హైదరాబాద్
వరకట్న వేధింపులు తాళలేక పెళ్లైన కొన్ని నెలలకే యువతి బలవన్మరణానికి పాల్పడింది. యువతి మృతదేహాన్ని సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూర్ లోని ఇంటికి తరలించారు.
సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో అత్తారింటి వద్ద అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు నిరసన తెలుపారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బందోబస్తు చేపట్టారు. బంధువుల కథనం ప్రకారం సిరిసిల్ల పట్టణం వెంకంపేటకు చెందిన చీటి ఉదయ్ కు తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూర్ గ్రామానికి చెందిన జూపల్లి నిఖితకు 11 నెలల క్రితం వివాహమైంది. 20 లక్షల కట్నంతో పాటు, ఇతర లాంచనాలతో ఘనంగా వివాహం చేశారు. సాప్ట్ వేర్ ఇంజినీర్ లైన ఉదయ్, నిఖితలు హైదారాబాద్ లో కాపురం పెట్టారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
వివాహం జరిగిన కొద్ది రోజులకే ఉదయ్ అదనపు కట్నం కావాలంటూ, నిఖితను వేధించేవాడని, రెండెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిత హైదారాబాద్ లో ఇంట్లోనే తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హైదారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిఖిత కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో హైదారాబాద్ నుంచి అంబులెన్స్ లో బయలుదేరగా, సిరిసిల్ల పట్టణంలో అత్తగారింటి వద్ద ధర్నా చేస్తారనే సమాచారం పోలీసులకు అందడంతో, తంగళ్ళపల్లి మండలం జిల్లెళ్ళ చెక్ పోస్ట్ వద్ద అడ్డుకొని, మృతదేహాన్ని తల్లిగారింటికి పంపించారు.
అత్తింటి వారు పరారీ
నిఖిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఉదయ్ ఇంటికి వెళ్లగా, అప్పటికే నిఖిత అత్తింటి వారు తాళం వేసి పరారయ్యారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఇంట్లోనే ఎందుకు ఉండరని ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి నిఖిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటట్టు చూస్తామని హామీనివ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఇవాళ ఉదయం ఉదయ్ కుటుంబ సభ్యులు బంధువులతో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో నిఖిత అంత్యక్రియలు పూర్తిచేయడానికి అంగీకరింపజేశారు.