మోపిదేవి
ఇటీవల వీచిన ఈదురుగాలులకు భారీ నష్టాన్ని చవిచూసిన వాణిజ్య పంటల రైతులకు అసనీ తుఫాను మరింత నష్టాన్ని కలిగించిందని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
మోపిదేవి మండలం బొబ్బర్లంక, నష్టపోయిన రైతులను బుద్ధప్రసాద్ పరామర్శించారు. రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. నెలకొరిగిన అరటి తోటలు పరిశీలించారు.ఈ సందర్బంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రెండేళ్లలో వచ్చిన వరదలతో కరకట్ట పొడవునా అరటి, పసుపు, కంద, బొప్పాయి పంటలు నష్టపోగా రైతులకు నష్టపరిహారం సక్రమంగా అందలేదన్నారు. మూడు రోజులుగా ఈదురు గాలులు అసనీ తుఫాన్ మోపిదేవి మండలంలో అరటి, బొప్పాయి, మునగ, మామిడి రైతులకు భారీ నష్టం కలిగించినా ఇప్పటివరకు ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అసలు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉద్యానవన శాఖ అధికారి లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇక ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్.బీ.కే.ల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాంత రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందన్నారు. తెలంగాణ నుంచి విడిపోయి ఏర్పడిన తొలి నాళ్లలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 24గంటలు కరెంట్ ఇస్తే జగన్ విద్యుత్ సరఫరాలో విఫలం అయ్యారన్నారు.