిజెపి కి ఘోరపరాభవం తప్పదు .

 

మోహన్.రావిపాటి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *