Breaking News

వేసవిలో అధిక వేతనం

వేసవిలో అధిక వేతనం
‘ఉపాధి హామీ’ కూలీలకు ముఖ్యమంత్రి వరం
అమరావతి, ఫిబ్రవరి 19 : ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవిలో వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో 20%, మార్చిలో 25%, ఏప్రిల్‌లో 30% అధికంగా వేతనాలు చెల్లించాలని చెప్పారు. సంఘటితంగా పనిచేసే మహిళా బృందాలకు అధికంగా వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కూలీలకు వేతనాలు చెల్లింపు ఆలస్యం కాకుండా, తక్షణమే చెల్లించేలా ప్రస్తుత విధానాన్ని మెరుగుపరచాలని నిర్దేశించారు. సోమవారం ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్-ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్ సమావేశాన్ని ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్‌లో ముఖ్యమంత్రి నిర్వహించారు.
2017-18 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రూ. 6 వేల కోట్ల వరకు వచ్చే అవకాశం వుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ పథకం ద్వారా 2016-17లో రూ. 5,200 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు పొందగలిగామని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం నిధులు విస్తృతంగా వినియోగించడం ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.
ఉపాధి హామీ కింద 2017-18లో రాష్ట్రంలో మొత్తం 18.40 కోట్ల పనిదినాలు కల్పించామని, ఇందులో మహిళలకు 10.45 కోట్ల పనిదినాలు కల్పించామని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. కూలీలకు వేతనాల రూపంలో మొత్తం రూ. 2,613.45 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31లోపు 5.46 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కూలీలకు పనిదినాల కల్పనలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో, చివరి స్థానంలో కృష్ణా జిల్లా వున్నాయని అన్నారు.
ఉపాధి హామీ పథకం కింద 2017-18లో పంటకుంటలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటులో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇప్పటివరకు 1,44,110 పంటకుంటలు, 1,49,534 వ్యక్తిగత మరుగుదొడ్లు, 2,804 అంగన్‌వాడీ కేంద్రాలు, 4,976 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మరో 1,19,114 పంటకుంటలు, 74,396 వ్యక్తిగత మరుగుదొడ్లు, 3,206 అంగన్‌వాడీ కేంద్రాలు, 9,146 కి.మీ. సీసీ రోడ్లు నిర్మాణంలో వున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరం 6 వేల కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని నిర్దేశించుకోగా, 235.37% వరకు అధికంగా సీసీ రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడంతోనే సరిపెట్టకుండా, వాటిని వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఉపాధి హామీ పథకంలో వంద పనిదినాలు వినియోగించుకున్న 5 లక్షల కుటుంబాలు 150 రోజుల పాటు పనిదినాలు కల్పించాలని కోరుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
పంచాయతీ రాజ్ శాఖపై జరిగిన సమీక్షలో రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామ పంచాయతీలలో ఇప్పటివరకు 4,287 పంచాయతీలలో కంప్యూటర్లు ఏర్పాటు చేశామని, వీటిలో 841 పంచాయతీలకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామాల్లో 6,01,457 ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 56,735 కి.మీ. మేర అంతర్గత సీసీ రోడ్లు నిర్మించాల్సి వుండగా, ఇప్పటివరకు 36 వేల కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. ఇంకా 20,189 కి.మీ. వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి వుందన్నారు.
పంచాయతీ భవనం, స్మశానవాటిక, వ్యర్ధాల నిర్వహణ కేంద్రం, పాఠశాల-అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవానాలు, సీసీ రోడ్లు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, ఎల్‌ఈడీ వీధి దీపాలు ఇలా అన్ని మౌలిక వసతులను రాష్ట్రంలోని ప్రతీ ఒక్క పంచాయతీకి కల్పించడమే లక్ష్యం కావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పల్లెల్లో సౌకర్యాలపై సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. అన్ని పంచాయతీలకు వైఫై సౌకర్యం కల్పించేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *