Breaking News

వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే వచ్చిన ఊహాగానాలే నిజమయ్యాయి

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే ఏవీ ధర్మారెడ్డి మళ్లీ తిరుమల ప్రత్యేకాధికారిగా నియమితులవుతారంటూ వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌ (ఐడిఈఎస్‌) నుంచి తాజాగా రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై వచ్చిన ఏ వెంకట ధర్మారెడ్డిని టీటీడీలో తిరుమల ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం లేదా శుక్రవారం ఆయన తిరుమలలో బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణం చేసిన తరువాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను డెప్యూటేషన్‌పై రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రానికి లేఖరాసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర హోంశాఖ పరిధిలో జాయింగ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న ధర్మారెడ్డిని కూడా రాష్ట్రానికి పంపాలని కోరారు. గత సోమవారం ప్రధాని మోదీ ఆ ఫైల్‌పై సంతకం చేయడంతో ధర్మారెడ్డికి లైన్‌క్లియర్‌ అయింది. దీంతో సీఎం ఆదేశాలమేరకు ధర్మారెడ్డిని తిరుమల ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రెండు దఫాలుగా.. నాలుగున్నరేళ్లు
2004లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల జేఈవోగా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైఎస్‌ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ధర్మారెడ్డి ఐఏఎస్‌ కాకపోయినా చట్ట సవరణచేసి ఆయన్ను తిరుమల ప్రత్యేకాధికారిగా నియమించారు. అప్పటి నుంచి రెండేళ్లకు పైగా ఆయన తిరుమలలో విధులు నిర్వహించారు. ఆ తరువాత రాజకీయ ఒత్తిళ్ళతో బదిలీ అయినా, 2008లో మళ్లీ నియమితులై మరో రెండేళ్లకు పైగా కొనసాగారు. 2009లో వైఎస్‌ మృతి తర్వాత కొన్ని నెలలకు ఽధర్మారెడ్డిని బదిలీ చేయగా, అప్పటికి రెండు దఫాల్లో నాలుగేళ్లకు పైగా ఆయన తిరుమల ప్రత్యేకాధికారిగా పనిచేశారు. కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నందున ఈసారి ధర్మారెడ్డిని జేఈవోగానే నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ఐడీఈఎస్‌కు చెందినవారు కావడంతో మళ్లీ చట్ట సవరణచేసే బదులు మునుపటిలా ప్రత్యేకాధికారిగా నియమించడమే సులువని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాంతో ఆ మేరకు ఉత్వరులు జారీచేసింది. శనివారం తిరుమలకు రాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఆలోపే ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

‘మహాలఘు’ దర్శనం ప్రారంభకుడు..
గతంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన కాలంలో ధర్మారెడ్డి పలు కీలక నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చారు. అందులో ప్రధానమైనది మహా లఘుదర్శనం. రోజుకు 60 వేలమందికి మించి దర్శనం లభించక వేలాది భక్తులు రెండు-మూడు రోజుల పాటు తిరుమలలో నిరీక్షిస్తున్న సమయంలో నిత్యం 80 వేల మందికి పైగా భక్తులకు దర్శనం సాధ్యం చేసిన కీలక నిర్ణయమది. అలాగే ఆలయం లోపల ఉన్న బూందీ తయారీ వంటశాలను ఆయన హయాంలోనే బయటకు తీసుకొచ్చారు. రద్దీ పెరుగుతుండడంతో క్యూలైన్లను విస్తరింపచేశారు. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చతుర్మాడ వీధుల విస్తరణ చేపట్టి భక్తులకు అనుగుణంగా గ్యాలరీలు ఏర్పాటు చేయించారు. ఇరుకుగా ఉండడంతో విశాలమైన అన్నదాన భవనం నిర్మించడంలో తనదైన ముద్రవేశారు.

తాజా కూరగాయలు విరాళంగా అందించేలా దాతలను ప్రోత్సహించారు. అలాగే ఇతర ట్రస్టులకు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన దాతలకు తగిన విధంగా గౌరవ మర్యాదలు కల్పించారు. అలాగే దర్శన టిక్కెట్లు, గదుల కేటాయింపులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయించారు. క్రమేపీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వసతిని గణనీయంగా పెంచారు. పెద్ద, చిన్న కల్యాణోత్సవాల పేరిట ఉన్న సేవను ఒకే కల్యాణంగా మార్పు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బ్రేకు దర్శనాలు ప్రవేశపెట్టిందీ ఽధర్మారెడ్డి హయాంలోనే. విజయా బ్యాంకులో, ఆలయ డిప్యూటీఈవో ద్వారా సేవాటికెట్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేసి తన కోటాలోనే మంజూరుచేసేలా మార్పులు తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *