Breaking News

ఎవరి దీమా వారిదే

ఎవరి దీమా వారిదే

  • సంస్థాగతంగా టీడీపీ బలోపేతం
  • అభివృద్ధి సంక్షేమంపై భరోసా
  • కొత్త పథకాలు ఆదరిస్తాయనే నమ్మకంతో టీడీపీ
  • పాదయాత్ర, ప్రత్యేక హోదాపై వైసీపీ ఆశలు
  • నవరత్నాలతో గెలుస్తామంటున్న వైసీపీ నేతలు

        జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్యే పోరు ఉంటుంది. ఉభయపార్టీలు ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని భావించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తృటిలో అధికారాన్ని కోల్పోయి ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. రైతు రుణమాఫీ, అమరావతి రాజధాని నిర్మాణం వంటి అంశాలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనుకోని రీతిలో నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు చావోరేవో అన్నట్లు తలపడబోతున్నాయి. ఆయా పార్టీలు ఇప్పటివరకు నిర్వహించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలతో మమేకమైన విధానాలు, ప్రజలకిచ్చే హామీలు తమను గెలుపుబాట వైపు తీసుకెళ్తాయనే నమ్మకంతో ఉన్నాయి.

        తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా గతంకంటే మరింతగా బలపడింది. క్షేత్రస్థాయిలో సేవామిత్రలు, బూత్ కమిటీ కన్వీనర్లు, ప్రాంతీయ సమన్వయకర్తలను వేల సంఖ్యలో నియమించడం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఇటీవలే పూర్తిచేశారు. రాష్ట్రంలో టీడీపీకి 65 లక్షలకుపైగా సభ్యులున్నారు. ప్రతి 100 మంది ఓటర్లకు, ఒకరు చొప్పున సేవామిత్రలను, ప్రతి బూత్ కు ఒక కన్వీనర్ ను, ప్రతి 10 బూత్ లకు ఒక ప్రాంతీయ కన్వీనర్ ను నియమించారు. పార్టీపరంగా ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ కేడర్ నిరంతరం ప్రజల్లో ఉండేలా చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం, సైకిల్ యాత్రలు, గ్రామదర్శిని వంటి పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రతి ఎమ్మెల్యే, నాయకులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికెళ్లేలా చేశారు. ప్రజల నుంచి విజ్నాపనలు స్వీకరించి, వాటిని ప్రభుత్వపరంగా పరిష్కరించారు. ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్టం చేశారు.

        జరగబోయే ఎన్నికల్లో గత అయిదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయం చేకూర్చిపెడతాయని టీడీపీ నమ్మకంతో ఉంది. ఇటీవల కాలంలో అమలుచేసిన పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛన్ రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచడం, అన్నదాత-సుఖీభవ వంటి పథకాలు విశేష ఆదరణ పొందాయని పార్టీ భావిస్తోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణుల్ని నిరంతరం ప్రజల్లో ఉంచడం తమకు కలిసొచ్చే అంశంగా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

        2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కసితో ఉంది. 2017లో గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోయే ప్రధాన హామీలైన నవరత్నాలను వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంపై మొదట్లో పూర్తిగా దృష్టిసారించిన జగన్, యువభేరుల పేరుతో విశ్వవిద్యాలయాలు, డిగ్రీ విద్యాసంస్థలు, నిరుద్యోగ యువతతో ఏపీవ్యాప్తంగా సభలు నిర్వహించారు. హోదా అంశమే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామని, ఎన్నికలయ్యాక కేంద్రంలో ఎవరు హోదా ఇస్తే వారి ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతు తెలుపుతామని జగన్ ప్రకటించారు. మరోవైపు ఎన్నికల్లో పోటీచేసే మెజార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి సిద్ధమయ్యారు.

2017 నవంబర్ లో ప్రారంభించి, 2019 జనవరి వరకు సుమారు 14 నెలలపాటు ప్రజాసంకల్పయాత్ర పేరుతో జగన్ పాదయాత్ర చేశారు. ఈ సమయంలోనే జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైన కసరత్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు జగన్ కి కూడా పాదయాత్ర సెంటిమెంట్ కలిసొస్తుందన్న ఆశాభావంతో వైసీపీ ఉంది. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ వైసీపీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా జిల్లాలవారీగా సమరశంఖారావం పేరుతో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఈ సభలు ఇప్పటివరకు కడప, అనంతపురం, నెల్లూరు, కాకినాడల్లో నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో సమర శంఖారావం సభలు కాకుండా జిల్లాల్లో బస్ యాత్రకు జగన్ సిద్ధపడుతున్నారు.

మొత్తంమీద వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా ఎన్నికల్లో తలపడనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *